Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ కలెక్టర్ దురిశెట్టి అనుదీప్
నవతెలంగాణ-కొత్తగూడెం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పరిశ్రమలు పెద్ద ఎత్తున ఏర్పాటుకు ఔత్సాహికులను ప్రోత్సహించాలని కలెక్టర్ అనుదీప్ తెలిపారు. మంగళవారం జిల్లా కలెక్టర్ చాంబర్లో జిల్లా పారిశ్రామిక ప్రోత్సహక కమిటి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 23 ఆగస్టు 2021 నుండి 2 నవంబర్ 2021 వరకు 11 పరిశ్రమలకు 22 ధరఖాస్తులు వచ్చాయని తెలిపారు. వాటిలో 21 ధరఖాస్తులు ఆమోదించగా టిఎస్ఎస్ఐసి అధికారులు ఒక పరిశ్రమ ఏర్పాటుకు అభ్యంతరం తెలియచేశారని, తిరస్కరణకు గల కారణాలపై తనకు నివేదిక అందచేయాలని చెప్పారు. మంజూరు చేయబడిన 11 యూనిట్లు యొక్క విలువ 11.50 కోట్లు కాగా వీటి ద్వారా 115 మందికి ఉపాధి లభించనున్నట్లు ఆయన వివరించారు. గతంలో ఏర్పాటు జరిగిన యూనిట్లుకు సబ్సిడీ మంజూరుపై సమగ్ర నివేదికలు ఇవ్వాలని చెప్పారు. పరిశ్రమలు ఏర్పాటుకు ఆసక్తి ఉన్న ఔత్సాహికులకు పరిశ్రమల శాఖ కార్యాలయంలో పూర్తి వివరాలు అందచే యబడతాయని, సద్వినియోగం చేసుకోవాలని ఆయన చెప్పారు. పరిశ్రమల్లో రక్షణ చర్యలు అమలు జరుగుతున్నాయా లేదా అనే అంశంపై అగ్ని కాలుష్య నియంత్రణ మండలి, పరిశ్రమల అధికారులు తనిఖీ చేసి నివేదికలు ఇవ్వాలని చెప్పారు. రక్షణ చర్యలు తప్పక పాటించాలని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటి వరకు ఎన్ని పరిశ్రమలను తనిఖీ చేయడం. జరిగిందో వాటిపై తనకు నివేదికలు ఇవ్వాలని చెప్పారు. వీథి వ్యాపారులకు ముద్ర రుణాలు మంజూరు చేయాలని ఎస్బీఐ చీఫ్ మేనేజరు సూచించారు.
వీధి వ్యాపారులకు గుర్తింపు కార్డులు జారీ చేయడంలో జాప్యం జరుగుతున్నదని, ప్రజలు ప్రజావాణిలో ఫిర్యాదు చేస్తున్నారని, జారీ చేయడంలో ఎందుకు జాప్యం జరుగుతున్నదో తనకు సమగ్ర నివేదికలు అందచేయాలని మున్సిపల్ కమిషనర్ సంపత్ కుమార్ను ఆదేశించారు. ఐడీ కార్డులు జారీలో అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ జియం సీతారాం నాయక్, వాణిజ్య పన్నుల అధికారి తిరుపతిరెడ్డి, టిఎస్ఐసిసి జోనల్ మేనేజర్ పవన్ కుమార్, ఎస్బీఐ చీఫ్ మేనేజర్ శ్రీనివాస్, ఏపిఓ జనరల్ డేవిడ్జ్, ఆర్డిఓ వేణు, కాలుష్య నియంత్రణ అధికారి రవిశంకర్, ఎస్సీ కార్పోరేషన్ ఈడి ముత్యం, మున్సిపల్ కమిషనర్ సంపత్ కుమార్, విద్యుత్ శాఖ డిఈ పాల్గొన్నారు.