Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ ఆత్మహత్యలే శరణ్యం
అ బీటీపీఎస్ వలన ఉద్యోగాలు వస్తాయి
అనుకున్నాం కానీ ఉపాధినే కోల్పోతున్నాం
అ బొగ్గు లారీ యజమానుల మనోవేదన
నవతెలంగాణ-మణుగూరు
మణుగూరు సింగరేణి ఏరియా బొగ్గు రవాణా రోడ్డు మార్గం ద్వారా పెంచకపోతే వేలాది కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని బొగ్గు రవాణా చేసే సుమారు 700 లారీల యజమానులు మనోవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిలో 100 నుండి 75 లారీలు ద్వారా బొగ్గు రవాణా చేయాలని యాజమాన్యాలు కోరుతున్నాయి. కేంద్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు విద్యుత్ సంస్థలకు బొగ్గు సరఫరాలో తొలి ప్రాధాన్యత ఇస్తూనే ఇతర ఆధారిత పరిశ్రమలకు కూడా ఏక కాలంలో డిమాండుకు తగ్గ బొగ్గు అందించాలని డైరెక్టరు ఆపరేషన్ ప్రకటన చేసినా సింగరేణి యాజమాన్యం కనికరించడం లేదు. అలా కాకుండా రోజుకు 10 నుండి 12 లారీలు మాత్రమే అందించడం ద్వారా దీనిపై ఆధారపడి డ్రైవర్లు, క్లీనర్లు, ఆటోమోబైల్ షాపు యజమానులు, మెకానిక్‌లు, తదితర కుటుంబాలు గిరాకి లేక జీవనోపాధి కోల్పోతున్నారు. గతంలో రైలు మార్గం లేని సమయంలో బొగ్గు రోడ్డు మార్గం ద్వారానే సరఫరా చేసేవారు. దీనిపై అనేక కుటుంబాలు ఆధారపడి జీవించేవారు. ఇప్పుడు రోజుకు 500 టన్నుల బొగ్గు మాత్రమే సరఫరా చేసేందుకు యాజమాన్యం అంగీకరించింది. దీనిలో 200 టన్నులు బయటి వారికి కోల్ ట్రాన్స్‌పోర్టు సరఫరా చేస్తుంది. మిగతా 300 టన్నులు సుమారు (10 నుంచి 15 లారీలు) మాత్రమే లారీ యజమానులకు ఇబ్బందులు వచ్చి పడ్డాయి. వారు, వారి కుటంబసభ్యులు ఆత్మహత్యలే శరణ్యమంటున్నారు. అనేక ట్యాక్సీలు కట్టలేక డ్రైవర్లను, క్లీనర్లకు జీతం ఇచ్చుకోలేక కనీసం పిల్లలను కూడా చదివించుకునే పరిస్థితిలోకి నెట్టివేయబడ్డారు. దీని కారణంగా గతంలో ఆత్మహత్యలు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. దీనికి గల కారణం భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ 11 నుండి 14 వేల టన్నులు బొగ్గును సరఫరా చేస్తున్నారు. రైల్వే ద్వారా 4 ర్యాకులు నుండి 12 వేల టన్నుల బొగ్గును సరఫరా చేస్తున్నారు. భారజాల కార్మాగారంకు 2 వేల టన్నులు రోజు సరఫరా చేస్తున్నారు. సెప్టెంబరు నెల నుండి రోడ్డు మార్గం ద్వారా తక్కువ బొగ్గు రవాణా చేస్తున్నారు. స్థానిక శాసనసభ్యులు రేగా కాంతారావు, సింగరేణి మార్కెటింగ్ జీఎం రాజశేఖర్‌తో మాట్లాడి 500 టన్నుల బొగ్గును రోజుకు కొద్ది కొద్దిగా పెంచుకుంటూ వస్తున్నారు. ఇది పూర్తిగా స్థానికులకు ఉపయోగపరంగా లేదు. దీనితో సుమారు 3 వేల మంది జీవనోపాధి కోల్పోతున్నారు. లారీ యాజమానులు ఇన్సూరెన్స్, బండి ఫైనాన్స్, రోడ్ ట్యాక్స్ తదితర ట్యాక్స్‌లు కట్టలేక అవస్థలు పడుతున్నారు. రోడ్డు రవాణా ద్వారా బొగ్గు సరఫరా పెంచి లారీ యజమానులను ఆదుకోవాలని ప్రజలు, ప్రజాసంఘాలు కోరుతున్నాయి.
రోడ్డు మార్గం ద్వారా 2 వేల టన్నులు బొగ్గు రవాణాకందించాలి
లారీ ఓనర్స్ వెల్ఫెర్ అసోసియేషన్ అధ్యక్షులు ఉడతాని భాస్కర్
రోడ్డు మార్గం ద్వారా 500 టన్నుల బొగ్గు మాత్రమే అందిస్తున్నారు. దీనిని 2 వేల టన్నులకు పెంచడం వలన లారీ యజమానులకు ఉపశమనం కలుగుతుంది. ఆర్థికంగా ఇబ్బందులు ఉండవని లారీ యజమానులపై ఆధారపడ్డ కుటుంబాలకు కూడా ఆర్థికంగా లాభం చేకూరుతుంది.