Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వీరిరువురి మధ్య నలుగుతున్న పిల్లలు
- ఆరు వారాలుగా అందని(గుడ్డు) పౌష్టికాహరం
ఇంటి వద్దే వంట
నవతెలంగాణ-అశ్వారావుపేట
ప్రధానోపాధ్యాయురాలుకు మధ్యాహ్నం భోజనం కార్మికురాలుకు మధ్య తలెత్తిన మనస్పర్ధలతో అభశుభం తెలియని పిల్లలు నలిగిపోతున్నారు. వీరిరువురి వ్యక్తిగత గొడవలు తీవ్రస్థాయికి చేరి పిల్లలను పస్తులు ఉంచే దశకు చేరాయి. ఇది చిలికి చిలికి గాలివానలా మారి ఈ బడి గొడవ మండల కేంద్రానికి చేరింది.
వివరాలు... మండలంలోని నారంవారిగూడెం కాలనీలో గల ప్రాథమిక పాఠశాలలో 1 నుండి 5 తరగతుల్లో మొత్తం 47 మంది విద్యనభ్యసిస్తున్నారు. ఈ పాఠశాల ప్రాంగణంలో పైకా భవనంతో మరో మూడు భవనాలు ఉన్నాయి. అయితే ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు నాగలక్ష్మి సింగిల్ టీచర్ కావడంతో ఐదు తరగతులు విద్యార్ధులను ఒకే గదిలో కూర్చుని బెట్టి బోధన చేస్తున్నారు. కాగా ఈ పాఠశాలలో తరుచూ వివాదాలు చోటు చేసుకోవడం, వీటిని ఆ శాఖ మండల స్థాయీ అధికారులు సర్దుబాటు చేయడం పరిపాటిగా మారింది.
ఈ క్రమంలో వంట కార్మికురాలు తాళ్ళ తిరుపతమ్మకు ఉపాధ్యాయురాలు నాగలక్ష్మికి సమన్వయం కుదరక పోవడంతో ఈ గొడవ కాస్తా బహిర్గతం అయి మంగళవారం వంట చేయక పోవడంతో ఎం.ఇ.ఒ ప్రమేయంతో ప్రత్యామ్నాయంగా పిల్లలకు మధ్యాహ్నం భోజనం సమకూర్చారు.
ఈ విషయం అయి బుధవారం నవతెలంగాణ ఆ పాఠశాలను పరిశీలించగా ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ పాఠశాలలో( ఎస్ఎంసి) విద్యాకమిటీ పాలక వర్గం పంక్షనింగ్ లేదని ఋజువు అయింది. మూడేళ్ళ క్రితం ఏర్పాటైన పాలక వర్గం సభ్యుల పిల్లలు ఈ బడిలో ప్రస్తుతం లేకపోవడంతో వారు తనకేమే పట్టనట్లు వ్యవహరిస్తున్నారు.
పిల్లలకు పౌష్టికాహారంగా ఇవ్వాల్సిన కోడిగుడ్డు, కరోనా లాక్ డౌన్ అనంతరం పాఠశాలలు తెరిచినప్పటి నుండీ మధ్యాహ్నం భోజనం కార్మికురాలు ఇవ్వడం లేదని స్వయానా ప్రాధానోపాద్యాయురాలే అంగీకరించారు. మరి మీరెందుకు ఉపేక్షించారని అంటే రేపు పెడతా మాపు పెడతా అంటూ కాలం వెళ్ళదీసిందని అన్నారు.
ఇదే విషయంపై మిడ్డే మీల్ వర్కర్ తిరుపతమ్మను వివరణ కోరగా ప్రధానోపాద్యాయురాలి ప్రవర్తనే సరిగా లేదని, వ్యక్తిగత దూషణలకు దిగుతూ మనోక్షోభకు గురిచేస్తుంది వాపోయింది. బిల్లులు సరిగా రాక నెలకు రూ.7 వేలు అప్పు చేసి పిల్లలకు భోజనం వడ్డిస్తున్నాని ఆమె తెలిపారు. ఈ టీచర్ ఇక్కడ ఉంటే అసలు వంటే చేయనని ఖరాఖండిగా తేల్చి చెప్పింది.
గ్రామస్తులు సైతం ఇరువర్గాలుగా చీలి ఈ ఇరువురికి వంత పాడటం కొసమెరుపు. కాగా ఈ ఆరు వారాలుగా ''గుడ్లు కి బిల్లు చేసారా లేక చేయలేదా అనేది వేచిచూడాలి.
ఉన్నతాధికారులు దృష్టికి తీసుకెళ్తా : ఎం.ఇ.ఒ క్రిష్ణయ్య
ఈ విషయం అయి ఎంఈవోని వివరణ కోరగా ఉన్నతాధికారులు దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు.