Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రభుత్వ ఆస్పత్రికి తరలించిన కుటుంబ సభ్యులు
అవిశ్వాస తీర్మానమే కారణం
నవతెలంగాణ-కొణిజర్ల
సర్పంచ్ పాలకవర్గం కలిసి ఉపసర్పంచ్ ను తొలగించేందుకు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడంతో అవమానానికి గురై ఉపసర్పంచ్ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలంలో చోటుచేసుకుంది. మండల పరిధిలోని అన్నవరం ఉపసర్పంచ్ చల్లా అనురాధని తొలగించాలని సర్పంచ్ ముత్యాల నాగమణి పాలకవర్గ సభ్యులు కలిసి గతకొద్ది రోజుల క్రితం జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశారు. నిబంధనల ప్రకారం రెండు సంవత్సరాల తర్వాత ఉపసర్పంచ్‌లపై అవిశ్వాస తీర్మానం పెట్టె నిబంధనలు ఉండటంతో అభివృద్ధికి సహకరించడంలేదనే ఆరోపణలతో పాలకవర్గ సభ్యులు కలిసి ఉపసర్పంచ్ పై గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట గురువారం అవిశ్వాస తీర్మానం పెట్టారు. ఈ అవిశ్వాస తీర్మానం ఆర్డీవో రవీంద్రనాద్ సమక్షంలో చేపట్టారు. మొత్తం సర్పంచ్‌తో కలిసి 9 మంది పాలకవర్గ సభ్యులు ఉన్నారు. వీరిలో సర్పంచ్‌తోపాటు ఆరుగురు వార్డు సభ్యులు హాజరయ్యారు. 4, 8 వార్డు సభ్యులు గైర్హాజరయ్యారు. అవిశ్వాస తీర్మానానికి వచ్చిన సభ్యులు అంతా ఉపసర్పంచ్‌ను వ్యతిరేకిస్తూ ఆర్డీవో రవీంద్రనాథ్ సమక్షంలో చేతులు ఎత్తారు. ఉపసర్పంచ్ పదవి నుంచి తొలగించడంతో అవమానానికి గురైన ఉపసర్పంచ్ అనురాధ పొలానికి వెళ్లి పొలంలో ఉన్న కలుపుమందు తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు హుటా హుటిన 108 ద్వారా ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అవిశ్వాసం పెట్టే సమయంలో ఉపసర్పంచ్‌ని ఆవమానించడం వల్లే పురుగులమందు తాగిందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. దీంతో అనురాధ తల్లి భద్రమ్మ స్థానిక పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు విచారణ చేపడతునట్లు తెలిపారు.