Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - వైరా టౌన్
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పర అవగాహన అంగీకారంతోనే వరి పంట సాగుపై ఆంక్షలు విధించాయని తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు బొంతు రాంబాబు అన్నారు. బుధవారం వైరా మున్సిపాలిటీ పరిధిలోని సుందరయ్య నగరంలో తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని, వరి పంట సాగుపై ప్రభుత్వ విధించిన ఆంక్షలను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బొంతు రాంబాబు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆహార పంట ఉత్పత్తులను తక్కువ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాయని అన్నారు. రైతులకు నష్టం చేసే ప్రయత్నాన్ని విరమించుకోవాలని, ప్రత్యామ్నాయ పంటలు సాగు వైపు రైతులను సమాయత్తం చేయడానికి ఇతర పంటల సాగుకు ప్రభుత్వం శాస్త్రీయ విధానం రూపొందించాలని డిమాండ్ చేశారు. వరి కోతలు ప్రారంభం అవుతున్న సమయంలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ(ఎం) వైరా పట్టణ కార్యదర్శి సుంకర సుధాకర్, రైతు సంఘం జిల్లా కమిటీ సభ్యులు బొంతు సమత, బోడపట్ల రవీందర్, కురకుంట్ల శ్రీనివాసరావు, పారుపల్లి చంద్రశేఖర్ బాబు, మందడపు రామారావు, నర్వనేని ఆదిలక్ష్మి, తోట కృష్ణవేణి, నక్కా రాంబాబు, వడ్లమూడి మధు , బందెల్ పౌలు, రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.