Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కెవిపిఎస్ ధర్నా కరపత్రాల ఆవిష్కరణ
నవతెలంగాణ- ఖమ్మం
దళిత బంధు, ఎస్సి,ఎస్టీ రాష్ట్ర కమిషన్ చైర్మన్ ఏర్పాటు, కార్పొరేషన్ రుణాల కోసం నవంబర్ 2, 3 తేదీలల్లో కెవిపిఎస్ ఆధ్వర్యంలో తహశీల్దార్ కార్యాలయాల ఎదుట దళితులు పెద్దఎత్తున ధర్నాలు నిర్వహించాలని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా కార్యదర్శి నందిపాటి మనోహర్ పిలుపు నిచ్చారు. గురువారం కెవిపియస్ జిల్లా కమిటీ సమావేశం సంఘం జిల్లా అధ్యక్షులు ముత్తమాల ప్రసాద్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో మనోహర్ మాట్లాడుతూ దళిత బంధు కేవలం హుజూరాబాద్‌కే పరిమితం చేయకుండా రాష్ట్రంలోని ప్రతి దళిత కుటుంబానికి ఇవ్వాలన్నారు. మూడేళ్ళ నుండి ఎస్సీ కార్పోరేషన్ రుణాలు ఇవ్వడం లేదని, ఇండిస్టియల్ ద్వారా అందుతున్న రుణాలకు సబ్సిడీలు రావడం లేదన్నారు. ఎస్సీ ఎస్టీ బ్యాక్ లాగ్ పోస్టులను భర్తీ చేయడం లేదన్నారు. పేదలకు భూములు ఇవ్వక పోగా ఏళ్ల తరబడి దళితులు, గిరిజనుల ఖాస్తులో ఉన్న అస్సెన్డ్, ఇనామ్, బంచరాయి భూములను, అటవీ భూములను డంపింగ్ యార్డులు, రైతు మార్కెట్లు, పల్లె ప్రకృతి వనాల పేరిట పేదల భూములు లాక్కొని పెద్దలకు కారుచౌకగా కట్టబెట్టడం దుర్మార్గమన్నారు. కెవిపిఎస్ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈనెల 21న ఖమ్మం జిల్లా కలెక్టరేట్ ఎదుట దళితులు పెద్దఎత్తున ధర్నా చేసి జిల్లా కలెక్టర్ కు మొరపెట్టుకున్నా ఫలితం లేకుండా పోయిందని, దళితుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పెడచెవిన పెట్టడాన్ని నిరసిస్తూ నవంబర్ 2,3 తేదీల్లో మండల కేంద్రాల్లో ధర్నాలు నిర్వహించాలన్నారు. సమావేశంలో కెవిపిఎస్ జిల్లా నాయకులు నందిగామ కృష్ణ, కుక్కల సైదులు, పాపిట్ల సత్యనారాయణ, పి.నాగరాజు, సాగర్ తదితరులు పాల్గొన్నారు.