Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
వానాకాలం సీజన్ ధాన్యం కొనుగోలుకు అన్ని ఏర్పాట్లతో సన్నద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ ప్రజ్ఞా సమావేశ మందిరంలో సోమవారం సాయంత్రం సంబంధిత అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో వానాకాలం పంట సీజన్, ధాన్యం కొనుగోలు ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్షించి అధికారులకు పలు ఆదేశాలు, సూచనలు చేసారు. ఇప్పటికే సూచించిన విధంగా జిల్లాలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని రైతులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని ఏరోజుకు ఆరోజు రవాణా జరిగే విధంగా వాహనాలను సిద్ధంగా ఉంచుకోవాలని అన్ని కొనుగోలు కేంద్రాలలో అసవరమైన తూకం మిషన్లు, తేమ నిర్ధారణ శాతం పరికరాలు, టార్పాలిన్లు, గన్నీబ్యాగులు సరిపోను అందుబాటులో ఉంచాలని కలెక్టర్ ఆదేశించారు. మండలాల వారీగా ధాన్యం దిగుమతి అంచనాల ప్రకారం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని అందుకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని అందించాలని వ్యవసాయ శాఖాధికారులను కలెక్టర్ ఆదేశించారు. రబీకి సంబంధించిన పెండింగ్ సి.ఎం.ఆర్ డెలవరీలను త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ మిల్లర్లకు సూచించారు. రబీ సీఎంఆర్ డెలవరీల బకాయిలపై ప్రజ్ఞా సమావేశ మందిరంలో మిల్లర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ సమీక్షించారు. ఇంకనూ కొన్ని రైస్ మిల్లర్ల వద్ద సి.ఎం.ఆర్ డెలవరీలు అధికంగా పెండింగ్లో ఉన్నాయని వీటిపై సత్వర చర్యలు చేపట్టి త్వరగా పూర్తి చేయాలని మిల్లర్లకు కలెక్టర్ సూచించారు. అదేవిధంగా ఎఫ్.సి.ఐ గోదాములలో ఖమ్మం జిల్లాకు నిల్వసామర్ధ్యాన్ని మరింత పెంచాలని ఎప్.సి.ఐ అధికారులకు కలెక్టర్ సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ ఎన్. మధుసూదన్, జిల్లా పౌర సరఫరాల అధికారి రాజేందర్, సివిల్ సప్లరు జిల్లా మేనేజర్ సోములు, జిల్లా మార్కెటింగ్ అధికారి నాగరాజు, జిల్లా వ్యవసాయ శాఖాధికారి విజయనిర్మల, జిల్లా రవాణా శాఖ అధికారి కిషన్ రావు, జిల్లా సహకార శాఖాధికారి విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.