Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీలో టిఆర్ఎస్, కాంగ్రెస్ నాయకుల బాహాబాహీ
- ఒకరిపై ఒకరు విసురేసుకున్న వాటర్ బాటిళ్లు
- రెండు గంటలపాటు యుద్ధవాతావరణం
నవతెలంగాణ - బోనకల్
కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం కాంగ్రెస్, టిఆర్ఎస్ నాయకుల, కార్యకర్తల మధ్య బాహాబాహీకి దారి తీసింది. రెండు గంటల పాటు యుద్ధ వాతావరణం నెలకొంది. కాంగ్రెస్, టిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు దూషణలతో ఒకరిపై ఒకరు తోచుకున్నారు. పోలీసుల సమక్షంలోనే ఈ సంఘటన చోటు చేసుకోవడం విశేషం. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మండల కేంద్రంలోని రైతు వేదిక నందు కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని అధికారులు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి మధిర ఎమ్మెల్యే, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు హాజరయ్యారు. ప్రారంభ కార్యక్రమంలో జడ్పీటీసీ మోదుగు సుధీర్ బాబు తమ ప్రసంగాన్ని ప్రారంభించారు. తన ప్రసంగంలో మధిర ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క కల్యాణ లక్ష్మి పథకంలో దరఖాస్తులపై సంతకాలు చేయకపోవడం వల్లే సకాలంలో రావడం లేదని ప్రచారం చేస్తున్నారని, ఇది సరైంది కాదని అన్నారు. బోనకల్ మండలంలో అటువంటిది ఏమైనా జరిగిందా అని తాసిల్దార్ రావూరి రాధికను జడ్పిటిసి అడిగారు. దీంతో తాసిల్దార్ అటువంటిదేమీ లేదని వేదికపైనే స్పష్టం చేశారు. ఆ తర్వాత జడ్పీటీసీ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ ఉండగా రావినూతల టిఆర్ఎస్ సర్పంచ్ కొమ్మినేని ఉపేందర్ జడ్పిటిసిపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు సభా వేదిక వద్దకు దూసుకువచ్చారు. ఆ వెంటనే టిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు వేదిక వద్దకు దూసుకువచ్చి బాహాబాహీకి దిగారు. దాదాపు అరగంట పాటు ఒకరిని మరొకరు తోచుకున్నారు. ఇరువర్గాల వారిని బోనకల్ ఎస్ఐ బీ కొండల్ రావు, శిక్షణ ఎస్ఐ మాలోతు సురేష్, పోలీసు సిబ్బంది ఎంత వారించినా వినకుండా కేకలు వేసుకుంటూ ఒకరిపై మరొకరు దూసుకు వచ్చారు. కాంగ్రెస్ వైపు నుంచి కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి పైడిపల్లి కిషోర్ కుమార్ కాంగ్రెస్ కార్యకర్తలను వారించే ప్రయత్నం చేశారు. టిఆర్ఎస్ నాయకులు మాత్రం కాంగ్రెస్ కార్యకర్తలపైకి దూసుకు వచ్చారు. అదే సమయంలో పోలీసులు రెండు వర్గాల వారిని వేరువేరుగా బయటకు పంపించే ప్రయత్నం చేసినా ఫలితం దక్కలేదు. సుమారు గంట పాటు తీవ్ర వాగ్వాదం, తోపులాట తర్వాత మరల జడ్పిటిసి తన ప్రసంగాన్ని పునః ప్రారంభించారు. ఈ సమయంలో మరలా టిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కేకలు వేశారు. ఆ తర్వాత జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు తన ఉపన్యాసాన్ని ప్రారంభించారు. తన ఉపన్యాసంలో కల్యాణ లక్ష్మి మంజూరులో రాజకీయాలకు ఎటువంటి తావులేదని స్పష్టం చేశారు. ఇదే సమయంలో జడ్పీటీసీ తాను కూడా ఇదే విషయాన్ని చెబుతున్నానని అంటుండగానే ఒక్కసారిగా టిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు మరలా జెడ్పిటిసి