Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గాంధీచౌక్
స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్టీఎఫ్ఐ) పిలుపు మేరకు సోమవారం ఖమ్మం జిల్లా టీఎస్‌యుటీఎఫ్ ఆధ్వర్యంలో విద్యలో అంతరాలను పెంచే ఎన్ఈపి 2020 అమలును నిలిపివేయాలని, సిపిఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ పునరుద్దరించాలని, పెట్రోలియం ఉత్పత్తుల ధరలను నియంత్రించాలని, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్, గెస్ట్, పార్ట్ టైం తదితర తాత్కాలిక ఉపాధ్యాయులను రెగ్యులరైజ్ చేయాలని, కోవిడ్‌తో మరణించిన ఉపాధ్యాయుల కుటుంబాలను ఆదుకోవాలని, దేశవ్యాప్తంగా పాఠశాలల్లో ప్రత్యక్ష బోధనను ప్రారంభించాలనే తదితర డిమాండ్లతో కలక్టరేట్ వద్ద సోమవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఎస్టీఎఫ్ఐ జాతీయ కౌన్సిల్ సభ్యురాలు చావ దుర్గాభవాని, టీఎస్‌యుటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బండి నరసింహారావులు మాట్లాడుతూ ఉమ్మడి జాబితాలో ఉన్న విద్యారంగంలో రాష్ట్రాల ప్రమేయం లేకుండానే కేంద్ర ప్రభుత్వం అనేక సంస్కరణలు చేస్తూ రాజ్యాంగ ఫెడరల్ స్వభావాన్ని, దేశంలోని భిన్నత్వాన్ని కాలరాసే దానిలో భాగంగానే ఎన్ఈపి -2020 తీసుకువచ్చిందని, దేశంలోని విద్యావంతులు, మేధావులతో చర్చించకుండా ఏకపక్షంగా అమలు చేయాలని చూస్తున్నందున దేశంలో బాలకార్మిక వ్యవస్థ, చదువుల్లో అంతరాలు పెరిగిపోతాయన్నారు. ఎన్ఈపి -2020ని తాత్కాలికంగా నిలిపివేసి విస్తృతంగా చర్చలు జరిపి అందులోని ప్రజా, విద్యా వ్యతిరేక అంశాలను సవరించాలని వారు డిమాండ్ చేశారు. అదేవిధంగా సిపిఎస్‌ను రద్దుచేసి అందరికీ పాతపెన్షన్‌ను అమలు చేయాలని, తాత్కాలిక ఉపాద్యాయులను రెగ్యులర్ చేయాలని, పెట్రోలియం ఉత్పత్తుల ధరలు నియంత్రించాలని, దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో పాఠశాలలు ప్రారంభించడానికి చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో టీఎస్‌యుటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు జీవి.నాగమల్లేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి పారుపల్లి నాగేశ్వరరావు, నాయకులు బుర్రి వెంకన్న, పి.సురేష్, ఎం.నరసింహరావు, ఉద్దండు షరీఫ్ తదితరులు పాల్గొన్నారు.