Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ జిల్లా మైనార్టీ అధ్యక్షులు యాకూబ్ పాషా
నవతెలంగాణ-పాల్వంచ
అంతర్జాతీయ ఉర్దూ కవి, ప్రముఖ రచయిత డాక్టర్ 'అల్లమా ముహమ్మద్ ఇక్బాల్' జయంతిని పురస్కరించుకుని నిర్వహించుకునే జాతీయ ఉర్దూ దినోత్సవమును జిల్లా మైనార్టీ వెల్పేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సంస్థ కార్యాలయంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. అందులో భాగంగా జిల్లాలోని 6 మైనార్టీ గురుకులాలకు చెందిన ఉర్దూ ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించి మెమోంటోలను అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన మైనార్టీ సంక్షేమ అధికారి సంజీవ మాట్లాడుతూ.. ఉర్దూ ప్రాధాన్యతను గుర్తించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో రెండవ అధికార భాషగా ఉర్దూను గుర్తించిందని, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా మైనార్టీ గురుకులాల్లో ఉర్దూను కూడా ప్రత్యక్షంగా విద్యార్థులకు బోధన అందించడంతోపాటు ఇస్లాం ధార్మిక పద్ధతులను కూడా నేర్పిస్తున్నదని పేర్కొన్నారు. అనంతరం మైనార్టీ జిల్లా అధ్యక్షులు ఎండీ యాకూబ్ పాషా మాట్లాడుతూ..ప్రతీ యేడాది జాతీయ ఉర్దూ దినోత్సవాన్ని తాము నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1221 ప్రాథమిక, 240 ఉర్దూ ఉన్నత పాఠశాలలు ఉండగా వాటిలో సగం వరకు టీచర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయని, 2019లో 900 పోస్టులకు నోటిఫికేషన్లు ఇస్తే 535 ఉర్దూ టీచర్ పోస్టులు భర్తీ చేయలేదన్నారు. అంతేకాకుండా జిల్లాలో పేరుకే ఉర్దూ పాఠశాలలు అని ఒక్క పాఠశాలలో ఉర్దూ బోధన జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సంస్థ సభ్యులు హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.