వైపు, వేదిక వైపు దూసుకు వచ్చారు. దీంతో మరలా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పోటీగా వేదిక వద్దకు దూసుకువచ్చారు. ఈ సమయంలో జడ్పీ చైర్మన్, జడ్పిటిసి మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది. ఈ సమయంలో జడ్పిటిసి, జెడ్పీ చైర్మన్ ఒకరినొకరు తోచుకున్నారు. దీంతో మరల ఇరువర్గాల వారు ఒకరి మరొకరు తోచుకున్నారు. ఈ సమయంలో ఇరువర్గాల వారు చేతులు చేతులు కలిశాయి. పెద్ద ఎత్తున బూతులు తిట్టుకున్నారు. టిఆర్ఎస్ నాయకులు మౌత్ని లాగి గోడకు విసిరి కొట్టారు. ఆ తర్వాత కాంగ్రెస్ నాయకులు మంచినీళ్ళ బాటిల్ విసిరి వేశారు. ఈ క్రమంలో లింగాల కమల్రాజుకు వాటర్ బాటిల్ తగిలింది. ఆ తర్వాత ఒకసారి ఒక దశలో ఇరువర్గాల వారు కుర్చీలు లేపే ప్రయత్నం చేశారు. పోలీసులు మందలించడంతో కుర్చీలకు పనిపెట్టలేదు. కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు కమల్ రాజు డౌన్ డౌన్ టిఆర్ఎస్ డౌన్ డౌన్ అంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. దీనికి ప్రతిగా టిఆర్ఎస్ నాయకులు భట్టి విక్రమార్క డౌన్ డౌన్ అభివృద్ధి నిరోధి భట్టి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేసి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలపైకి దూసుకు వచ్చారు. రెండు గంటల అనంతరం భట్టి విక్రమార్క, లింగాల కమల్ రాజు కలిసి కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఆ తర్వాత రైతు వేదిక లోనే ఒక ద్వారం నుంచి కమల్ రాజు మరొక ద్వారం నుంచి బట్టి విక్రమార్క బయటకు వెళ్లారు. ముందుగా కమల్ రాజు తన అనుచరుల వర్గంతో తాసిల్దార్ కార్యాలయం ఎదురుగా ఉన్నారు. ఆ తర్వాత మల్లు భట్టి విక్రమార్క తన అనుచరులతో నడుచుకుంటూ తాసిల్దార్ కార్యాలయంలోకి వెళ్లడానికి ప్రయత్నించి విరమించుకొని నేరుగా తాసిల్దార్ కార్యాలయం ముందు నుంచి మండల పరిషత్ కార్యాలయానికి బయలుదేరారు. దీంతో టిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు మల్లు భట్టి విక్రమార్క కు అడ్డుగా నిలబడ్డారు. పోలీసులు అతి కష్టం మీద టిఆర్ఎస్ నాయకులను పక్కకు తప్పించారు. ఇరు వర్గాల వారు పెద్దఎత్తున నినాదాలతో ఒకరిపై ఒకరు దూసుకు వచ్చారు. ఈ తతంగమంతా సుమారు రెండు గంటల పాటు సాగింది. చూసుకుందాం రాండి అంటే చూసుకుందాం రాండి అంటూ ఒకరినొకరు సవాల్ ప్రతి సవాళ్లు విసురుతున్నారు.
కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ
106 మందికి కల్యాణ లక్ష్మి చెక్కులు, ఏడుగురికి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కంకణాల సౌభాగ్యం, జెడ్పిటిసి మోదుగ సుధీర్ బాబు, తాసిల్దార్ రావూరి రాధిక, ఎంపీడీవో గొట్టిపాటి శ్రీదేవి, మధిర వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చిత్తారు నాగేశ్వరరావు, ఆత్మ కమిటీ జిల్లా చైర్మన్ రంగిశెట్టి కోటేశ్వరరావు, మండల పరిషత్ ఉపాధ్యక్షుడు గుగులోతు రమేష్, మండల పరిషత్ కోఆప్షన్ సభ్యులు షేక్ జమాలుద్దీన్, వివిధ గ్రామాల సర్పంచులు కేతినేని ఇందు, మర్రి తిరుపతిరావు, బుక్యా సైదా నాయక్, జెర్రిపోతుల రవీంద్ర, ఎర్రంశెట్టి సుబ్బారావు, చిలక వెంకటేశ్వర్లు, ఎంపీటీసీలు సండ్ర శ్రీలక్ష్మి, కర్లకుంట దేవమణి పాల్గొన్నారు.
