Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
ధాన్యం కొనుగోళ్లలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ టీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు ఖమ్మం జిల్లాలో శుక్రవారం నిర్వహించిన ధర్నా విజయవంతం అయింది. నియోజకవర్గాల వారీగా ఆ పార్టీ ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో ధర్నాలు నిర్వహించారు. ఖమ్మం నియోజకవర్గ ధర్నా స్థానిక కలెక్టరేట్ ఎదుట ఉన్న ధర్నా చౌక్‌లో చేపట్టారు. రైతులు ప్రభుత్వ ఆస్పత్రి ఎదుట ఉన్న రోడ్డుపై బైఠాయించారు. నియోజకవర్గ ఎమ్మెల్యే, మంత్రి పువ్వాడ అజరుకుమార్ నేతృత్వంలో జరిగిన ఈ ధర్నాకు పార్టీ లోక్‌సభా పక్ష నేత, ఎంపీ నామ నాగేశ్వరరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు. పాలేరు నియోజకవర్గంలోని ధర్నాలో ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డితో పాటు ఎంపీ నామ నాగేశ్వరరావు పాల్గన్నారు. వైరాలో లావుడ్యా రాములునాయక్, సత్తుపల్లిలో సండ్ర వెంకటవీరయ్య ఆధ్వర్యంలో ధర్నాలు కొనసాగాయి.
కేంద్రానికి తెలంగాణ రైతుల ఉసూరు తప్పదు
: రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజరు
కళ్లుండి చూడలేని..చెవులుండి వినలేని బీజేపీ ప్రభుత్వానికి తెలంగాణ రైతుల ఉసూరు తప్పక తగులుతుందని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజరుకుమార్ అన్నారు. ఎద్దు ఏడ్చిన వ్యవసాయం.. రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడిన దాఖలాలు లేవ న్నారు. పంజాబ్ రైతుల ధాన్యం పూర్తిస్థాయిలో కొంటున్న కేంద్రం తెలంగాణ విషయంలో ద్వంద్వ వైఖరీ అనుసరిస్తోందన్నారు. అంబానీ, ఆదానిలను రెండు కళ్లుగా భావిస్తున్న కేంద్రం వ్యాపారులను కాపాడటం మినహా రైతులకు ఒరగబెట్టిందేమీ లేదన్నారు. బండి సంజరు తొండి సంజరులా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణ రైతుల ధాన్యాన్ని కొనని పక్షంలో బీజేపీని ఈ రాష్ట్రంలో మొలవనీయం... నిలువ నీయమన్నారు. యాసంగి ధాన్యంతో పాటు వానకాలం ధాన్యం పూర్తిస్థాయిలో కొనేంత వరకు రైతుల పక్షాన, ప్రజల పక్షాన టీఆర్ఎస్ ఆందోళనలు కొనసాగుతాయన్నారు. తాగు, సాగునీరు లేని తెలంగాణను సస్యశ్యామలం చేసిన ఘనత ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావుది అన్నారు. మిషన్ కాకతీయతో చెరువులు, మిషన్ భగీరథతో తాగునీటి సౌకర్యం కల్పించారన్నారు. కేసీఆర్ తెలంగాణ సమాజాన్ని బాగుచేయ కంకణం కట్టుకున్నారన్నారు. పండించిన పంటనంతా కొంటామని ఆహార భద్రత చట్టం తెచ్చి అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తూ కేంద్రం తెలంగాణ రైతాంగాన్ని దగా చేస్తోందన్నారు.
వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా పోరాడాం
: ఎంపీ నామ
కేంద్రం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా పార్లమెంట్ లోన, బయట టీఆర్ఎస్ పోరుడుతోందని ఎంపీ నామ నాగేశ్వరరావు అన్నారు. 18 పార్టీలతో కలిసి పార్లమెంట్ వెలుపల ధర్నా చేసిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. పార్లమెంట్ సాక్షిగా పంటనంతా కొంటామన్న ప్రభుత్వం ఇప్పుడు ఎఫ్‌సీఐ నిబంధనల పేరుతో కొర్రీలు పెట్టడం సరికాదన్నారు. రైతుల విషయంలో రాజకీయం చేయడం తగదన్నారు. 'మేమంతా ఐక్యంగా ఉన్నాం...రాబోయే రోజుల్లో మిమ్మల్ని వదిలిపెట్టం' అంటూ కేంద్రాన్ని హెచ్చరించారు.
ప్రతి గింజనూ కొనాలి : మాజీ ఎంపీ పొంగులేటి
తెలంగాణ రైతాంగం పండించిన ప్రతి వడ్ల గింజనూ కొనాలని ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేశారు. కేంద్రం ప్రభుత్వం రాష్ట్రానికో తీరుగా వ్యవహరించడం...తెలంగాణ రైతుల విషయంలో వివక్ష చూపడం సరికాదన్నారు. ధాన్యం కొనకుండా టీఆర్ఎస్ను ఇరకాటంలో పెట్టి రాజకీయ లబ్ధి పొందాలని చూడటం సరికాదన్నారు. రైతుల పక్షాన డైనమిక్ ఎంపీ నామ పార్లమెంట్లో పలుమార్లు రైతుల పక్షాన మాట్లాడిన విషయాన్ని గుర్తు చేశారు. అంతకుముందు ఎడ్ల బండిపై మంత్రి అజరు, ఎంపీ నామ, మాజీ ఎంపీ పొంగులేటి ధర్నా ప్రాంగణానికి చేరుకున్నారు. అభిమానులు ఇచ్చిన కొరడాలను ఝుళిపించి మరీ కేంద్రాన్ని హెచ్చరించారు.
రైతుబంధు సమితి సభ్యులు మందడపు సుధాకర్ ఈ ధర్నా సందర్భంగా నిర్వహించిన సభకు అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమలరాజ్, డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషయ్య, ఖమ్మం మార్కెట్ కమిటీ చైర్మన్ లక్ష్మీప్రసన్న, మేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్ బచ్చు విజరుకుమార్, టీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయ ఇన్చార్జి ఆర్జేసీ కృష్ణ, గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఖమర్, పార్టీ జిల్లా నాయకులు మట్టా దయానంద్, తుంబూరు దయాకర్‌రెడ్డి, పార్టీ నగర అధ్యక్షులు పగడాల నాగరాజు, యువజన విభాగం జిల్లా అధ్యక్షులు చింతనిప్పు కృష్ణచైతన్య, ఆయా డివిజన్ల కార్పొరేటర్లు, పెద్ద సంఖ్యలో రైతులు ఈధర్నాలో పాల్గొన్నారు.