Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
పోడుదారులకు అటవీ హక్కు పత్రాల ప్రక్రియ సోమవారం నుంచి ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా మొదలైంది. రాష్ట్రవ్యాప్త నోటిఫికేషన్ లేకుండానే ప్రారంభమైన ఈ ప్రక్రియను గిరిజన నోడల్ ఏజెన్సీల ద్వారా కొనసాగిస్తున్నారు. ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల కలెక్టర్లు వీపీ గౌతమ్, దురిశెట్టి అనుదీప్ ఆదేశాల మేరకు పోడుదారులకు దరఖాస్తులు అందజేస్తున్నారు. గ్రామసభలు నిర్వహించి అవగాహన కల్పిస్తున్నారు. మూడురోజుల పాటు దరఖాస్తుల పంపిణీ, గ్రామసభల నిర్వహణ కొనసాగుతుంది. 11వ తేదీ నుంచి ఆక్రమణదారుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. అయితే శాటిలైట్ సర్వే కారణంగా చాలా మండలాల్లో భూములు అరకొరగా ఉన్నట్లు అధికారులు నిర్ధారించారు. దీనిపై తొలిరోజు నుంచే ఆందోళనలు మొదలయ్యాయి. దీనిపై అన్నపురెడ్డిపల్లి మండల కేంద్రంలో అఖిలపక్షం ఆధ్వర్యంలో సోమవారం ఆందోళన నిర్వహించారు. అర్హులందరికీ పోడు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అరకొర భూములు పంపిణీ చేస్తే సహించేది లేదన్నారు. వంద ఎకరాల భూమిని 40 ఎకరాలుగా నిర్ధారించడం తగదన్నారు. అర్హులందరికీ భూములు అందకపోతే ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
- పంచాయతీల వారీగా బృందాలు...
పంచాయతీల వారీగా బృందాలు ఏర్పాటు చేశారు. ఆయా మండలాల్లో ఉన్న పోడు భూములు, అర్హులు, ఆవాసాల ఆధారంగా ఎఫ్ఆర్సీ కమిటీలను ఏర్పాటు చేశారు. గ్రామస్థాయి బృందంలో గ్రామపంచాయతీ కార్యదర్శి, ఫారెస్టు బీట్ ఆఫీసర్, విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ (వీఆర్ఏ), గ్రామపంచాయతీ కార్మికులు ఉన్నారు. మండలస్థాయిలో మండల పంచాయతీ అధికారి (ఎంపీవో), మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీవో), అటవీరేంజ్ అధికారి (ఎఫ్ఆర్వో), తహశీల్దార్ ఉన్నారు. ఈ ఎఫ్ఆర్సీ కమిటీలు మూడురోజుల పాటు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాయి. ఈ సదస్సుల్లో అటవీహక్కుల చట్టం-2006, పోడు పట్టాల దరఖాస్తు విధివిధానాలు, 11వ తేదీ నుంచి స్వీకరించే దరఖాస్తులతో పాటు పొందుపరచాల్సిన ధ్రువీకరణలు, ఏయే అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలో వివరిస్తున్నారు. దరఖాస్తు ఫారాలు సంబంధిత పంచాయతీ కార్యదర్శి వద్ద అందు బాటులో ఉంచారు. దరఖాస్తు దారులు సమగ్ర సమాచారంతో అవసరమైన ధ్రువీ కరణలతో సమర్పించాలని సూచిస్తున్నారు. గ్రామస్థాయి అధికారులు దరఖాస్తులపై పూర్తి అవగాహన కల్పించాలని ఉమ్మడి జిల్లాల కలెక్టర్లు ఆదేశించారు. ఖమ్మం జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్ సింగరేణి మండలంలోని రేలకాయపల్లి పంచాయతీ పరిధిలోని తవిసిబోడు, చీమలపాడు గ్రామాల్లో పర్యటించారు. కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అనుదీప్ టేకులపల్లి మండలంలో అవగాహన కల్పించారు. పోడు భూముల సమస్య పరిష్కారానికి నోడల్ అధికారిగా భద్రా చలం ఐటీడీఏ పీవో గౌతమ్ పోట్రు వ్యవహరిస్తున్నారు.
- ప్రక్రియ ఇలా...
గ్రామస్థాయిలో ఎఫ్ఆర్సీ కమిటీల ద్వారా స్వీకరించిన దరఖాస్తులను విచారించి అర్హుల జాబితాను సిద్ధం చేస్తారు. గ్రామసభ తీర్మానం తర్వాత జాబితా సబ్‌డివిజనల్ కమిటీకి వెళ్తుంది. కమిటీ పరిశీలన తర్వాత నివేదిక కలెక్టర్‌కు వెళ్తుంది. కలెక్టర్ నేతృత్వంలో కమిటీని అర్హుల జాబితాను పరిశీలించి ఆర్వోఎఫ్ఆర్-2005 చట్టం ప్రకారం పట్టాలు జారీ చేస్తుంది.
- ఖమ్మం జిల్లాలో మండలాల వారీగా గుర్తించిన పోడు భూములు (ఎకరాల్లో)...
సత్తుపల్లి 3,208, కొణిజర్ల 3,682, కారేపల్లి 4,673, పెనుబల్లి 1,580, రఘునాథపాలెం 1,795, కామేపల్లి 988, ఏన్కూరు 1,087, తల్లాడ 270, చింతకాని 130, వేంసూరు 31,
- భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో...
ఆళ్లపల్లి 15,514, అన్నపురెడ్డిపల్లి 1,826, అశ్వాపురం 8,198, అశ్వారావుపేట 16,262, బూర్గంపహాడ్ 7,257, చండ్రుగొండ 1,987, చర్ల 7,431, చంచుపల్లి 1,418, దమ్మపేట 2,762, దుమ్ముగూడెం 15,097, ఏన్కూరు 113, గుండాల 32,813, జూలుపాడు 5,151, కరకగూడెం 11,328, మణుగూరు 2,813, ముల్కపల్లి 19,740, పాల్వంచ 1,987, పినపాక 6,445, సుజాతనగర్ 2,096, టేకులపల్లి 25,948, ఇల్లందు 22,726, లక్ష్మీదేవిపల్లి 11,646.