Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రెవెన్యూ వ్యవస్థలోనే ధరణి అతి పెద్ద సంస్కరణ: జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్
నవతెలంగాణ - ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
దేశవ్యాప్తంగా రెవెన్యూ వ్యవస్థలోనే అతి పెద్ద సంస్కరణగా ధరణి నిలుస్తుందని ఖమ్మం జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్ అన్నారు. తాను ఐఏఎస్ శిక్షణ తీసుకుంటున్న సమయంలో రెవెన్యూ వ్యవస్థ గురించి క్లాసులు ఉండేవని, దేశంలో కర్ణాటకలో అప్పుడు అమలవుతున్న రెవెన్యూ వ్యవస్థలో రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ ను లింక్ చేయడం గురించి గొప్పగా చెప్పారని తెలిపారు. కానీ అంతకు మించిన సంస్కరణలను తెలంగాణలో ప్రస్తుతం అమలు చేస్తున్నామని చెప్పారు. రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ ఒకేసారి జరిగే విధంగా ధరణి ఉందని తెలిపారు. ధరణి పోర్టల్ అందుబాటులోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా జిల్లా కలెక్టరేట్ లోని ప్రజ్ఞా మీటింగ్ హాల్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. గతంలో రిజిస్ట్రేషన్ పూర్తి చేసినా, మ్యుటేషన్ జరిగే లోగానే వేరే వాళ్లకు భూములు అమ్మడం వల్ల కొన్నవాళ్లు నష్టపోయిన ఘటనలు ఉండేవని, డబుల్ రిజిస్ట్రేషన్ లు జరిగే అవకాశం లేకుండా, కొన్న వాళ్లకు కూడా క్షణాల్లో మ్యూటేషన్ పూర్తవుతుందన్నారు. ఎన్నారైలు కూడా అక్కడి నుంచి ఇక్కడ రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసేలా ధరణి వీలు కల్పించిందని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో సబ్ రిజిస్ట్రార్ కార్యాల యాలు 7 మాత్రమే ఉన్నాయని, ధరణి అందుబాటులోకి వచ్చాక వ్యవసాయ భూములు రిజిస్ట్రేషన్లు తహశీల్దార్ కార్యాలయాల్లో చేస్తుండడంతో 21 అందుబాటులోకి వచ్చాయని చెప్పారు. ఏడాది కాలంలో జిల్లాలో 26వేల రిజిస్ట్రేషన్ లు ధరణి ద్వారా పూర్తి చేసినట్టు తెలిపారు. ఇందులో సేల్ ట్రాన్సాక్షన్ లు 12, 264, గిఫ్ట్ ట్రాన్సాక్షన్ లు 7,735, సక్సెషన్ ట్రాన్సాక్షన్ లు 2,944, మార్టిగేజ్ 3,079 లు ఉన్నాయని వివరించారు. ఏజెన్సీ ఏరియాలో గిరిజనులు వ్యవసాయ భూమిని మరొకరికి అమ్ముకోవాలంటే చాలా ఇబ్బందు లుండేవని, తాను భద్రాచలం ఐటీడీఏ పీవోగా ఉన్న సమయంలో 2016 నుంచి పెండింగ్ ఉన్న 52 అప్లికేషన్ లను 2018 లో ఆర్నెళ్ల పాటు పరిశీలించి క్లియర్ చేశామని, కానీ ఇప్పుడు ధరణి వచ్చాక ఏడాది కాలంలోనే 487 ఎల్ ఫామ్ లు ఇచ్చామని చెప్పారు. ఇది గత పదేళ్లలో ఇచ్చిన ఎల్ ఫామ్ ల కంటే ఎక్కువేనని అన్నారు. ధరణి వల్ల గిరిజనులకు కూడా టైటిల్ గ్యారెంటీ హక్కు లభించిందన్నారు. ఏడాదిలో గ్రీవెన్స్ లో 17,473 అప్లికేషన్ లను క్లియర్ చేయగా, ఇందులో 8,863 పెండింగ్ మ్యూటేషన్లు, 2,759 లు పెండింగ్ ఆన్ ల్యాండ్ మ్యాటర్స్, 5,666 నిషేధిత జాబితాలో ఉన్న వాటిని క్లియర్ చేశామన్నారు.
ఇంకో వెయ్యి వరకు సర్వే నెంబర్ల వారిగా నిషేధిత జాబితాలో ఉన్న అప్లికేషన్లు ఉన్నాయని, వాటిని కూడా త్వరలోనే క్లియర్ చేస్తామని చెప్పారు. మీడియా సమావేశంలో అడిషనల్ కలెక్టర్ మధుసూదన్, ఆర్డీవో రవీంద్రనాథ్, అన్ని మండలాల ఎమ్మార్వోలు పాల్గొన్నారు.