Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
పోడు సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు యోచన చేస్తున్నారని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజరుకుమార్ స్పష్టం చేశారు. అటవీ హక్కుల (రికగేషన్ ఆఫ్ ఫారెస్టు రైట్స్) చట్టానికి లోబడే ఈ పరిష్కారం ఉంటుందన్నారు. అదేసమయంలో అటవీభూముల పరిరక్షణ కూడా దృష్టిలో పెట్టుకుని వ్యవహరించాలన్నారు. గ్రామస్థాయిలో ఏర్పాటు చేసిన ఎఫ్ఆర్సీ కమిటీల ద్వారా పూర్తి పారదర్శకంగా పోడు హక్కుదారుల ఎంపిక జరుగుతుందన్నారు. స్థానిక జడ్పీ మీటింగ్ హాల్లో జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్ అధ్యక్షతన సోమవారం సాయంత్రం ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశంలో మంత్రి మాట్లాడారు. ఈనెల 8వ తేదీ నుంచి పోడు సమస్య పరిష్కార ప్రక్రియ మొదలవుతుందన్నారు. సన్నాయి నొక్కులు కాదు శాశ్వత పరిష్కారం కావాలన్నారు. గత ప్రభుత్వాల మాదిరి కంటితుడుపు చర్యలు ఉండవన్నారు. ఆర్ఓఎఫ్ఆర్ చట్ట ప్రకారమే రెగ్యులరైజేషన్ జరగాలన్నారు. ఆర్ఓఎఫ్ఆర్ చట్ట ప్రకారం 2005 డిసెంబర్ 13వ తేదీకి పూర్వం పోడు చేసిన ప్రతీ భూమికి హక్కు పత్రాలు ఇస్తామన్నారు. పది ఎకరాలలోపు ఉన్న ప్రతి గిరిజనుడికి హక్కుపత్రం ఇస్తామని తెలిపారు.
ఎఫ్ఆర్సీ కమిటీ నిర్ణయమే ఫైనల్
గ్రామసభ ద్వారా ఎన్నుకునే ఎఫ్ఆర్సీ కమిటీలో చైర్మన్, సెక్రటరీతో పాటు ఆ గ్రామస్థాయిని బట్టి 10 నుంచి 15 మంది సభ్యులుంటారని తెలిపారు. ఈ ఎఫ్ఆర్సీ కమిటీ నిర్ణయం ప్రకారమే హక్కుదారుల ఎంపిక జరుగుతుందన్నారు. ఈ కమిటీల్లో ఎలాంటి రాజకీయ జోక్యం ఉండదన్నారు. ఈ కమిటీలను ఉపయోగించుకుని రాజకీయ ప్రయోజనం పొందాలనే ఉద్దేశం తమ పార్టీకి లేదన్నారు. ప్రభుత్వంపై పూర్తి విశ్వాసం ఉంచాలన్నారు. అందరిభాగస్వామ్యంతో ఈ కమిటీల ఏర్పాటు ఉంటుందన్నారు. పోడుతో పాటు అడవుల రక్షణ బాధ్యతను కూడా అందరం సమష్టిగా తీసుకోవాలన్నారు. అడవులు పలుచనయ్యే కొద్దీ రాజకీయ పార్టీలూ పలుచనవుతాయన్నారు.
+ ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం పోడు సమస్య పరిష్కారం ఉంటుందన్నారు. ఫారెస్టు, రెవెన్యూ వివాదాల పరిష్కారం, మూడు తరాలపై స్పష్టత ఇస్తామన్నారు. గిరిజనేతరుల ముసుగులో బినామీలు ప్రవేశించకుండా చూడాలని మంత్రి కోరారు.
గిరిజనేతరులను ఇబ్బంది పెట్టొద్దు
: హరిప్రియ, ఇల్లెందు ఎమ్మెల్యే
ఇల్లెందు నియోజకవర్గంలో పోడు వ్యవసాయం ఆధారంగా మూడు తరాలుగా జీవిస్తున్న గిరిజనేతరులను ఇబ్బంది పెట్టద్దని ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియ కోరారు. గతంలో మైనార్టీల పేరుతో ఉన్న పోడు భూములు బీసీల పేరు మీదకు మారాయన్నారు. ఆ పేరుతో గిరిజనేతరులను ఇబ్బందులకు గురిచేయడం సరికాదన్నారు. గిరిజనేతరులు ఇల్లు కట్టుకోవాలన్నా, కరెంట్ మీటర్ కావాలన్నా అనుమతి ఇవ్వడం లేదని తెలిపారు. 2005లో తిరస్కరించిన దరఖాస్తుదారులకు పట్టాలివ్వాలని కోరారు. పట్టాలున్న వారికి రైతుబంధు వర్తింపజేయాలన్నారు. 2005 తర్వాత పోడు కొట్టిన రైతులను ఉద్యానపంటల సాగు దిశగా ప్రోత్సహించాలని కోరారు. అనంతరం పోడు హక్కుపత్రాలతో అడవుల భక్షణ ఆపేందుకు కట్టుబడి ఉంటామని అఖిలపక్ష నాయకులు, అధికారులు, ప్రజాప్రతినిధులతో కలెక్టర్ ప్రతిజ్ఞ చేయించారు. సమావేశంలో ఐటీడీఏ పీవో గౌతమ్, సీపీ విష్ణు ఎస్ వారియర్, వైరా ఎమ్మెల్యే రాములునాయక్, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, జడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజ్, డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, శిక్షణ కలెక్టర్ రాహుల్, అటవీ సంరక్షణాధికారి భీమా నాయక్, జిల్లా అటవీశాఖ అధికారి ప్రవీణ, అటవీ, పోలీసు అధికారులు, జడ్పీటీసీలు, ఎంపీపీలు హాజరయ్యారు.
.