Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వేంసూరు
పేదరికం లేని సమాజం కోసమే సీపీఐ(ఎం) పోరాటమని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు అన్నారు. మర్లపాడులో తిరునగరి భాస్కరరావు ప్రాంగణంలో. మల్లూరి చంద్రశేఖర్, మండల వెంకటేశ్వరరావు అధ్యక్షతన శుక్రవారం సిపిఎం మండల మహాసభ జరిగింది. రైతు సంఘం నాయకులు కొత్త సత్యనారాయణ జెండా ఆవిష్కరించారు. ముఖ్యఅతిథిగా నున్నా నాగేశ్వరరావు హాజరై ప్రసంగించారు. వేల కోట్ల రూపాయలతో కమీషన్ల కోసం నిర్మించిన ప్రాజెక్టులు ప్రభుత్వాల విధానాల మూలంగా నిరుపయోగంగా మారే పరిస్థితులు ఉన్నాయన్నారు. ధాన్యం కొనుగోలు చేసే విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను దగా చేస్తున్నాయని అవన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించేంత వరకు తమ పార్టీ పోరాటాలు చేస్తుందన్నారు. తొమ్మిదో తారీఖున జరిగే ఆందోళనను, 12న కలెక్టరేట్ ముట్టడిని రైతులు విజయవంతం చేయాలని కోరారు. అప్పటికి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోతే స్థానిక ఎమ్మెల్యేల ఇంటి ముందు ధాన్యం బస్తాలతో నిరసన కార్యక్రమం నిర్వహిస్తామని హెచ్చరించారు. ప్రపంచ దేశాలకు కేరళ ప్రభుత్వం ఆదర్శంగా నిలిచిందన్నారు. ఐక్యరాజ్య సమితిలో కేరళ ప్రభుత్వం కరోనా అరికట్టడంలో అభినందనలు అందుకుందన్నారు. పేదరికం నిర్మూలించడం లక్ష్యంగా కమ్యూనిస్టు పాలిస్తున్న రాష్ట్రాల్లో అవలంబిస్తున్న విధానాలు నిదర్శనమన్నారు. అదే విధంగా పార్టీ సభ్యత్వాలు తీసుకున్న ప్రతి ఒక్కరు ప్రజల కోసమే పని చేయాలన్నారు. కొన్ని సందర్భాల్లో కార్యకర్తలు త్యాగాలకు సైతం సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. అనంతరం రాష్ట్ర కమిటీ సభ్యులు మాచర్ల భారతి, జిల్లా కమిటీ సభ్యులు మోరంపూడి పుల్లారావు, మోరంపూడి పాండురంగారావు, చలమల విఠల్ మాట్లాడారు. సీపీఐ(ఎం) పార్టీ మండల కార్యదర్శిగా అర్వపల్లి జగన్మోహన్రావు రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సభలో నాయకులు జాజిరి శ్రీనివాసరావు, రాజబాబు, కులిక పోగు సర్వేశ్వరరావు, అర్వపల్లి జగన్మోహన్రావు, నరసింహారావు, వెలిగినేని రామారావు, మండల కమిటీ సభ్యులు పాల్గొన్నారు.