Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లోపిస్తోంది. ఒకరిపై ఒకరు నెపాన్ని నెట్టుకుంటూ విమర్శలు చేసుకోవడం మినహా రైతులకు మేలు చేసే విషయంలో ఏమాత్రం నిజాయితీ కనిపించడం లేదు. ఇప్పటికే వానాకాలం వరి కోతలు పూర్తయి..ధాన్యం దిగుబడి రాక ప్రారంభమై నెలరోజులవుతున్నా ఇంతవరకూ పలు జిల్లాల్లో కొనుగోళ్లు ప్రారంభం కాలేదు. ఖమ్మం జిల్లాలో రెండు రోజుల క్రితం సత్తుపల్లి మండలంలో పేరుకు రెండు కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. జిల్లావ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించేందుకు ఇంకా రెండు, మూడు రోజుల సమయం పడుతుందని జిల్లా పౌర సరఫరాల అధికారులు చెబుతున్నారు. ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం కాకపోవడంతో ఇప్పటికే పలువురు రైతులు దళారులకు తెగనమ్ముకున్నారు. గత యాసంగిలో తేమ, తాలు, తూకం, తరుగుపేరుతో అనేక కొర్రీలు పెట్టి రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేసిన యంత్రాంగం వానకాలం కొనుగోళ్ల విషయంలోనూ ఆ దిశగానే పయనిస్తున్నట్లు కనిపిస్తోంది.
భారీగా దిగుబడి...అరకొర కేంద్రాలు
జిల్లాలో ఈ వానకాలం వరి సాగు విస్తీర్ణం భారీగా పెరిగింది. గతంలో పత్తి వేసిన రైతులు కూడా నీరు పుష్కలంగా ఉండటంతో వరి సేద్యం చేశారు. గతేడాది ఖరీఫ్‌లో 2.50 లక్షల ఎకరాలకు పైగా పత్తి వేసిన రైతులు ఈ సంవత్సరం 1.90 లక్షల ఎకరాల్లోనే సాగు చేశారు. గతేడాది కంటే మించి సుమారు 50వేల ఎకరాల్లో వరి సాగు విస్తీర్ణం పెరిగింది. ఈ మేరకు దాదాపు ఆరేడు, లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చే అవకాశం ఉంది. కానీ ప్రభుత్వం కేవలం నాలుగు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళ్లు లక్ష్యంగా నిర్ధారించుకుంది. గతేడాది వానకాలం 2.56 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనేందుకు జిల్లా యంత్రాంగం 324 కేంద్రాలు ఏర్పాటు చేసింది. ఈ ఏడాది నాలుగు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు కేవలం 179 కేంద్రాలు మాత్రమే ఏర్పాటు చేయడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. వాస్తవానికి మొదట్లో 4.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యంగా పెట్టుకుని 160 కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీనిపై విమర్శలు రావడంతో లక్ష్యం తగ్గించుకుని స్వల్పంగా కొనుగోలు కేంద్రాలను పెంచారు. ఈ విషయమైౖ అధికారులను ప్రశ్నిస్తే గత వానకాలం కోవిడ్-19 దృష్ట్యా ఎక్కువ కేంద్రాలు ఏర్పాటు చేశామని...ఇప్పుడు కరోనా తగ్గుముఖం పట్టడంతో కేంద్రాలు తగ్గించామనే సమాధానం చెబుతోంది. గతంలో కొనుగోళ్ల సందర్భంగా కొర్రీలు పెట్టిన ప్రభుత్వం...ఇప్పుడు ఆ పని ముందు నుంచే మొదలుపెట్టడంతో రైతుల్లో సందేహాలు తీవ్రమయ్యాయి. ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వ చిత్తశుద్ధిపై నెెలకొన్న సంశయంతో బయట తక్కువ ధరలకు అమ్ముకుంటున్నారు. గత వానకాలం గ్రేడ్-ఏ రకం ధాన్యం క్వింటాల్ రూ.1,888, సాధారణ రకం 1,868 చొప్పున కొనుగోలు చేయగా ఈ ఏడాది గ్రేడ్-ఏ రకం 1,960, సాధారణ రకం 1,940 చొప్పున మద్దతు ధర ప్రకటించారు. వరి విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలు, మొన్నటి యాసంగి ధాన్యం అనుభవాలు, కేంద్రాల సంఖ్య తగ్గించడం తదితర కారణాలతో రైతుల్లో ఆందోళన తీవ్రమైంది. గత వానాకాలం దాదాపు 80% ధాన్యం గిట్టుబాటు ధర పొందిన రైతులు ఈ ఏడాది మద్దతు ధర లభించడం దాదాపు అసాధ్యమనే నిర్ణయానికి వచ్చినట్టున్నారు. క్వింటాల్‌కు రూ.500కు పైగా తక్కువ ధరకు అమ్ముకుంటున్నారు.
