Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేజీబీవీ ఉపాధ్యాయునుల జీతాలు వెంటనే చెల్లించాలి
- ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి
నవతెలంగాణ-గుండాల
ప్రభుత్వ పాఠశాలల్లో పారిశుధ్య కార్మికులను నియమించాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి డిమాండ్ చేశారు. గురువారం మండలంలోని పలు పాఠశాలలను సందర్శించారు. అనంతరం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాల్లో పని చేస్తున్న ఉపాధ్యాయునుల జీతాలు ఇంకా వారి ఖాతాల్లో జమ కాలేదని, జాప్యం లేకుండా వెంటనే వారి వారి ఖాతాల్లో జమ చేయాలని విజ్ఞప్తి చేశారు. సంక్షేమశాఖలోని పాఠశాలల నిర్వహణ గ్రాంట్స్ మంజూరు చేయాలన్నారు. మధ్యాహ్న భోజన వర్కర్ల జీతాలు పెంచడంతో పాటు నెల నెల వారి బిల్లులను చెల్లించాలని, అన్ని శాఖలలో పని చేస్తున్న సిబ్బంది సమస్యలు పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో హెచ్ఎం కిషన్, ఉపాద్యాయ సిబ్బంది పాల్గొన్నారు.
జాప్యం లేకుండా జీతాలు జమచేయాలి : ఎమ్మెల్సీ
ఆళ్ళపల్లి : కస్తూరి భా గాంధీ బాలికల విద్యాలయాల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల వేతనాలు ఇంకా వారి వ్యక్తిగత బ్యాంక్ ఖాతాల్లో జమ కాలేదని, జాప్యం లేకుండా వెంటనే వారి ఖాతాల్లో జమ చేయాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం ఆయన మండల పరిధిలోని ముత్తాపురం, అనంతోగు, ఆళ్ళపల్లి, పాతూరు, మర్కోడు గ్రామాల్లోని పాఠశాలలను సందర్శించి, ఆయా పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మండల కేంద్రం హైస్కూల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ విద్యా రంగంలో ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు కలిసి పనిచేయాలని సూచించారు. ప్రభుత్వ అన్ని పాఠశాలల్లో పారిశుద్ధ్య కార్మికులను నియమించాలన్నారు. గిరిజన సంక్షేమ శాఖలోని పాఠశాలలకు పాఠశాల నిర్వహణ గ్రాంట్స్ మంజూరు చేయాలని, ఎస్.ఎస్.ఏ శాఖలో పనిచేస్తున్న సిబ్బంది జీతాలు పెంచాలని, ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక మండల విద్యాశాఖాధికారి పి.కృష్ణయ్య, టీఎస్ యూటీఎఫ్ జిల్లా ఉపాధ్యక్షురాలు వి.వరలక్ష్మి, కార్యదర్శులు జి.సక్రాం, ఇ.హతిరామ్, టీపీటీఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు జోగ రాంబాబు, నాయకులు చాట్ల శ్రీనివాస్, లక్ష్మీనారాయణ, బిక్షమయ్య, టీఎస్ యూటీఎఫ్ నాయకులు భాస్కర్, నాగరాజు, చిరంజీవి, జి.శ్రీను, శారద, పద్మ, పాల్గొన్నారు.