మధిరలోనూ అదే తంతు...
మధిర: మధిర తహశీల్దార్ కార్యాలయంలో కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీని తహశీల్దార్ డి.సైదులు అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క, జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ముందుగా సభలో జిల్లా పరిషత్ చైర్మన్ కమల్ రాజు మాట్లాడుతూ మధిర నియోజకవర్గంలో అధికారిక కార్యక్రమాలకు ప్రతిసారి శాసనసభ్యులు మల్లు భట్టి విక్రమార్క ఆలస్యంగా వస్తున్నారని, దీనివల్ల ప్రజా ప్రతినిధులు, అధికారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. అంతేకాకుండా మధిర నియోజకవర్గంలో కల్యాణ లక్ష్మి చెక్కులు ఆలస్యంగా లబ్ధిదారులకు అందటానికి కూడా భట్టి విక్రమార్క సకాలంలో సంతకాలు చేయకపోవడమే కారణమన్నారు. మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ నియోజకవర్గంలో కల్యాణలక్ష్మి చెక్కులు ముఖ్యమంత్రి పంపిణీ చేయడం లేదన్నారు. పరిపాలనలో బిజీగా ఉండటంవల్ల ముఖ్యమంత్రికి అది సాధ్యం కాకపోవచ్చు. ప్రతిపక్ష నేతగా తాను కూడా బిజీగా ఉన్నా మధిర నియోజకవర్గంలో కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ సకాలంలోనే పంపిణీ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్రంలో బడ్జెట్ లేకపోవడం వల్లే కల్యాణ లక్ష్మి చెక్కులు రావడం ఆలస్యం జరుగుతుంది తప్ప తన వల్ల కాదన్నారు. ఈ నెల 26వ తేదీన కల్యాణలక్ష్మి చెక్కులు వస్తే తాను వెంటనే సంతకం చేశానని ఆయన తెలిపారు. ఒకవేళ ఇతరత్రా పనులు వల్ల తాను రాకపోతే లబ్ధిదారులకు తక్షణమే చెక్కులు అందించాలని గతంలో తహసిల్దార్‌కు చెప్పటం జరిగిందని భట్టి చెబుతున్న సమయంలో.. జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు మధ్యలో మాట్లాడుతూ మండల ప్రజాప్రతినిధులు లేకుండా చెక్కులు ఎలా పంపిణీ చేస్తారంటూ అనటంతో.. భట్టి విక్రమార్క కల్పించుకొని సభా మర్యాద పాటించాలని కమల్ రాజుకి భట్టీ చెప్పటంతో తెరాస, కాంగ్రెస్ కార్యకర్తల ఒక్కసారిగా లేచి వాగ్వాదానికి దిగారు. ఇరు పార్టీల కార్యకర్తలు తోపులాడుకున్నారు. ట్రైనీ ఎస్సై సమాచారం తెలిపిన వెంటనే సీఐ మురళి సంఘటనా స్థలానికి చేరుకొని ఇరు పార్టీ నేతలకు సర్ది చెప్పటంతో ఇరు పార్టీలకు చెందిన నాయకులు శాంతించారు. అనంతరం 46 మందికి కల్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో మున్సిపాలిటీ చైర్పర్సన్ మొండితోక లత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చిత్తారి నాగేశ్వరరావు, ఆత్మ కమిటీ చైర్మన్ రంగిశెట్టి కోటేశ్వరరావు, సొసైటీ అధ్యక్షులు బిక్కి ప్రసాద్, ఎంపీపీ లలిత, టిఆర్ఎస్ మండల అధ్యక్షులు శ్రీనివాసరావు, కాంగ్రెస్ మండల అధ్యక్షులు సూరం శెట్టి కిషోర్, సర్పంచులు ఎంపీటీసీలు వార్డ్ నెంబర్లు తదితరులు పార్టీ నాయకులు పాల్గొన్నారు.
