Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు సమగ్ర కార్యాచరణ ప్రణాళికతో సన్నద్ధం కావాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శశాంక్ గోయల్ సూచించారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై బుధవారం జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో పలు సూచనలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో 12 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలను నిర్వహించేందుకు ఎన్నికల సంఘం షెడ్యూలు విడుదల చేసిందని తెలిపారు. నవంబరు 16 వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్, 16 నుండి 23 వరకు నామినేషన్ల స్వీకరణ, 24న నామినేషన్ల పరిశీలన, 26 లోగా నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగుస్తుందని, డిసెంబరు 10 న ఉదయం 08.00 గంటల నుండి సాయంత్రం 4.00 గంటల వరకు పోలింగ్, 14న కౌంటింగ్ ఉంటుందని వివరించారు. అదిలాబాద్, కరీంనగర్, వరంగల్, నల్లగొండ, మహబూబ్ నగర్, ఖమ్మం, మెదక్, రంగారెడ్డి, నిజామాబాద్ జిల్లా కలెక్టర్లు రిటర్నింగ్ అధికారులుగా వ్యవహరిస్తారని, సంబంధిత రిటర్నింగ్ అధికారులు మిగిలిన జిల్లాల కలెక్టర్లతో సమన్వయం చేసుకుంటూ శాసనమండలి ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. స్థానిక సంస్థల శాసనమండలి ఎన్నికలు జరిగే జిల్లాల్లో ఎన్నికల ప్రవర్తన నియమావళిని పకడ్బందీగా అమలు చేయాలని ఆదేశించారు. స్థానిక సంస్థల ఎమ్మెలీ ఎన్నికలలో ఎంపిటిసిలు, జడ్పీటిసిలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లకు ఓటు హక్కు ఉంటుందన్నారు. తదనుగుణంగా పోలింగ్ నిర్వహణకు అనువైన పోలింగ్ కేంద్రాలను గుర్తించాలని సూచించారు. రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు ఏర్పాటు చేసి పోలింగ్ కేంద్రాల జాబితాను సిద్ధం చేయాలన్నారు. దీనిపై ప్రతిపాదనలు పంపాలన్నారు. ఉమ్మడి జిల్లాల కలెక్టర్లు జిల్లాలవారీగా ఎన్నికల రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారుల జాబితాను కూడా సిద్ధం చేసి పంపాలని సూచించారు. శాసనమండలి ఎన్నికలు బ్యాలెట్ పేపర్ పద్ధతిన నిర్వహిస్తామని అందుకు అవసరమైన బ్యాలెట్ బాక్స్ లనూ సిద్ధం చేసుకోవాలని సూచించారు. కరోనా నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు భారత ఎన్నికల కమిషన్ జారీ చేసిన మార్గదర్శకాలను పకడ్బందీగా అమలు చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్లకు సూచించారు. రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించే సమయంలో ఎన్నికల ప్రవర్తన నియమావళి, కరోనా మార్గదర్శకాలపై అవగాహన కల్పించాలన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళికి లోబడి రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ప్రచారం చేసుకునే విధంగా ముందస్తు అనుమతులు జారీచేసేందుకు అవ సరమైన ఏర్పాట్లు చేసుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శశాంక్ గోయల్ సూచించారు. వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ వి.పి. గౌతమ్, పోలీసు కమిషనర్ విష్ణు. యస్. వారియర్, నగరపాలక సంస్థ కమిషనర్ ఆదర్శ్ సురభి, అదనపు కలెక్టర్ ఎన్. మధుసూదన్, శిక్షణ కలెక్టర్ బి. రాహుల్, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి అప్పారావు, ఏ.సి.పి ప్రసన్న కుమార్, ఎన్నికల విభాగపు డి.టి రాంబాబు, తదితరులు పాల్గొన్నారు.