Authorization
Mon Jan 19, 2015 06:51 pm
షాపు ఎదుట రైతుల ఆందోళన
నవతెలంగాణ-నేలకొండపల్లి
అంకూర్ శ్రీ విత్తన కంపెనీ రైతులను నిండా ముంచేసింది. గత ఏడాది అంకూర్ శ్రీ 101 వరి విత్తనం పేరుతో రైతులకు నమ్మకం కలిగించి అదే నమ్మకాన్ని ఆసరా చేసుకుని నేడు కల్తీ విత్తనాలు రైతులకు అంటగట్టి మోసం చేసింది. దీంతో నేడు పంట చేతికందే దశలో కళ్ళముందే సగానికిపైగా బెరుకుల రూపంలో నలుపు, ఎరుపు రంగు కలిగిన గింజలుగా మారి తీవ్ర నష్టం కలిగించింది. దీంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. జరిగిన నష్టంపై సంబంధిత విత్తన కంపెనీ వారికి, డీలరు దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోవడంతో మంగళవారం విత్తన షాపు యందు ఆందోళనకు దిగారు.
ఈ ఘటన మండలంలోని బుద్ధారం, చెరువుమాదారం, రాయిగూడెం, కొంగర గ్రామాలలో చోటు చేసుకుంది. ఆయా గ్రామాల రైతులు తెలిపిన వివరాల ప్రకారం మండల కేంద్రంలోని కామదేను అగ్రిమాల్ నందు పైన తెలిపిన గ్రామాలకు చెందిన రైతులు అంకూర్ శ్రీ 101, లాట్ నెంబర్ 209- 25780 చెందిన వరి విత్తనాన్ని 10 కేజీలు బరువు కలిగిన 158 బస్తాలను కొనుగోలు చేశారు. రసీదులను సైతం కామదేను అగ్రి మాల్ నందు తీసుకున్నట్లు తెలిపారు.
గత ఏడాది కూడా ఇదే రకం వరి వంగడాలు కొనుగోలు చేసి సాగు చేసినట్లు తెలిపారు. గతంలో ఎకరానికి 40 బస్తాల చొప్పున దిగుబడులు సాధించి బస్తా ఒక్కంటికి 1900 రేటు చొప్పున విక్రయించినట్లు తెలిపారు. ఇదే నమ్మకంతో తిరిగి ఈ ఏడాది కూడా బుద్ధారం గ్రామానికి చెందిన రైతు ఆరేకట్ల రవీందర్రావు 65 బస్తాలు, కొండపల్లి రంగనాథ్ 15 బస్తాలు, ఆరికట్ల గురువయ్య 11 బస్తాలు, చెరువుమాదారం గ్రామానికి చెందిన రైతు నాగవల్లి రామిరెడ్డి 31 బస్తాలు, రాయిగూడెం గ్రామానికి చెందిన రైతు నంబూరి రామారావు 16 బస్తాలు, కొంగర గ్రామానికి చెందిన రైతు రఘునాథ బట్టర్ 20 బస్తాల చొప్పున కొనుగోలు చేసినట్లు తెలిపారు. పొలములో నాటు పెట్టిన తరువాత పిలకలు వచ్చే దశ నుండే బెరుకు విత్తనాలు కనిపించాయని ఈ విషయమై గత నెల రోజులకు పైగానే సంబంధిత షాపు యజమానికి తెలియజేశామన్నారు. యజమాని విషయాన్ని విత్తన కంపెనీ దృష్టికి తీసుకెళ్తానని చెప్పినట్లు తెలిపారు. యజమాని, విత్తన కంపెనీ వారు పట్టించుకోకపోవడంతో కామదేను అగ్రిమాల్ నందు మంగళవారం రైతులు ఆందోళనకు దిగారు.