Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ముదిగొండ
ట్రాక్టర్ డ్రైవర్ అతివేగంగా ట్రాక్టర్‌ను నడిపి బోల్తా కొట్టించి ఒక గృహిణి మరణానికి కారణమై తొమ్మిది మందికి తీవ్రగాయాలై ముగ్గురు పరిస్థితి విషమంగా ఉన్న సంఘటన మండల పరిధిలోని వల్లభి వద్ద బుధవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం నేలకొండపల్లి మండలం మంగాపురంతండాకు చెందిన 20 మంది వ్యవసాయ కూలీలు పెద్దమండవ గ్రామానికి చెందిన చింతల అప్పారావు అనే రైతు పత్తి తీతకు ట్రాక్టర్లో బయలుదేరి వెళుతుండగా ట్రాక్టర్ ఓనర్, డ్రైవర్ అప్పారావు తనే స్వయంగా నిర్లక్ష్యంతో అతి వేగంగా ట్రాక్టర్‌ను నడపడంతో వల్లభి గ్రామం వద్ద ట్రాక్టర్ బోల్తా పడింది. ఈఘటనలో మంగాపురం తండాకు చెందిన గుగులోతు అనిత (35) అనే మహిళ అక్కడికక్కడే మృతిచెందింది. మరో 9 మందికి తీవ్రగాయాలు కాగా అందులో ముగ్గురు మహిళల పరిస్థితి విషమంగా ఉందని స్థానికులు తెలిపారు. క్షతగాత్రులను వైద్యచికిత్స కోసం ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సంఘటన స్థలాన్ని ముదిగొండ పోలీసులతోపాటు కారేపల్లి సీఐ సురేష్, కూసుమంచి ఎస్ఐ నందిప్ సందర్శించి సంఘటన వివరాలు తెలుసుకున్నారు అనంతరం మృతురాలి కుటుంబసభ్యులు, బంధువులతో కారేపల్లి సీఐ సురేష్ మాట్లాడారు. ఏ మండల పరిధిలో సంఘటన జరిగితే ఆ పోలీస్ స్టేషన్లో పిటిషన్ ఇవ్వాల్సిందిగా సూచించారు. మృతురాలి తరుపున బంధువులు, కుటుంబ సభ్యులు పిటిషన్ ఇవ్వబోమని, ట్రాక్టర్ ఓనర్ని తీసుకొచ్చి తమకున్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
రోడ్డుపై బైఠాయింపు...ముదిగొండ పోలీసులపై ఆగ్రహం
అనిత మృతదేహాన్ని ఖమ్మం తరలిస్తుండగా మృతురాలి బంధువులు, కుటుంబసభ్యులు అడ్డుకున్నారు. ముదిగొండ పోలీస్ స్టేషన్లో తమకు న్యాయం జరగదని ముదిగొండ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ అసహనంతో వాగ్వాదానికి దిగారు. నేలకొండపల్లి పోలీస్ స్టేషన్లో పిటిషన్ ఇస్తామని ఖమ్మంరూరల్ పోలీసు ఉన్నతాధికారికి ఫోన్లో చెప్పటంతో ఘటనా స్థలంలో ఉన్నవారు అవాక్కయ్యారు. దీంతో ఏం చేయాలో తెలియక పోలీసులు మిన్నకుండిపోయారు. ఖమ్మంరూరల్ సిఐ పి.సత్యనారాయణరెడ్డి ఫోన్లో మృతురాలి బంధువులతో మాట్లాడారు. నచ్చచెప్పడానికి ప్రయత్నం చేయగా వినలేదు. అనిత కుటుంబ సభ్యులు సంఘటనా స్థలం వద్ద టెంటువేసి మృతదేహంతో రోడ్డుపై బైఠాయించారు. అనితకు ఇద్దరు పాపలు, ఒక కుమారుడు, భర్త ఉన్నారు. అనిత తరుపున బంధువులు,పెద్దమనుషుల సమక్షంలో ట్రాక్టర్ ఓనర్, డ్రైవర్ చింతల అప్పారావు తరపున పెద్దమనుషులతో చర్చలు జరిపారు. ఆ చర్చలు సఫలం కావడంతో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ట్రాక్టర్ బోల్తాతో పరారైన ట్రాక్టర్ డ్రైవర్ చింతల అప్పారావు ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయినట్లు తెలిసింది....
విశ్వసనీయత కోల్పోతున్న ఖాకీలు
ప్రజల నమ్మకాన్ని ముదిగొండ ఖాకీలు కోల్పోతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అవినీతి అక్రమాల ఆరోపణలతో ముదిగొండ పోలీస్ స్టేషన్ ఇప్పటికే ఇరుక్కుంది. ఇసుక, రేషన్, ల్యాండ్ మాఫియాలతో కుమ్మక్కై ముదిగొండ పోలీసులు పోలీస్ ప్రతిష్టకే భంగం కలిగిస్తున్నారనే విమర్శలు వినపడుతున్నాయి. ఇక్కడ పనిచేసిన కానిస్టేబుళ్లు, ఎస్హెచ్ఓలతో సహా ఖమ్మం పోలీస్ కమిషనరేట్‌కి అటాచ్ అయిన విషయం విధితమే. అంటే ఈ పోలీస్ స్టేషన్‌లోని పోలీసుల పనితీరు ఎలా ఉందో అర్థమవుతుంది. ఇప్పటికైనా పోలీసు ఉన్నతాధికారులు ఇక్కడి స్టేషన్‌కు ఒక మంచి ఎస్‌హెచ్‌ఓకి బాధ్యతలు అప్పగించి ప్రజల నమ్మకాన్ని పొందాలని మండల ప్రజలు కోరుతున్నారు.
ముదిగొండ ఎస్సైగా తోట నాగరాజు
ముదిగొండ ఎస్సైగా పెనుబల్లిలో పనిచేస్తున్న తోట నాగరాజును జిల్లా పోలీసు ఉన్నతాధికారులు నియమించినట్లు తెలిసింది. ఇక్కడ పనిచేసిన తాండ్ర నరేష్ ఖమ్మం టూటౌన్కి బదిలీ అయి వెళ్లిన విషయం విదితమే.