Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ఖమ్మం
గంజాయి కేసులో పరారీ ఉన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏఆర్ కానిస్టేబుల్ అనుబత్తుల వెంకటేశ్వర్లు అలియాస్ వెంకట్, అతని సమీప బంధువు బండారి విశ్వతేజ్ను సోమవారం ఖమ్మం అర్బన్ పోలీసులు శ్రీశ్రీ సర్కిల్ వద్ద అదుపులోకి తీసుకున్నట్లు ఖమ్మం టౌన్ ఏసీపీ ఆంజనేయులు తెలిపారు. నిందితుల నుండి 40 వేల రూపాయల విలువ గల రెండు కేజీల గంజాయి ప్యాకెట్, రెండు సెల్ ఫోన్లు, ఒక మోటర్ సైకిల్‌ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. గంజాయి అక్రమ రవాణా ద్వారా సులభంగా డబ్బు సంపాదించాలనే అత్యాశకు పోయిన ఈ ఇద్దరు కానిస్టేబుళ్లు మూడు నెలల క్రితం సీలేరుకు చెందిన రాజు అనే వ్యక్తి నుండి ఏడు కేజీల గంజాయి కొనుగోలు చేశారని తెలిపారు. కొనుగోలు చేసిన గంజాయి 15 రోజుల క్రితం నిందితుడు కానిస్టేబుల్ వెంకట్, అతని మేనల్లుడు అయిన కారేపల్లి మండలం తోడితలగూడెం గ్రామానికి చెందిన బండారి విశ్వతేజ అలియాస్ వాసు ఇద్దరు కలిసి ఖమ్మం నగరానికి వచ్చి కానిస్టేబుల్ కొండా సతీష్‌కు 5 కేజీల గంజాయిను అప్పగించి వెళ్లారు. ఆ సమయంలో సతీష్‌తో పాటు కొణిజర్ల మండలం పల్లిపాడు గ్రామానికి చెందిన న్యాయవాది వెంకటేశ్వర్లు కూడా ఉన్నాడని తెలిపారు. తీసుకున్న గంజాయిని ఈనెల 3న ఖమ్మం జిల్లా జైలు వార్డెన్‌గా విధులు నిర్వహిస్తున్న వ్యక్తికి విక్రయించేందుకు ప్రయత్నించగా కొండా సతీష్, వెంకటేశ్వర్లను ఖమ్మం ఖానాపురం హవేలీ పోలీసులు వలపన్ని పట్టుకున్న సంగతి తెలిసిందే. నిందితుడు వెంకట్‌కు గతంలో భద్రాచలంకు చెందిన రుద్రబోయిన గోపి అలియాస్ గోపాలకృష్ణ సహకరించినాడని తెలిపారు. పరారీలో ఉన్న జైలు వార్డన్, సీలేరుకు చెందిన రాజు గురించి ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టారని తెలిపారు