Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నూతన అడ్‌హక్ కమిటీ కన్వీనర్ అఫ్జల్‌హసన్
- కార్యాలయంలో ఘనంగా బాధ్యతల స్వీకారం
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ యూనియన్ బలోపేతానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ఆ సంఘం నూతన అడ్‌హక్ కమిటీ కన్వీనర్ షేక్ అఫ్జల్‌హసన్ అన్నారు. కలెక్టరేట్లోని ఆ యూనియన్ కార్యాలయంలో సోమవారం బాధ్యతల స్వీకరణ అనంతరం స్థానిక టీఎన్జీవోస్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఖమ్మం జిల్లా టీఎన్జీవోస్ యూనియన్ గత కొంతకాలంగా స్తబ్ధుగా ఉందని, దాన్ని సెంట్రల్ కమిటీ ఆదేశాల మేరకు బలోపేతం చేస్తానన్నారు. తనపై నమ్మకంతో పదవీ బాధ్యతలు అప్పగించిన సెంట్రల్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మామిళ్ల రాజేందర్, జనరల్ సెక్రటరీ ప్రతాప్‌కు కృతజ్ఞతలు తెలిపారు. కొంతకాలంగా ఉద్యోగసంఘంలో ఉన్న నిస్తేజాన్ని పొగడతానన్నారు. జిల్లాలో అన్ని యూనిట్లకు నూతన కమిటీలను నియమిస్తామన్నారు. ప్రతీ సభ్యునికి అండగా ఉంటానన్నారు. సమష్టి నిర్ణయాలకు ప్రాధాన్యత ఇస్తానన్నారు. పాత, కొత్త నాయకత్వం అందరినీ కలుపుకుని ముందుకు పోతానని తెలిపారు. సభ్యత్వ నమోదు, అనుబంధ కమిటీలను నియమించి త్వరలోనే జిల్లా కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు. అన్ని కమిటీలతో కలిసి జేఏసీని ఏర్పాటు చేస్తామన్నారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి అలుపెరుగకుండా కృషి చేస్తానని స్పష్టం చేశారు. ఏ సమస్య ఉన్నా తక్షణం స్పందించి ఫోన్లోనే పరిష్కరించే మంత్రి పువ్వాడ అజరుకుమార్ అండతో ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. వీఆర్వోలు, ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై సీఎం కేసీఆర్ సానుకూలంగా ఉన్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో సంఘం నూతన కో కన్వీనర్ గన్నవరపు బాలకృష్ణ, సభ్యులు కె.దుర్గాప్రసాద్, పి.కిరణ్, వల్లోజు శ్రీనివాస్, ఎస్.జ్యోతి, కూరపాటి శ్రీనివాస్, దాసరి రవి, బి.నాగరాజేష్, ఆయా సంఘాల నాయకులు శ్రీనివాసరెడ్డి, సాగర్, విజేత తదితరులు పాల్గొన్నారు.