Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తల్లీబిడ్డ మృతి
- మృతదేహంతో ఆందోళన
నవతెలంగాణ-కొత్తగూడెం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో మృతదేహం తరలింపులో ఉద్రిక్తత, హైడ్రామా చోటుచేసుకుంది. బాధిత కుటుంబ సభ్యులు, గ్రామవాసులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు గురువారం ఆందోళన చేశారు. అసుపత్రి ముందు బైఠాయించారు. పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి ఆళ్ల పల్లి మండలం మర్కోడు గ్రామానికి చెందిన భాగ్యలక్ష్మి ప్రసవం కోసం ఆళ్లపల్లి పీహెచ్‌సీకి వెళ్లారు. అక్కడ ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడంతో భాగ్యలక్ష్మిని కొత్తగూడెంలోని జిల్లా హాస్పిటల్‌కు ఈ నెల 24న ఆదివారం తీసుకువచ్చారు. అదేరోజు రాత్రి డెలివరీ చేయగా బాబు పుట్టాడు. బాబు పరిస్థితి కొంత ఆందోళనకరంగా ఉండటంతో భద్రాచలంలోని గవర్నమెంట్ హాస్పటల్‌కు తీసుకువెళ్లారు. చికిత్స పొందుతూ బాబు మృతి చెందాడు. ఇదిలా ఉండగా తల్లి పరిస్థితి విషమంగా మారింది. పరిస్థితి మరింత విషమంగా ఉండడంతో ఖమ్మం నుంచి హైదరాబాద్‌కు తరలిస్తుండగా బుధవారం రాత్రి మృతి చెందారు. కొత్తగూడెం ఏరియా అసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తన భార్య, పుట్టిన శిశువు మృతి చెందినట్లు ఆరోపిస్తు కొత్తగూడెం ఏరియా అసుపత్రికి మృతదేహన్ని తీసుకు వచ్చే ప్రయత్నం చేశారు. మార్గమధ్యలో పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో భాగ్యలక్ష్మి బంధువులు అంబులెన్స్ కు అడ్డంగా నిలబడి నిరసన తెలిపారు. డాక్టర్ల నిర్లక్ష్యం మూలంగానే భాగ్యలక్ష్మి మృతి చెందారని ఆరోపిస్తూ సిపిఐ, సిపిఎం, సిపిఐ న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో కొత్తగూడెం గవర్నమెంట్ హాస్పిటల్ ఎదుట ధర్నా చేపట్టారు. ఈ క్రమంలో ఇల్లందువైపు వెళ్లే అంబులెన్స్‌ను తిరిగి కొత్తగూడెం గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొచ్చారు. కొత్తగూడెం డీఎస్పి వెంకటేశ్వర బాబు మృతురాలి బంధువులతో చర్చలు సాగించారు.
డాక్టర్ పై చర్యలు తీసుకోవాలి....రాజకీయ పార్టీల డిమాండ్
మృతురాలి కుటుంబానికి న్యాయం చేయాలని బాలింత భాగ్యలక్ష్మీ, శిశువు మృతికి కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని వామపక్ష పార్టీ నాయకులు ఆందోళన చేశారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే ప్రాణం మీదికి తెచ్చి చేతులెత్తేసి వారి ప్రాణాలు బలితీసుకున్నారని ఆరోపించారు. పోలీసుల చర్చల ద్వారా, జిల్లా కలెక్టర్‌కు సమాచారం అందజేశారు. సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కందగట్ల సురేందర్ అధ్యక్షతన ఆందోళన కార్యక్రమం కొనసాగింది. సిపిఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఎస్కె. సాబీర్ పాషా, సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ గుండాల ఎంపీపీ ముక్తి సత్యం, పట్టణ కార్యదర్శి సురేందర, ఎస్కె.ఉమర్, మర్కోడు మాజీ ఎంపిటిసి హనుమంతు, బట్టు ప్రసాద్, కొమరం సత్యం, నరేష్, యాసారపు వెంకన్న, సిపిఐ మహిళా సంఘం నాయకురాలు రత్నకుమారి, జమలయ్య , సిపిఎం జిల్లా నాయకులు అన్నవరపు సత్యనారాయణ, లిక్కి బాలరాజు, మహిళా సంఘం నాయకురాలు, ఎం.జ్యోతి పాల్గొన్నారు.