Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఆళ్ళపల్లి
మండలంలో ఉన్న ఇసుక రవాణా యథేచ్ఛగా కొనసాగుతోంది. ధనార్జనే ధ్యేయంగా సహజ సంపదను ఇసుకాసురులు దోచేస్తున్నారు. ప్రభుత్వ పథకాల పేరుతో ప్రతి రోజూ వందల సంఖ్యలో ఇసుక లారీల్లో, టిప్పర్లలో ఫుల్ లోడ్గా ఇసుక రవాణా చేస్తున్నారు. ప్రధానంగా ఇప్పనపల్లి సమీపంలో జల్లేరు వాగు నుంచి ఇసుక రవాణా జరుగుతుంది. ఇందులో పట్టా ఉన్న రైతుల పొలాల్లో ఇసుక మేటలు వేసి ఉంటే తరలిస్తున్నామని అధికారులకు చెప్పి నేరుగా జల్లేరు వాగు నుంచే ప్రొక్లేన్లతో తోడి లారిల్లో, టిప్పర్లలో ఇసుక రవాణా చేస్తున్నారు. దీంతో పాటు జీరో మీద లారీలు, టిప్పర్లు బిల్లులు లేకుండా పోతున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. ప్రతి రోజూ ఇసుక రవాణా జరిగి రహదారులు ధ్వంసమై రాకపోకలకు తీవ్ర ఇబ్బందిగా మారుతోందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి ఇసుక రవాణాలను అడ్డుకోవాలని, ఇప్పటికే అత్యవసర పరిస్థితుల్లో జిల్లా కేంద్రానికి వెళ్ళడానికి గంటన్నర పాటు పడుతోందని స్థానికులు వాపోతున్నారు. మరి అధికారులు ఏ మేర ఇసుక దందాను అరికడతారో చూడాలి.