Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
జిల్లాలో రోడ్లు అధ్వానంగా ఉన్నాయని, రోడ్లు, భవనాల శాఖ అధికారుల్లో జవాబుదారీ తనం లోపించిందని...డబుల్ బెడ్రూంల కేటాయింపు, నిర్మాణపరంగా అనేక లోపాలు తలెత్తాయని సభ్యులు జిల్లా పరిషత్ సమావేశంలో ప్రశ్నలు సంధించారు. ఆర్అండ్బీ, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఆర్అండ్బీ అధికారులు మండల పరిషత్ సమావేశాలకు కూడా హాజరుకావడం లేదని ఆరోపించారు. జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం మంగళవారం స్థానిక జడ్పీ మీటింగ్‌హాల్‌లో చైర్మన్ లింగాల కమలరాజ్ అధ్యక్షతన జరిగింది. విద్యా, పంచాయతీరాజ్, ఆర్అండ్బీ ఇంజినీరింగ్ విభాగాల పనితీరుపై చర్చించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఆరేడుగురు విద్యార్థులు ఉన్నచోట ఇద్దరు టీచర్లు, 90 మంది విద్యార్థులు ఉన్నచోట ఇద్దరు ఉపాధ్యాయులు ఉన్నారని, ప్రాథమిక పాఠశాలల్లో ఉపాధ్యాయులను ఉన్నత పాఠశాలల్లో సర్దుబాటు చేయడంతో ఇలాంటి సమస్యలు వచ్చాయని సభ్యులు అడిగిన ప్రశ్నలకు జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్ సమాధానం ఇచ్చారు. జిల్లాలో టీచర్స్ కొరత లేదన్నారు. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల టీచర్లను హైస్కూల్లో సర్దుబాటు చేసిన మాట వాస్తవమేనన్నారు. మండల పరిధిలోనే ఈ సర్దుబాట్లు జరిగాయన్నారు. కొరతను దృష్టిలో పెట్టుకుని పక్క మండలాల టీచర్లను కూడా సర్దుబాటు చేసేలా ప్రణాళిక రూపొందించామని తెలిపారు. ఈ అడ్జస్టుమెంట్లకు సంబంధించిన ప్రతిని సభ్యులకు ఇవ్వాల్సిందిగా డీఈవో యాదయ్యను ఆదేశించారు. పాఠశాలల్లో మౌలిక సదుపాయాలపై సభ్యులడిగిన ప్రశ్నకు కలెక్టర్ సమాధానం ఇస్తూ ప్రతీ నియోజకవర్గానికి రూ.5కోట్ల నిధులు మంజూరయ్యా యన్నారు. ఎంతో నేపథ్యం ఉన్న వైరా సోషల్ వెల్ఫేర్ బాలికల గురుకుల పాఠశాలను పునరుద్ధరించాల్సిందిగా ఆ మండల జడ్పీటీసీ సభ్యురాలు నంబూరి కనకదుర్గ కోరారు. కామేపల్లిలో ఖాళీగా ఉన్న బీసీ హాస్టల్లో ఇంటర్మీడియెట్ విద్యార్థులకు వసతి కల్పించాలని ఆ మండల జడ్పీటీసీ బాణోత్ వెంకటప్రవీణ్‌కుమార్ నాయక్ అడిగిన ప్రశ్నపై కలెక్టర్ తక్షణం స్పందించారు. ఈ మేరకు మార్పులు చేయాల్సిందిగా బీసీ వెల్ఫేర్ అధికారి జ్యోతిని ఆదేశించారు. శిథిలావస్థలో ఉన్న సుబ్లేడ్ ఎస్టీ హాస్టల్ విద్యార్థులను మండల కేంద్రంలోని సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో వసతి కల్పించాల్సిందిగా తిరుమలాయపాలెం ఎంపీపీ మంగీలాల్ అడిగిన ప్రశ్నకు కలెక్టర్ సానుకూలంగా స్పందించారు. ఒక శాఖ నుంచి మరోశాఖకు వసతిగృహాల చేర్పులుమార్పులపై పరిశీలన చేయాల్సిందిగా అధికారులకు సూచించారు.
- రోడ్లు అధ్వానం...
