Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మిషన్ భగీరథ నీళ్లు బంద్ ..అవస్థలు పడుతున్న ప్రజలు
నవ తెలంగాణ- బోనకల్
మూడు నెలలుగా జీతాలు చెల్లించకపోవడంతో మిషన్ భగీరథ కార్మికులు సమ్మెకు దిగారు దీంతో ప్రజలు మంచినీటి కోసం అవస్థలు పడుతున్నారు. కలకోట, రాయన్నపేట, మోటమర్రి, ఆళ్లపాడు, గోవిందపురం(ఏ) గ్రామాలకు వారం రోజులుగా మిషన్ భగీరథ నీటి సరఫరా నిలిచి పోయింది. మధిర క్రాస్‌రోడ్డు వద్ద మిషన్ భగీరథ పైప్ లైన్ ఇటీవల పగిలిపోయింది. పగిలిపోయిన పైప్ లైన్ మరమ్మతులు చేయడానికి మిషన్ భగీరథ కార్మికులు సమ్మెలో ఉన్నారు. దీంతో పైపులైన్ల మరమ్మతులు నిలిచిపోయాయి. ఎల్ఎన్టి సంస్థ తమకు మూడు నెలలుగా జీతాలు చెల్లించడం లేదని, దీంతో తాము జీతాల కోసం సమ్మె చేస్తున్నామని కార్మికులు అంటున్నారు. తమకు జీతాలు చెల్లించే వరకు విధులలో పాల్గొనేది లేదని కార్మికుల స్పష్టం చేస్తున్నారు. కార్మికుల సమ్మె చేయడంతో అనేక గ్రామాలలో మంచినీటి సరఫరా పైపులైను మరమ్మతులు నిలిచిపోయాయి. దీంతో ఆయా గ్రామాల ప్రజలు తమ తమ గ్రామా లలో ఉన్న బోర్లు వద్ద క్యూ కడుతున్నారు. మిషన్ భగీరథ నీటి సరఫరా నిలిచిపోయిన విషయాన్ని ఆర్డబ్ల్యూఎస్, మిషన్ భగీరథ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించు కోవడం లేదని ఆయా గ్రామాల ప్రజలు వాపోతున్నారు. పైప్‌లైన్ మరమ్మతులు పూర్తి చేసి మంచినీటి సమస్య పరిష్కారం చేయాలని, లేనిచో ప్రజలతో మండల కేంద్రంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ఆయా గ్రామల సర్పంచ్‌లు కేతినేని ఇందు, భాగం శ్రీనివాసరావు, ఎంగల దయమణి, కిన్నెర వాణి, మర్రి తిరుపతిరావు అధికారులను హెచ్చరించారు.