Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఖమ్మం
పెండింగ్ స్కాలర్ షిప్స్, ఫీజు రీయంబర్స్ మెంట్స్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టర్ కార్యాలయం ముట్టడించారు. కార్యాలయంలోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించిన నాయకులను అరెస్టు చేశారు. దీంతో కొద్ది సేపు ఉధృక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి తాళ్ల నాగరాజు మాట్లాడుతూ విద్యార్థులు త్యాగాల ఫలితంగా సాధించిన రాష్ట్రంలో విద్యార్థులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. రెండు సంవత్సరాలు పెండింగ్ ఉన్న 3 వేల కోట్ల ఉపకార వేతనాలు, ఫీజు రీయంబర్స్ విడుదల చేయాలని ఎస్.ఎఫ్.ఐ. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టర్ కార్యలయాల ముట్టడికి పిలుపునిచ్చిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ రెండేండ్లుగా చెల్లించడం లేదని, దీంతో దాదాపు రూ.3,100 కోట్ల బకాయిలు పెండింగ్ లో ఉన్నాయని, రాష్ట్రంలో స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్ మెంట్ కోసం దాదాపు 15 లక్షల మంది విద్యార్ధులు ఎదురుచూస్తున్నారని తెలిపారు. మరోవైపు డబ్బులు కట్టకపోవడంతో కాలేజీ మేనేజ్మెంట్లు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని అన్నారు. దీంతో విద్యార్థులకు ఉన్నత చదువులకు వెళ్ళాలంటే తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయని, కొందరు పేరెంట్స్ బయట అప్పు తెచ్చి కాలేజీ ఫీజులు కడుతున్నారని అన్నారు. కొందరూ విద్యకు దూరమవుతున్నారని అన్నారు. ా్కలర్షిప్స్, రీయంబర్స్ మెంట్స్ రాక వారి సర్టిఫికేట్స్ యాజమాన్యాలు ఇవ్వకపోవడంతో వనపర్తిలో లావణ్య అనే విద్యార్దిని చనిపోయిందని, వరంగల్ జిల్లాలో నవ్య అనే మరో విద్యార్ధిని చనిపోయిందని తెలిపారు. అయినా ప్రభుత్వానికి కనీకరం లేదని అన్నారు. ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి జమ్మి అశోక్ మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే జిల్లా కేంద్రంగా జనరల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని అన్నారు. నియోజకవర్గానికి ఒక ప్రభుత్వ పాలిటెక్నిక్, ప్రతి జిల్లా కేంద్రాల్లో ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలలు ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు వి మధు, తుడుం ప్రవీణ్, గర్ల్స్ కో కన్వీనర్ సంగీత, జిల్లా కమిటీ సభ్యులు, దొంతుబైన వెంకటేష్ పాల్గొన్నారు.