Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జిల్లాలో ప్రధానంగా వైరా నియోజకవర్గం సింగరేణి, ఏన్కూరు, జూలూరుపాడు, కొణిజర్ల, సత్తుపల్లి నియోజకవర్గంలోని సత్తుపల్లి, పెనుబల్లి, ఖమ్మ నియోజక వర్గంలోని రఘునాథపాలెం, మధిర నియోజకవర్గంలోని చింతకాని మండలంలోని కొదుమూరు గ్రామంలో అనేక ఏళ్లుగా పోడుభూములు సాగు చేసుకుని బతుకుతున్న గిరిజనులు, పేదల భూములు సర్వే చేసి హక్కుపత్రాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. జిల్లాల వారీగా నోటిఫికేషన్ ఇవ్వాలని కోరారు. గిరిజనేతరులు 70 ఏళ్ల రికార్డులు చూపించాలనడం సరికాదన్నారు. పోడు రైతులపై నమోదైన కేసులను ఎత్తివేయాలని కోరారు. ఈ ప్రక్రియ పూర్తయ్యే వరకు, ఆ తర్వాత కూడా ఫారెస్టు అధికారులు పోడు భూములకు పోకుండా కందకాలు తీయడం వంటివి ఆపాలన్నారు. రెవెన్యూ, ఫారెస్టు వివాదాలు పరిష్కారాలని కోరారు. 1952 నుంచి వ్యవసాయం చేస్తూ పట్టాలున్న భూములను నర్సరీల పేరుతో గుబ్బగుర్తి, కొదుమూరు తదితర ప్రాంతాల్లో ఫారెస్టు అధికారులు లాక్కోవడాన్ని ఖండించారు. సంబంధిత రైతులకు ప్రత్యామ్నాయ భూములైనా చూపాలి లేదంటే ఆ భూములనైనా అప్పగించాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి చెప్పినట్లుగా 2014 జూన్ 2కు ముందు పోడుకొట్టిన రైతులకు హక్కుపత్రాలు ఇవ్వాలన్నారు. పోడు సమస్యలపై మంత్రి, కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చారు.
- పోడుతో అడవుల అంతరిస్తున్నాయనే వాదన సరికాదని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి బాగం హేమంతరావు అన్నారు. పోడుదారుల్లో ఎస్సీ, బీసీలు అత్యధికంగా ఉన్నారని వారికీ పోడు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. గతంలో లబ్ధిపొందలేకపోయిన దరఖాస్తులనూ పరిగణలోకి తీసుకోవాలన్నారు. కమిటీల్లో రాజకీయ ప్రమేయం లేకుండా చూడాలన్నారు. ట్రెంచ్‌లు, కందకాలు కొట్టడం వంటి ఫారెస్టు అధికారుల దుశ్చర్యలు ఆపాలన్నారు. చనిపోయిన వారి వారసులకు పట్టాలను మ్యుటేషన్ చేయాలని కోరారు.
- పట్టాలున్నా ఫారెస్టు అధికారులు లాక్కున్న భూములను తిరిగి సంబంధిత రైతులకు అప్పగించాలి లేదంటే ప్రత్యామ్నాయ భూమైనా చూపాలని సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి గోకినేపల్లి వెంకటేశ్వర్లు, ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య డిమాండ్ చేశారు. ఇందిర జలప్రభ కింద వేసిన బోర్లను అటవీ అధికారులు ధ్వంసం చేయడాన్ని ఖండించారు. ఆధునిక యంత్రాలు ఉపయోగించి పోడు వ్యవసాయం చేయొద్దనడం సరికాదన్నారు. భూమి దున్నుకొని బతకడమే కానీ భూమిపై హక్కు లేదనడం సమంజసం కాదన్నారు. యంత్రాలు ఉపయోగించి పోడు వ్యవసాయం చేస్తే బీట్ ఆఫీసర్లు దుశ్చర్యలకు పాల్పడుతున్నారని తెలిపారు. పరిస్థితి చూస్తుంటే పుల్లరి విధానం అమల్లోకి వస్తుందేమోనని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అఖిలపక్ష సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్, సీపీఐ(ఎం) గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి భూక్యా వీరభద్రం, సింగరేణి మండల కార్యదర్శి కె.నరేంద్ర, జిల్లా కమిటీ సభ్యులు కొండబోయిన నాగేశ్వరరావు, ఏన్కూరు మండల కార్యదర్శి బంతబోయిన నాగేశ్వరరావు, జిల్లా నాయకులు వజ్జా రామారావు, కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు శేఖర్‌గౌడ్, టీఆర్ఎస్ జిల్లా కార్యాలయ ఇన్చార్జి ఆర్జేసీ కృష్ణ, బీజేపీ జిల్లా నాయకులు రవికుమార్, టీడీపీ నాయకులు సీతయ్య పాల్గొన్నారు.