Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
జిల్లాలో పోడు సాగుదారుల పట్డాల పంపిణీకి జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్ ఆధ్వర్యంలో చేపడుతున్న చర్యలపై స్పెషల్ చీఫ్ సెక్రటరీ శాంతికుమారి సంతప్తి వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్‌ను అభినందించారు. కలెక్టరేట్ లో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో అటవీ హక్కుల కమిటీలపై అధికారులతో సమీక్షించారు. గ్రామ పంచాయతీ స్థాయిలో ఏర్పాటు చేసే కమిటీలకు పాలనాపరంగా సహకరించేందుకు 112 మంది అధికారులను నియమించామని కలెక్టర్ ఆమెకు వివరించారు. ఇప్పటికే వారికి శిక్షణ కూడా ఇచ్చినట్లు తెలిపారు. 125 కమిటీలను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేశామన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు కార్యాచరణ ప్రణాళిక అమలు చేసేందుకు మండల స్థాయిలో 10 మంది సీనియర్ జిల్లా స్థాయి అధికారులు, డివిజన్ స్థాయిలో రెవెన్యూ డివిజనల్ అధికారులను నియమించా మన్నారు. ముఖ్యమంత్రి ఆకాంక్ష మేరకు ప్రతి ఒక్క పోడుదారుకూ ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు అందించాలన్నారు. పోడు కార్యాచరణ ప్రణాళికను అమలు చేయడానికి అద్భుతమైన ఏర్పాట్లు చేసినందుకు జిల్లా కలెక్టర్, అధికారులను ఆమె అభినందించారు అర్హులందరికీ ప్రయోజనం అందేలా చూడాలని సూచించారు. సమావేశంలో ఐటీడీఏ పీవో గౌతమ్ పోట్రు, అటవీశాఖ ఖమ్మం రీజియన్ కన్జర్వేటర్ డి.భీమానాయక్, శిక్షణ కలెక్టర్ రాహుల్, అడిషనల్ కలెక్టర్ ఎన్.మధుసూదన్, జిల్లా అటవీశాఖ అధికారి బి.ప్రవీణ, ఖమ్మం, కల్లూరు ఆర్డీవోలు ఎం.వీ రవీంద్రనాథ్, సీహెచ్ సూర్యనారాయణ, సర్వేఅండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడీ వి.రాము, ట్రైబల్ వెల్ఫేర్ డీడీ కృష్ణనాయక్, ఖమ్మం సత్తుపల్లి ఫారెస్ట్ డివిజనల్ ఆఫీసర్లు ప్రకాశ్, సతీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.