Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ ట్రెసా జిల్లా అధ్యక్షుడు సునీల్ రెడ్డి
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
ధరణి పోర్టల్లో నెలకొన్న లోపాలను తక్షణమే పరిష్కరించాలని తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్ (ట్రెసా) జిల్లా అధ్యక్షుడు తుంబూరు సునీల్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ధరణిలో నెలకొన్న సమస్యల కారణంగా రెవెన్యూ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వాటిని తొలగించాలని కోరారు. ఆదివారం హైదరాబాద్ లో ట్రెసా రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వంగ రవీందర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో సునీల్ రెడ్డి తో పాటు ఇటీవల నూతనంగా ఎన్నికైన ఖమ్మం జిల్లా నాయకత్వం కూడా హాజరైంది. ఈ సమావేశంలో సునీల్ రెడ్డి పలు సమస్యలు రాష్ట్ర యూనియన్ దృష్టికి తీసుకెళ్లారు. తహశీల్దార్ కార్యాలయాల్లో పనిభారం, సిబ్బంది కొరత కారణంగా ఉద్యోగులు పడుతున్న ఇబ్బందుల ను దృష్టిలో పెట్టుకుని క్యాడర్ స్ట్రెంత్ నిర్ధారించి.. ఖాళీలు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. కొత్త రెవెన్యూ చట్టం ప్రకారం అన్ని కేడర్ ఉద్యోగులకు జాబ్ చార్ట్ ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న అన్ని క్యాడర్ల వారికి పదోన్నతులు కల్పించాలని, సుదూర ప్రాంతాల్లో పోస్టింగ్ ల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న మహిళా ఉద్యోగులకు ఆప్షన్ ప్రకారం సొంత జిల్లాలు కేటాయించాలని కోరారు. వీఆర్వోలను రెవెన్యూ శాఖలో సర్దుబాటు చేయాలని, ఉద్యోగులకు పే స్కేల్ వర్తింప చేయాలని, అవసరమైన చోట నూతన కార్యాలయాలు నిర్మించాలని రాష్ట్ర నాయకత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఈ సమావేశంలో ట్రెసా రాష్ట్ర కార్యదర్శి కె.గౌతమ్, రాష్ట్ర కోశాధికారి బొగ్గారపు వెంకటేశ్వర్లు, ఖమ్మం జిల్లా కార్యదర్శి దొడ్డె పుల్లయ్య, కోశాధికారి మిరియాల క్రాంతికుమార్ పాల్గొన్నారు.