ముదిగొండ : తెలంగాణ రాష్ట్రంలో మహిళల సాధికారతకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నో పథకాలు అమలు చేస్తున్నారని జిల్లాపరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు అన్నారు.మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం జరిగిన కళ్యాణలక్ష్మి, షాదీముభారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా అదనపు కలెక్టర్ స్నేహలత ప్రసవం ప్రభుత్వాస్పత్రిలో జరిగిందంటే ప్రభుత్వాస్పత్రుల పరిస్థితి ఎంత మెరుగుగా ఉందో అవగతమవుతుందన్నారు. ఎంఎల్ఏ భట్టి విక్రమార్క మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కువ పండింంచే వరి ధాన్యంను కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయబోమని అంటోందని, ఈవిషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి రైతులకు మేలు జరిగే నిర్ణయం తీసుకోవాలని కోరారు. సాగర్ నీటిని ఆంధ్ర పోతిరెడ్డిపాడుకు రోజుకు అదనంగా 11 టీఎంసీల నీటిని తరలించే కుట్రను అంతా కలిసి అడ్డుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ సామినేని హర్రిసాద్, జడ్పీటీసీ పసుపులేటి దుర్గ, వైస్‌ఎంపీపీ మంకెన దామోదర్, ఎంపీటీసీ సభ్యురాలు బలంతు జయమ్మ, ముదిగొండ గ్రామ సర్పంచ్ మందరపు లక్ష్మి, డిప్యూటీ తాసిల్దారు టీ కరుణాకర్ రెడ్డి, ఆర్ఐ ఎం ఏకవీర, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పి దుర్గాప్రసాద్, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు వాచేపల్లి లక్ష్మారెడ్డి, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ పోట్ల ప్రసాద్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కొమ్మినేని రమేష్ బాబు, మాజీ జడ్పీటీసీలు పసుపులేటి దేవేంద్ర, బుల్లెట్ బాబు, టిఆర్ఎస్ జిల్లా నాయకులు మీగడ శ్రీనివాస్ యాదవ్, పసుపులేటి వెంకట్, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎండి జావిద్, మహమ్మద్ అజ్గర్, తాటికొండ రమేష్, బిచ్చాల బిక్షం, అన్వేష్, ఎల్లయ్య టిఆర్ఎస్ నాయకులు ఊరుకొండ రాజు, పాము సిల్వరాజు, గడ్డం వెంకట్, నానబాల కిరణ్ కుమార్, ఎస్డి రఫీ, దేవరపల్లి అనంతరెడ్డి, వీరారెడ్డి, సీతారామయ్య తదితరులు పాల్గొన్నారు.
చెక్కుల పంపిణీలో రభస...
మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ సభలో అధికార, ప్రతిపక్ష నాయకుల, కార్యకర్తల మధ్య రభస జరిగింది. జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు, మధిర ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క సభలో పాల్గొని మాట్లాడిన అనంతరం చెక్కుల పంపిణీ కార్యక్రమం కొనసాగుతుండగా కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు కందిమల్ల వీరబాబు జోక్యం చేసుకొని తమ ఎమ్మెల్యేను తక్కువ చూపు చూస్తున్నారని అనటంతో ఒక్కసారిగా టిఆర్ఎస్ కార్యకర్తలు రభసకు దిగారు. దీంతో ఖమ్మం రూరల్ సీఐ సత్యనారాయణరెడ్డి జోక్యం చేసుకొని ఇరువర్గాలకు నచ్చచెప్పటంతో రభస సద్దుమణిగింది. కాగా అధికార, ప్రతిపక్ష పార్టీ నాయకులు, కార్యకర్తలు లింగాల, భట్టి నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేసుకుంటూ పోటాపోటీగా బయటకు వచ్చారు. ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకోకుండా ఖమ్మం రూరల్ ఏసిపి జి.బస్వారెడ్డి పర్యవేక్షణలో రూరల్ సీఐ సత్యనారాయణరెడ్డి భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.