తక్కువ కేంద్రాలతోనైనా లక్ష్యం చేరుకుంటాం...
: బి.రాజేందర్, జిల్లా పౌరసరఫరాల అధికారి
గతంకంటే కేంద్రాల సంఖ్య తగ్గిన మాట వాస్తవమే. గతంలో కోవిడ్-19 కారణంగా ఎక్కువ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి కొనుగోళ్లు చేశాం. ఇప్పుడా వైరస్ తీవ్రత తగ్గింది కాబట్టి కొనుగోలు కేంద్రాలను తగ్గించాం. తక్కువ కొనుగోలు కేంద్రాలైనా లక్ష్యం మేరకు నాలుగు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొంటాం. గతంలో వంద, నూటపది కొనుగోలు కేంద్రాల ద్వారా లక్ష్యం మేరకు 2.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొన్న అనుభవం మాకుంది. కాబట్టి కేంద్రాల సంఖ్యతో నిమిత్తం లేకుండా లక్ష్యం చేరుకుంటామనే నమ్మకం మాకుంది. ఇప్పటికే కొనుగోళ్లకు సిద్ధమయ్యాం. రెండు, మూడురోజుల్లో పూర్తిస్థాయిలో కొనుగోళ్లు ప్రారంభిస్తాం. సత్తుపల్లి మండలంలో రెండు, మూడు కేంద్రాలు ఇప్పటికే ప్రారంభించాం.
కొనుగోలు కేంద్రాలు పెంచాలని ఆందోళనలు చేస్తాం...
- మాదినేని రమేష్, తెలంగాణ రైతుసంఘం ఖమ్మం జిల్లా కార్యదర్శి
ఖమ్మం జిల్లాలో ప్రభుత్వ లెక్కల ప్రకారం ఈ వానకాలం 2.90 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. దాదాపు 6 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వమే పేర్కొంది. దానిలో 4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యమే కొంటామని లక్ష్యంగా పెట్టుకుంది. గతేడాది 2.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనేందుకు 324 కేంద్రాలు ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఇప్పుడు దాదాపు డబుల్ సాగు విస్తీర్ణం పెరగ్గా...సగానికి కొనుగోలు కేంద్రాలు తగ్గించడం హాస్యాస్పదంగా ఉంది. 179 కేంద్రాలతోని రైతులు నాలుగు లక్షల మె|| టన్నుల ధాన్యాన్ని ఎలా అమ్ముకుంటారో ప్రభుత్వమే చెప్పాలి. రైతులను ఇబ్బందులకు గురిచేసి వరి సాగుకు దూరం చేయాలనే ప్రయత్నం తప్ప ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదని అర్థమవుతుంది. కొనుగోలు కేంద్రాలను పెంచి..చిత్తశుద్ధితో ధాన్యం కొనుగోలు చేయాలని రైతుసంఘం ఆధ్వర్యంలో ఆందోళనలు నిర్వహిస్తాం.