Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య
- రైతు ధర్నాతో దద్దరిల్లిన సత్తుపల్లి
నవతెలంగాణ- సత్తుపల్లి
వరి వేస్తున్న రైతుకు ఉరితాడు బిగించడానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రయ్నతిస్తోందని.. రైతుకు వరి ఉరితాడు కావొద్దని. అదేగనక జరిగితే బీజేపీ మెడకు ఉరి పడటం ఖాయమని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య తీవ్రంగా దుయ్యబట్టారు. వరిని కొనమంటూ కేంద్రప్రభుత్వ ఆంక్షల్ని నిరసిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఆధ్వర్యంలో శుక్రవారం సత్తుపల్లిలో జరిగిన రైతు ధర్నా దద్దరిల్లింది. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి పక్క బజారు నుంచి ప్రారంభమైన టీఆర్ఎస్ శ్రేణుల ప్రదర్శన పట్టణంలోని ప్రధాన రహదారి మీదుగా సాగి అంబేద్కర్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన రైతు ధర్నా శిబిరానికి చేరుకుంది. ఈ ధర్నా కార్యక్రమంలో ఎమ్మెల్యే సండ్ర మాట్లాడారు. కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేసేందుకు, ఆయా శక్తులకు లబ్ధిచేకూర్చేందుకు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం పనిచేస్తోందని విమర్శించారు. ఆహార ధాన్యాలన్నీ కార్పొరేట్ శక్తుల చేతుల్లోకి వెళ్లేలా మూడు రైతు వ్యతిరేక నల్ల చట్టాలను తీసుకొచ్చి అన్నదాతలు లేకుండా బీజేపీ కుట్ర పన్నుతోందన్నారు. ఆ చట్టాలను వ్యతిరేకిస్తూ 8 నెలలుగా పైగా దేశ రాజధానిలో లక్షలాది మంది రైతులు ఆందోళన చేస్తున్నా ప్రధాని మోడీకి కనికరం లేకుండా పోయిందన్నారు. 600 మంది రైతులు ఆందోళనలో చనిపోయారు. ఉత్తరప్రదేశ్లో మంత్రి కుమారుడు ఆరుగురు రైతులను కాల్చి చంపినా ఈ ప్రభుత్వానికి సిగ్గులేదన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మెన్ కూసంపూడి మహేశ్, ఆత్మ ఛైర్మెన్ శీలపురెడ్డి హరికృష్ణారెడ్డి, డీసీఎంఎస్ ఛైర్మెన్ శేషగిరిరావు, ఎంపీపీ దొడ్డా హైమవతిశంకరరావు, జెడ్పీటీసీ కూసంపూడి రామారావు, ఐదు మండలాల టీఆర్ఎస్ ప్రజా ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.