Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ఖమ్మం
కామ్రేడ్ బోడేపూడి వెంకటేశ్వరరావు (మధిర మాజీ శాసన సభ్యులు, సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు) ఏకైక కుమారుడు బోడేపూడి సత్యనారాయణ (76) ఆదివారం రాత్రి అనారోగ్యంతో హైదరాబాద్లో మృతిచెందారు. ఆయనకు భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. అంత్యక్రియలు మంగళవారం హైద్రాబాద్లోనే నిర్వహిస్తారు. సత్యనారాయణ మృతికి సీపీఐ(ఎం) జిల్లా కమిటీ విప్లవ జోహార్లు అర్పిస్తున్నదని, అలాగే వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్లు పార్టీ జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు పేర్కొన్నారు.
బోడేపూడి సత్యనారాయణ విద్యార్థిగా ఉన్నపుడే ప్రజాతంత్ర విద్యార్థి ఉద్యమంలో సమస్యలపై పోరాటాలు నడిపారని, కళాశాల అధ్యాపకులుగా ఆంధ్రప్రదేశ్ కళాశాలల అధ్యాపకుల సంఘానికి (జి.సి.టి.ఎ.) అధ్యక్షులుగా, ప్రధాన కార్యదర్శిగా పనిచేశారని, అధ్యాపకుల సమస్యలపై పదవిలో ఉన్నంతకాలం నిరంతరం ఎనలేని కృషి చేశారన్నారు. పాఠశాల విద్య నుంచి విశ్వవిద్యాలయ విద్య వరకు వివిధ యాజమాన్యాలలో ఉన్న అధ్యాపకుల సమస్యలపై ఐక్య ఉద్యమాలు నడిపి, విశ్వ విద్యాలయాల, కళాశాలల అఖిల భారత సమాఖ్యకు (ఎ.ఐ.ఎఫ్.వి.సి.టి.ఓ)కు ఉపాధ్యక్షులుగా, కార్యదర్శిగా పనిచేశారని తెలిపారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత వివిధ యాజమాన్యములలో రిటైర్ అయిన కళాశాలల అధ్యాపకుల సంఘాల సమాఖ్యకు గౌరవ ప్రధాన సలహాదారుగా చివరి క్షణం వరకు కృషి చేశారన్నారు. విద్యా రంగ అభివృద్ధి కోసం గత 50 ఏండ్లుగా ఎనలేని కృషి చేస్తున్నట్లు తెలిపారు.