Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బోనకల్
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుపై వైరా ఏసీపీ స్నేహ మెహరా గురువారం విచారణ నిర్వహించారు. బోనకల్ మాజీ జెడ్పిటిసి బానోత్ కొండ రావినూతల గ్రామానికి చెందిన ఎర్రగాని నాగరాజుకి తన కాంప్లెక్స్‌లో ఓ గదిని బియ్యం, పశు దానం కోసం కిరాయికి ఇచ్చాడు. కొంతకాలం తర్వాత నాగరాజు అనుకున్న దానికి భిన్నంగా కిరాణా సరుకులు పెట్టాడు. దీంతో పక్కనే ఉన్న కిరాణా షాపు వ్యక్తి అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో జెడ్పిటిసి, నాగరాజు మధ్య గత కొంత కాలంగా వివాదాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో పది రోజుల క్రితం నాగరాజు, బానోతు కొండా మధ్య షాపు తాళం విషయంపై వివాదం ముదిరి పాకాన పడింది. ఈ క్రమంలో నాగరాజుకి బానోత్ కొండ గుమస్తాల మధ్య వివాదం జరిగింది. ఈ వివాదం తర్వాత బానోతు కొండా గుమస్తా ధరావత్ బాలకృష్ణ తనను కులం పేరుతో దూషించాడని నాగరాజుతో పాటు మరో ముగ్గురు పై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఆ తర్వాత నాగరాజు తన షాపులో ఉన్న మూడు లక్షల రూపాయల విలువచేసే బియ్యం, పశువుల దానం ఎత్తుకెళ్లారని స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. బాలకృష్ణ ఇచ్చిన ఫిర్యాదుపై సంఘటనా స్థలంలో ఏసిపి విచారణ నిర్వహించారు. సంఘటన సమయంలో ఉన్న వారిని పిలిపించి సంఘటనా స్థలం వద్ద విచారణ నిర్వహించారు. అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్ కు సాక్షులను పిలిపించి విచారణ నిర్వహించారు. అనంతరం ఆమె స్థానిక పోలీస్ స్టేషన్ లో విలేకరులతో మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ఫిర్యాదుపై విచారణ నిర్వహిస్తున్నామని తెలిపారు. విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. ఆమె వెంట మధిర సిఐ ఒడ్డేపల్లి మురళి, బోనకల్ ఎస్ఐ తేజావత్ కవిత, ఏఎస్ఐ దొండపాటి వెంకటనారాయణ, హెడ్ కానిస్టేబుల్ కొప్పుల లక్ష్మణ్ చౌదరి తదితరులు ఉన్నారు.