Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైతులతో చేసుకున్న ఒప్పందాన్ని అమలు చేయాలి
నవతెలంగాణ-ఖమ్మంప్రాంతీయప్రతినిధి
సుబాబుల్ , జామాయిల్ రైతుల సమస్యలకు సంబంధించి ఏప్రిల్ 4, 2018న రైతులు, రైతు సంఘాల ప్రతినిధులతో చేసుకున్న ఒప్పందాన్ని తూచ తప్పకుండా సకాలంలో అమలు జరిగేటట్లు తక్షణ చర్యలు తీసుకోవాలని టిఆర్ఎస్ లోక్‌సభా పక్ష నేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు ఐటిసి సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అనిల్ రాజ్‌పుత్‌ను కోరారు. రాబోవు శీతాకాల పార్లమెంట్ సమావేశాలను పురస్కరించుకొని కమిటీ మీటింగ్‌లలో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్లిన ఎంపి నామ ఈ సందర్భంగా ఐటిసి సీనియర్ ప్రెసిడెంట్ అనిల్ రాజ్‌పుత్‌తో గురువారం ప్రత్యేకంగా భేటీఅయ్యారు. ఈ సందర్భంగా సుబాబుల్, జామాయిల్ రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కోరారు. గతంలో రైతులతో చేసుకున్న ఒప్పందాన్ని సక్రమంగా అమలు చేయకపోవడం వల్ల రైతులు అనేక సమస్యలతో ఇబ్బందిపడుతున్నారని తెలిపారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని ఐటిసి ఛైర్మన్‌కి గతంలో రాసిన లేఖలు, రైతులతో చేసుకున్న ఒప్పంద ప్రతిని వైస్ ప్రెసిడెంట్ కు అందజేశారు. ఇప్పుడున్న పరిస్ధితులలో సాగు ఖర్చు భారంగా మారటంతో టన్నుకు కనీస మద్దతు ధర రూ||6,500/- వరకు చెల్లించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారన్నారు. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా రైతుల నుంచే ముడి కర్రను కొనుగోలు చేయాలని కోరారు. కర్ర తోలు తీసి, సరఫరా చేయాలని అనడం సబబు కాదన్నారు. రైతులకు సకాలంలో కొనుగోలు చేసేందుకు ఉత్తర్వులు (పర్చేజ్ ఆర్డర్స్) ఇవ్వాలని అన్నారు. మూడేళ్లు, ఆపై వయస్సున్న కర్ర కొనుగోళ్లకు సత్వరమే ఎటువంటి జాప్యం లేకుండా పర్చేజ్ ఆర్డర్స్ ఇవ్వాలని కోరారు. రైతులు ముడి కర్రను యాజమాన్యం వద్దకు తీసుకు వెళ్లినప్పుడు సకాలంలో సరుకును దిగుమతి చేసుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. సకాలంలో ముడి సరుకును దిగమతి చేసుకోకపోవడం వల్ల సమయాభావంతో పాటు రవాణా చార్జీల వల్ల రైతులపై ఆర్ధిక భారం పడుతుందని తెలిపారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సంస్ధకు కావాల్సినంత సుబాబుల్, జామాయిల్ దిగుబడి ఉందని, ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచే భారీ మొత్తంలో కర్ర కొనుగోళ్లు జరపాలని నామ కోరారు. ప్రకృతి వైపరిత్యాల వల్ల సంభవించే నష్టాల నుంచి రైతులను కాపాడేందుకు ప్రతి ప్లాంటేషన్‌కు ఇన్స్యూరెన్స్ చేయాలని కోరారు. గతంలో రైతులు తనను కలిసి సమస్యలు వివరించగానే జిల్లా కలెక్టర్‌తో మాట్లాడి, ఖమ్మంలో రైతులు, రైతు సంఘాల ప్రతినిధులతో సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేయించానని తెలిపారు. ఆ సమా వేశంలో వారు లేవనెత్తిన పలు సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఐ.టి.సి. యాజమాన్యంతో మాట్లాడిన సంగతిని ఎంపీ నామ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇప్పటికైనా యాజమాన్యం స్పందించి, సుబాబుల్, జామాయిల్ రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని లేని యెడల రాబోవు పార్లమెంట్ సమావేశాల్లో ఈ అంశాన్ని లేవనెత్తుతానని ఎంపీ నామ నాగేశ్వరరావు ఐటిసి సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌ను తెలిపారు.