Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పర్యాటక విహార యాత్ర కు గ్రీన్ సిగల్..
- వచ్చే నెల 7 నుంచి యాత్ర ప్రారంభం
- ఏపీ ప్రభుత్వ ప్రకటన.. తెలంగాణలో హర్షం
ఎట్టకేలకు పాపికొండల పర్యాటక విహార యాత్ర మొదలుకానుంది. అమితంగా పర్యాటకులను ఆకట్టుకునే పాపికొండల పర్యాటక బోటు విహార యాత్రకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి యం. శ్రీనివాసరావు ప్రకటనతో తెలంగాణలో సందడి మొదలు కానుంది. వచ్చే నెల 7వ తేదీ నుంచి ఈ పర్యాటక యాత్ర ప్రారంభం కానున్నట్లు ప్రకటించడంతో సుమారు 25 నెలల సుదీర్ఘ విరామం తర్వాత గోదావరి అందాల నడుమ పర్యాటక విహార యాత్ర ప్రారంభం కానుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రకటనతో తెలంగాణ రాష్ట్రంలో పర్యాటకుల సందడి ప్రారంభం కానుంది.
నవతెలంగాణ-భద్రాచలం
25 నెలల తర్వాత...
ఏపీ రాష్ట్రంలోని పాపికొండల పర్యాటక విహార యాత్రకు విపరీతమైన క్రేజు ఉంది. అయితే 2019వ సంవత్సరం సెప్టెంబర్ 15వ తేదీన తూర్పు గోదావరి జిల్లా కచ్చులూరులో బోటు ప్రమాదం జరిగింది. దీంతో యాత్ర నిలిచి పోయింది. దీని ప్రభావం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ని బోటు నిర్వాహ కులు, బోటు ఆపరేటర్లు తదితర కుటుంబాలపై తీవ్రంగా పడింది. ఇదిలా ఉండగా ఆంధ్ర ప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లా పోచమ్మ గుడి నుంచి ఇకపై పాపికొండలు పర్యాటక యాత్ర సాగనుంది. రూ.1250 టిక్కెట్ ధరను నిర్ణయించారు. పాపికొండలు పర్యాటక తెలంగాణ రాష్ట్రంలోని పర్యాటకులు భద్రాచలం మీదుగా ఏపీలో ఉన్న రామచంద్రపురం మండలంలోని పోచారం గ్రామం నుంచి పాపికొండలు వెళ్లేందుకు రూ.1100 చెల్లించాల్సి ఉంటుంది. అదేవిధంగా పర్యాటకులు నేరుగా తమ సొంత వాహనాల్లో బోటు ప్రారంభమయ్యే ప్రాంతానికి చేరుకుంటే కేవలం రూ.900 పర్యాటకుల నుంచి తీసుకోవాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. పర్యాటకుల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ ప్రభుత్వం తీసుకోనుంది. అదేవిధంగా వరరామ చంద్రాపురంలోని పోచారం వద్ద సుమారు 30 లాంచీలు ఉన్నాయి. పోలవరం బ్యాక్ వాటర్ వచ్చిన సమయంలో ఏ మేరకు తగిన సామర్థ్యం కలిగి ఉంటాయి. అనే దానిపై ఉన్న అనుమానాలకు చెక్ పెడుతూ ప్రభుత్వం, అధికారులు పలు నిబంధనలు విధించారు. లాంచీలకు అనుమతులు రావాలంటే కొత్తగా నిబంధనలు కఠినతరం చేయడంతో, కట్టుదిట్టంగా ఈసారి పాపికొండలు పర్యాటక విహారయాత్ర సాగనుంది.
బోటు ఆపరేటర్లతో వాట్సాప్ గ్రూప్..
బోటు ఆపరేటర్లతో ఒక వాట్సప్ గ్రూపు ఏర్పాటు చేయాలని, దాని వల్ల సకాలంలో వారికి సమాచారాన్ని అందించేందుకు వీలవుతుందని ప్రభుత్వం నిర్ణయించింది. అదేవిధంగా బోటు ప్రారంభమయ్యే సమయంలో అనుమతినిచ్చిన ప్రతి ఒక్కరూ పోర్టు నిబంధనల మేరకు సామర్థ్యం కలిగిన లైఫ్ జాకెట్లు ధరించాలి.
గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచాలి. తదితర నిబంధనలు మార్గదర్శకాలను మరింత కఠినతరం చేసేలా ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బోటులో ప్రయాణికులు పర్యాటకులు పాపికొండలకి వెళ్లాలంటే ముందుగా వారి ఆధార్ నెంబరు, వారిపేరు, సెల్ నెంబరు, ఏ ఊరు నుంచి వస్తున్నారు అన్న వివరాలు తప్పక పొందుపరచాలని నిబంధనలు పెట్టారు. అదే విధంగా కంట్రోల్ రూమ్లో ఉండే రెవిన్యూ ,పర్యాటక, పోలీస్ శాఖ అధికారులకు బోటులో వెళ్లే వారి పూర్తి వివరాలు అందజేయవలసి ఉంటుంది. అదే విధంగా బోటులో ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా మద్యం సేవిస్తే వారిని అరెస్ట్ చేయడంతో పాటు బోటును సీజ్ చేసేందుకు నిబంధనలను కఠినతరం చేశారు. అలాగే పర్యాటకుల భద్రత పై ప్రధానంగా దృష్టి సారించింది.
పాపికొండల యాత్ర తో భద్రాద్రికి కళ..
తెలంగాణ రాష్ట్రం నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన పర్యాటకులు పాపికొండల పర్యాటక యాత్రకు వెళ్లాలంటే ముందుగా భద్రాద్రి రామయ్య దర్శించుకుని వెళ్తుంటారు. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం పర్యాటక విహార యాత్రకు గ్రీన్ సిగల్ ఇవ్వడంతో భద్రాచలంలో ఇప్పటివరకూ మూతపడ్డ బోటు నిర్వాహకుల ఏజెంట్ కార్యాలయాలకు కొత్త కళ సంతరించుకుంది. అదేవిధంగా పర్యాటకులు, భక్తులు భద్రాచలం రామయ్య దర్శనం చేసుకొని ఇక్కడ నుంచి విహార యాత్రకు బయలు దేరనుండడంతో రామయ్య ఆదాయం పెరిగే అవకాశాలు ఉన్నాయి.