Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ఖమ్మం
అటవీ హక్కుల చట్టం ప్రకారం అర్హులందరికీ హక్కు పత్రాలు ఇవ్వాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం (వ్యకాస) రాష్ట్ర అధ్యక్షులు బుర్రి ప్రసాద్ డిమాండ్ చేశారు. సోమవారం ఖమ్మం సుందరయ్య భవన్లో జిల్లా కమిటీ సమావేశం మెరుగు సత్యనారాయణ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో అయన మాట్లాడుతూ 2006లో అటవీ హక్కుల చట్టం ప్రకారం సాగులో ఉన్న సాగుదారులందరికీ హక్కు పత్రాలు ఇవ్వాలని, ఎలాంటి షరతులు లేకుండా గిరిజన ప్రాంతంలో రెండు మూడు తరాలుగా జీవిస్తున్న గిరిజనేతర పేదలకు కూడా హక్కు పత్రాలు ఇవ్వాలని 2006లో అటవీ హక్కుల చట్టం చెబుతోందన్నారు. దీన్ని నీరుగార్చేందుకు కెసిఆర్ ప్రయత్నిస్తున్నారని, దాన్ని మానుకోవాలని హితవు పలికారు. గ్రామ సభల ద్వారా అర్హులందర్నీ గుర్తించి హక్కు పత్రాలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. వ్యవసాయ కూలీల కోసం కూలి చట్టం అమలు చేయాలని, కూలీలందరి ఇన్సూరెన్స్ ప్రభుత్వమే చెల్లించాలని, కూలీల కోసం కూలి బంధు పథకం తేవాలని డిమాండ్ చేశారు. దళిత గిరిజన వెనుకబడిన పేదలందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలని, 57 సంవత్సరాలు నిండిన వృద్ధులందరికీ పెన్షన్ ఇవ్వాలని, డ్వాక్రా మహిళలకు గత ప్రభుత్వ రాయితీలను పునరుద్ధరించాలని, 9, 10 తరగతులకు స్కాలర్షిపులు, అభయహస్తం పెన్షన్లు ఇవ్వాలన్నారు. కెసిఆర్ ఇచ్చిన వాగ్దానం మేరకు నిరుద్యోగులందరికీ భృతి ఇవ్వాలన్నారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం రైతులను, వ్యవసాయ కార్మికులను తీవ్ర ఇబ్బందులు ఉంటే కెసిఆర్ మోడీకి వత్తాసు పలకడం అన్యాయమన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నిలబడాలని, రైతు వ్యతిరేక చట్టాలు రైతుల సమస్యలు పరిష్కరించే పోరాటంలో కలిసిరావాలని హితవు పలికారు. కేంద్ర ప్రభుత్వం ఉపాధికి 79 వేల కోట్లు కేటాయించడం ఉపాధి కూలీలకు అన్యాయం చేయడమే అన్నారు. 15 లక్షల కోట్ల బడ్జెట్ నాడే 90 వేల కోట్లు ఉపాధికి కేటాయించి నేడు 34 లక్షల కోట్ల కేంద్ర బడ్జెట్లో 79 వేలకు తగ్గించడం ఉపాధి కార్మికులకు తీవ్ర అన్యాయం అన్నారు. దీనికి వ్యతిరేకంగా కెసిఆర్ తమతో కలిసి రావాలని హితవు పలికారు. సంఘం జిల్లా కార్యదర్శి పొన్నం వెంకటేశ్వరరావు మాట్లాడుతూ జిల్లాలో అర్హులందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలని, పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలని, దళిత గిరిజన కాలనీలో సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో నాయకులు పి.సంగయ్య, జాజిరి శ్రీనివాస్, తాళ్లపల్లి కృష్ణ, వత్సవాయి జానకిరాములు, బారి మల్సూర్, వడ్లమూడి నాగేశ్వరరావు, అంగిరేకుల నరసయ్య, దుగ్గి వెంకటేశ్వర్లు, ప్రతాప్నేని వెంకటేశ్వర్లు, బంధం శ్రీను, మేడి బిక్షం, నెర్సుల వెంకటేశ్వర్లు, రాయల శ్రీనివాస్, బందెల వెంకయ్య, రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.