Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఖమ్మం
వరిసాగుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కపట ప్రేమ చూపిస్తున్నాయని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు ఆరోపించారు. బుదవారం ఖమ్మంలోని సుందరయ్య భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అయన మాట్లాడుతూ రాష్ట్రంలో వరి పండించవద్దని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇస్తుందని, దానిని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుందని అన్నారు. కేంద్ర వ్యవసాయ శాఖమంత్రి వరి పండించవద్దని రాష్ట్రాలకు సర్కులర్ జారీ చేశారని, ఆ విషయం తెలియకుండానే బిజేపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజరు దీక్షలకు దిగడం.. విషయం తెలుసుకొని దీక్షలు విరమించుకున్నారని ఆరోపించారు. దీనిని ఆధారంగా తీసుకొని సంగారెడ్డి కలెక్టర్ రబీలో వరి విత్తనాలు అమ్మకాలు చేయవద్దని, అలా చేసే లైసెన్స్‌లు రద్దు చేసి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ బెదిరింపులకు పాల్ప్పడుతున్నారని అన్నారు. బిజెపి మాత్రం ఉప్పుడు బియ్యం పండించవద్దు అన్నాం తప్ప మిగతావాటిపై ఆంక్షలు పెట్టలేదని అంటున్నారని అన్నారు. రాష్ట్రంలో ప్రధానంగా వరి పంటలు పండిస్తారని,గతంలో కేంద్ర ప్రభుత్వం ఎఫ్ సి ఐ ద్వారా 75 శాతం కొనుగోలు చేసేదని, దానిని క్రమేపీ 50 శాతం నుంచి 25 శాతానికి ప్రస్తుతం అసలు కొనుగోలుని నిలిపివేసేందుకు కుట్ర జరుగుతుం దని అన్నారు. గోదాంలో ఉన్న బియ్యాన్ని పేదలకు ఉచితంగా పంపిణి చేయాలని డిమాండ్ చేసారు. రాష్ట్ర ప్రభుత్వం వరి కొనుగోలును బంద్ చేసి రైతులను పంటలు వేయకుండా ఆపేందుకు కలెక్టర్లు సైతం డీలర్‌ను వత్తిడి తీసుకొస్తున్నారని, దీనితో రైతులు ఆందోళన చేస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదని, ఒక్క గింజ కూడా కొనుగోలు చేయలేదని ఆరోపించారు. దేశంలో ఇటీవల 10 వేల మెట్రిక్ టన్నుల బియ్యం పనికి రాకుండా పోవడంతో పారబోశారని, వాటిని పేదలకు ఇవ్వవచ్చు కదా అని ప్రశ్నించారు. ప్రజాప్రతినిధులు రైతు వద్ద నుంచి ప్రతి గింజను కొనుగోలు చేస్తామని గొప్పలు చెప్తూ ఇంతవరకు ఒక్క గింజ కూడా కొనుగోలు చేయలేదని అన్నారు. ఇలాగే జరిగితే అధికార పార్టీ ప్రతినిధుల ఇంటి ఎదుట కూర్చుని ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు. దీనిలో భాగంగానే ఈ నెల 9వ తేదీన గ్రామ స్థాయిలో ఆందోళన నిర్వహిస్తామని, ఈ నెల 12న జిల్లా కేంద్రంలో రైతులను ఐక్యం చేసి ధర్నా నిర్వహిస్తామని తెలిపారు. రాష్ట్రంలో అధిక వర్షాలకు పంటలు దెబ్బ తింటే అంతవరకు ఒక పైసా కూడా ఇవ్వలేదని, గత ప్రభుత్వాలు నష్టబోయిన రైతులను ఎంతోకొంత ఆదుకున్నాయని, ఈ ప్రభుత్వం ఆ ఊసే లేదన్నారు. ఇప్పటికే జిల్లాలోని 18 మండలాలలో పత్తి, మిర్చి దెబ్బతిన్నాయన్నారు. సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటి సభ్యులు పొన్నం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రాష్ట్రంలోని రైతు వేదికలు అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారాయని ఆరోపించారు. రైతు వేదికల ముఖ్య ఉద్దేశం రైతు వేదికలలో వ్యవసాయ అధికారులు రైతులకు సలహాలు, సూచనలు ఇవ్వాలని, ఏ నేలలో ఏ పంటలు వేయాలి, ప్రత్యామ్నాయ పంటలు వివరాలు తెలపాలని. అవి అక్కడ జరగటం లేదనన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం రైతు వేదికను రైతులకు ఉపయోగపడేవిధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు. ఈ విలేకర్ల సమావేశంలో రాష్ట్రకమిటీ సభ్యులు ఎర్రా శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.