Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వైరా
తల్లాడ రెవెన్యూ పరిధిలోని ప్రభుత్వ భూమిలో వైరా మున్సిపాలిటీకి సంబంధించిన డంపింగ్ యార్డు ఏర్పాటుకు వెళ్లిన రెవెన్యూ, మునిసిపల్ సిబ్బందిని తల్లాడ మండలం కొడవటిమెట్ట (రెడ్డిగూడెం) గ్రామ దళితులు అడ్డుకున్నారు. గత రెండు సంవత్సరాలుగా మునిసిపాలిటీకి డంపింగ్ యార్డుకు స్థలం కోసం అన్వేషిస్తుంది. ఎట్టకేలకు వైరా రిజర్వాయర్ అలుగు వాగు సమీపంలో కొంత ప్రభుత్వ భూమిని రెవెన్యూ అధికారులు గుర్తించి డంపింగ్ యార్డుకు కేటాయించారు. వైరా మునిసిపల్ వాహనాలు చెత్త తీసుకుని కొడవటిమెట్ట గ్రామంలో గుండా కేటాయించబడిన స్థలంలోకి వెళుతుండగా గ్రామస్థులు అడ్డుకున్నారు. సోమవారం దాదాపు ఐదు గంటల పాటు డంపింగ్ యార్డు స్థలం వద్ద ఉద్రిక్తత కొనసాగింది. వైరా తహసీల్దార్ నారపోగు అరుణ, తల్లాడ తాసీళ్దార్ గంటా శ్రీలత, ఎస్ఐలు సురేష్, నరేష్, మునిసిపల్ కమిషనర్ ఎన్ వెంకట స్వామి, ఇతర రెవెన్యూ, పోలీస్ సిబ్బంది భారీగా మోహరించారు. అయినప్పటికీ గ్రామస్థులు పట్టువిడవక పోవటంతో గత్యంతరం లేక చెత్త ట్రాక్టర్లను వెనక్కు తీసుకుని వచ్చారు. వైరా మునిసిపాలిటీనీ మూడేళ్లుగా డంపింగ్ యార్డ్ సమస్య తీవ్రంగా వేధిస్తుంది. తొలుత వైరా కు 15 కి మీ దూరంలో ఉన్న గరిక పాడు గ్రామంలో ఉన్న ప్రభుత్వ భూమిలో డంపింగ్ యార్డు ఏర్పాటు చేశారు. అక్కడికి వెళ్లిన చెత్త ట్రాక్టర్లను ఆ గ్రామస్థులు అడ్డుకుని వెనక్కు పంపారు. ఏడెనిమిది సార్లు ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడినవి. ఆ తర్వాత వైరాకు సుమారు 10 కి మీ దూరంలో ఉన్న కొండ కుడిమ గ్రామ సమీపంలో లోని గుట్ట వద్ద డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేసి చెత్త ట్రాక్టర్లను పంపారు. గ్రామస్థులు అడ్డుకుని ఆ చెత్తకు తమ గ్రామానికి సంబంధం ఏంటని నిలదీశారు. ఆ గ్రామస్తులపై కమిషనర్ పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. ఈ సమస్యపై రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజరు కుమార్ జోక్యం చేసుకుని వైరాకు సమీపంలోని డంపింగ్ యార్డు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. దాంతో ప్రస్తుత కలెక్టర్ వి పి గౌతం కొంతకాలం క్రితం వైరా మునిసిపాలిటీ సందర్శించిన తర్వాత ప్రాజెక్ట్ అలుగు వాగుల సమీపంలో కొడవటిమెట్ట రెవెన్యూ పరిధిలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూమిని డంపింగ్ యార్డు కోసం కేటాయించాలని మునిసిపల్ చైర్మన్ సూత కాని జైపాల్, వైస్ చైర్మన్ ముళ్లపాటి సీతారాములు కోరారు. అలుగు వాగు సమీపంలోని సుమారు 20 ఎకరాల ప్రభుత్వ భూమిలో 12 ఎకరాలను దళితులకు అసైన్డ్‌మెంట్ పట్టాలు ఇచ్చి ఉన్నారు. ఇంకా 10 ఎకరాల వరకు ఖాళీగా ఉంటుంది. కలెక్టర్ ఆదేశాల మేరకు తల్లాడ తాశీల్డార్ నాలుగు ఎకరాలకు పైగా స్థలాన్ని డంపింగ్ యార్డు కోసం కేటాయించారు. అధికారికంగా ప్రక్రియ పూర్తైన తర్వాత మునిసిపాలిటీ చెత్త ఆటోలు ఆ స్థలంలోకి వెళుతుండగా సమాచారం అందుకున్న దళితులు పెద్ద ఎత్తున అట్టి స్థలం వద్దకు చేరుకుని డంపింగ్‌ను అడ్డుకున్నారు. తాసీల్డార్లు, ఎస్ ఐ లు వారికి ఎంత నచ్చచెప్పినా వినలేదు. కొడవటిమెట్ట రెవెన్యూ లోని భూమి భవిష్యత్‌లో తమకు కావాలంటే అప్పుడు తమకు ఎవరిస్తారని నిలదీశారు. ఈ భూమిని ఎట్టి పరిస్థితుల్లోనూ డంపింగ్ యార్డుకు ఇవ్వబోమని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని ఖమ్మం ఆర్డిఓ దృష్టికి తీసుకెళతామని తాసీల్దార్లు చెప్పారు. ప్రస్తుతానికి చెత్త ట్రాక్టర్లను వెనక్కి తీసుకుపోవాల్సిన పరిస్థితి తప్పలేదు.