జిల్లాలోని పంచాయతీరాజ్, ఆర్అండ్బీ, జాతీయ రహదారుల పరిధిలోని రోడ్లు అధ్వానంగా ఉన్నాయని సభ్యులు లేవనెత్తారు. తల్లాడ, కల్లూరు మండలంలో గతంలో మంజూరు చేసిన రోడ్లకు మరమ్మతులు చేయాల్సి ఉందని డీసీఎంఎస్ చైర్మన్ రాయల శేషగిరిరావు కోరారు. కొణిజర్ల, బోనకల్, పెనుబల్లి, ముదిగొండ తదితర మండలాల జడ్పీటీసీలు, ఎంపీపీలు కూడా రోడ్ల దుస్థితిని ప్రస్తావించారు. ఎలాంటి వితరణ ఇవ్వకపోయినా తిరుమలాయపాలెంలో వైకుంఠధామానికి ప్రైవేట్ వ్యక్తుల పేర్లు పెట్టారని ఆ మండల జడ్పీటీసీ బెల్లం శ్రీనివాస్ ప్రశ్నించారు. రేణుకాచౌదరి హయాం నుంచి పెండింగ్‌లో ఉంటున్న ఎంపీ ల్యాడ్స్ నిధులపై పెనుబల్లి జడ్పీటీసీ మోహన్‌రావు అడిగిన ప్రశ్నకు పంచాయతీరాజ్ ఈఈ చంద్రమౌళి సమాధానం ఇచ్చారు. మాజీ ఎంపీలు రేణుకాచౌదరికి సంబంధించి రూ.262 కోట్లు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి హయాం నిధులు రూ.180 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. మండలానికి వచ్చినప్పుడు అధికారులు ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదని బోనకల్ ఎంపీపీ సౌభాగ్యమ్మ ఆరోపించారు. ఆర్అండ్బీ అధికారులు మండల పరిషత్ సమావేశానికి రావడం లేదని తల్లాడ ఎంపీపీ దొడ్డా శ్రీనివాస్ సమావేశం దృష్టికి తెచ్చారు. డీఎంఎఫ్టీ నిధులు ఇప్పించాల్సిందిగా కామేపల్లి, సింగరేణి మండలాల జడ్పీటీసీలు ప్రశ్నించారు.
- డబుల్ బెడ్రూంలు దుర్వినియోగం
2017లో ఐటీడీఏ ఆధ్వర్యంలో నిర్వహించిన డబుల్ బెడ్రూంలు నాసిరకంగా నిర్మించడంతో పాటు ప్రారంభించలేదని కామేపల్లి జడ్పీటీసీ ప్రస్తావించారు. ఖమ్మంలో రూ.70లక్షల విలువ చేసే ప్లాట్ ఉన్న వ్యక్తికి డబుల్ బెడ్రూంలు ఇచ్చారని తిరుమలాయపాలెం జడ్పీటీసీ ఆరోపించారు. తిమ్మారావుపేటలో డబుల్ బెడ్రూంల నిర్మాణం మందకొడిగా సాగుతోందని ఏన్కూరు జడ్పీటీసీ తెలిపారు. అనర్హులకు డబుల్ బెడ్రూం ఇచ్చిన విషయంపై ఆరా తీస్తామని కలెక్టర్ తెలిపారు. వాస్తవమని తేలితే ఇప్పటికైనా క్యాన్సిల్ చేస్తామన్నారు. తిమ్మారావుపేటలో రీటెండర్లు పిలిచి మరొకరికి కాంట్రాక్టు అప్పగించామన్నారు.
- ఆర్అండ్బీ అధికారుల తీరుపై చైర్మన్ ఆగ్రహం
ఆర్అండ్బీ అధికారుల తీరుపై చైర్మన్ కమలరాజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మండల పరిషత్ సమావేశాలకు ఆర్అండ్బీ ఏఈలు విధిగా హాజరుకావాలన్నారు. వారు హాజరుకాని కారణంగానే మండలస్థాయిలో చర్చించాల్సిన అంశాలు జిల్లా పరిషత్ వరకూ వస్తున్నాయన్నారు. కలెక్టర్ వీపీ గౌతమ్ బాధ్యతలు తీసుకోవడానికి ముందు వరకు నాలుగు లక్షల వ్యాక్సినేషన్ చేశామని, ఆయన కృషితో జిల్లాలో కోవిడ్ వ్యాక్సినేషన్ 12 లక్షలకు చేరిందన్నారు. జిల్లాలో ఫస్టు డోస్‌లో వెనుకబడిన తిరుమలాయపాలెం, ముదిగొండ, నేలకొండపల్లి మండలాల ప్రజాప్రతినిధులు, అధికారులు ఎక్కువ దృష్టి కేంద్రీకరించి వ్యాక్సినేషన్‌ను పూర్తి చేయించాలని కలెక్టర్ కోరారు. రెండో డోసు వేసుకోని వారికీ వేయించాలని సూచించారు. ఈ సమావేశంలో జడ్పీ సీఈవో వీవీ అప్పారావు, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి విద్యాచందన, ఆర్అండ్బీ ఈఈ శ్యాంప్రసాద్, డీఎంహెచ్‌వో మాలతి, మిషన్ భగీరథ ఈఈ డి.పుష్పలత తదితరులు పాల్గొన్నారు.