Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భౌతిక దాడులతో ఉద్యమ విచ్ఛినానికి కుట్ర
- పోడుపై నోటిమాట కాదు నోటిఫికేషన్ ఇవాలి
- సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
నవతెలంగాణ-కారేపల్లి
సామ్రాజ్యవాద శక్తుల చేతిలో ప్రధాని మోడీ కీలుబొమ్మగా మారారని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు.శుక్రవారం కారేపల్లి మండల మహాసభ ఉసిరికాయలపల్లిలోని కామ్రేడ్ బాదావత్ సేట్రాం, రాచర్ల శ్రీనివాస్, ఈసం ఎల్లయ్య నగర్ ప్రాంగణంలో జరిగింది. ఈ మహాసభకు వడ్డె అజరుబాబు, తలారి దేవప్రకాశ్, సూరబాక ధనమ్మ అధ్యక్షత వర్గం వహించగా ముఖ్యఅతిధిగా హాజరైన తమ్మినేని మాట్లాడుతూ దేశాన్ని కార్పొరేట్ శక్తులకు తాకట్టు పెట్టిన మోడి దేశంలోని మిలటరీ వ్యవస్ధతో సహా అన్ని వ్యవస్ధలను చిన్నాభిన్నం చేస్తున్నాడన్నారు. రైతు వ్యతిరేక వ్యవసాయ, విద్యుత్ చట్టాలపై రైతాంగం 11 నెలలుగా వీరోచిత పోరాటాలు చేస్తుందన్నారు. రైతు ఉద్యమంపై కక్ష కట్టిన కాషాయిశక్తులు భౌతిక దాడులతో ఉద్యమాన్ని విచ్చిన్నానికి కుట్ర పన్నుతున్నారన్నారు. ఆ కుట్రలో భాగంగా జరిగిన లఖింపూర్ భేరి ఘటన మరవకముందే టిక్రీ సమీపంలో మహిళ రైతులపై ట్రక్ దూసుకపోనిచ్చి ఇద్దరి మహిళా రైతుల మృతికి కారణమైనారని తెలిపారు. రాష్ట్రంలో బీజేపీ అధ్యక్షులు బండి సంజరు వరి పంట కొనుగోళ్లపై దొంగ దీక్షలకు దిగారన్నారు. వరి పంట కొనుగోలు చేయవద్దని కేంద్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి ఉత్తర్వులు ఇచ్చారని, దానిని ఇన్నిరోజులు దాచిపెట్టిన టీఆర్ఎస్ ఇప్పుడు బయట పెట్టిందన్నారు. బీజేపీ విధానాలపై కేసీఆర్ స్పష్టమైన వైఖరి లేదని, డిల్లీలో ఒకలా, హైదరాబాద్‌లో మరొకలా ప్రకటనలు చేస్తూ రాష్ట్ర ప్రజలను గందరగోళంలో పడేస్తున్నారని విమర్శించారు. వరి వినిమయం ఉన్నా పంటను పండించవద్దనే దానిలో నిగూఢం దాగి ఉందన్నారు. ఇది పాశ్చాత్య దేశాల కుట్రలో భాగామేనని, అక్కడి మిగులు ఆహార ధాన్యాలను ఒదిలించుకునే ప్రయత్నంలో భాగంగా అమెరికా భారతదేశంపై ఒత్తిడి తెచ్చి వరి పంటను వేయకుండా అదుపుచేస్తుందన్నారు. పోడుపై నోటి మాటలు వద్దని నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పోడుపై హక్కు కల్పించటానికి జిల్లా యూనిట్‌గా కాకుండా రాష్ట్రవ్యాప్తంగా నోటిఫికేషన్ వేయాలన్నారు. జిల్లా యూనిట్‌గా తీసుకొని కొన్ని జిల్లా పోడు రైతులకు అన్యాయం చేయాలని చూస్తున్నారని, దీనిని సహించేది లేదన్నారు. సీపీఐ(ఎం) రాష్ట్ర నాయకులు పి.సోమయ్య మాట్లాడుతూ అన్ని వర్గాల సమస్యల పరిష్కారానికి సమరశీల పోరాటాలే శరణ్యమన్నారు. సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు మాట్లాడుతూ రైతు పండించే పంటలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆంక్షలు పెడుతున్నాయన్నారు. కేసీఆర్ పోడుపై పారదర్శకంగా వ్యవహరించాలన్నారు. పోడుపై హక్కు కల్పించటంలో గులాబీ నేతల జోక్యంను సహించేది లేదన్నారు. పోడు సమస్యను సాగదీయకుండా తక్షణ పరిష్కారం చూపాలన్నారు. సమావేశంలో ఉసిరికాయలపల్లి, విశ్వనాధపల్లి సర్పంచ్‌లు బానోత్ బన్సీలాల్, హలావత్ ఇందిరాజ్యోతి, సీపీఐ(ఎం) రాష్ట్ర నాయకులు పీ.సోమయ్య, జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు యర్రా శ్రీకాంత్, భూక్యా వీరభద్రం, జిల్లా నాయకులు మెరుగు సత్యనారాయణ, బొంతు రాంబాబు, కే.నాగేశ్వరరావు, మూడు శోభన్, చింతల రమేష్, మండల కార్యదర్శి కే.నరేంద్ర, నాయకులు వజ్జా రామారావు, తేజావత్ చందర్, మండల వెంకన్న, దారావత్ సైదులు, కరకపల్లి రాయమల్లు తదితరులు పాల్గొన్నారు.