Authorization
Mon Jan 19, 2015 06:51 pm
టిఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయ
ఇంచార్జీ ఆర్జేసీ కృష్ణ
నవతెలంగాణ-ఖమ్మంకార్పొరేషన్
తెలంగాణా ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్న తర్వాత రాష్ట్ర సాధకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే శుక్రవారం జిల్లాలోని ఆయా నియోజకవర్గాల్లో టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన రైతు ధర్నాను విజయవంతం చేశాయని ఆ పార్టీ జిల్లా కార్యాలయ ఇంచార్జి గుండాల(ఆర్జేసీ) కృష్ణ పేర్కొన్నారు. పార్టీ జిల్లా కార్యాలయం ఖమ్మం తెలంగాణా భవన్లో శనివారం జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులు ధర్నాకు స్వచ్చందంగా వస్తే వారిని చూసి బెదిరించి తీసుకువచ్చారని ఆరోపణలు చేయడం వారి అజ్ఞానాంధకారాన్ని తెలియజేస్తుందని ఎద్దేవా చేశారు. రాష్ట్ర పరిధిలో ధాన్యం సేకరించినా... నిల్వ చేయాలన్నా.... గోదాంలు, అలాగే ఎగుమతి చేయాలన్నా కేంద్ర ప్రభుత్వ అనుమతులు అవసరమని తెలుసుకోవాలన్నారు. తెలంగాణా రాష్ట్ర రైతుల ప్రయోజనాల కోసం పోరాడుతున్న టిఆర్ఎస్ పార్టీపై కాకుండా...కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాలని సవాల్ విసిరారు. ఖమ్మం కార్పొరేషన్ మేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్ బచ్చు విజరుకుమార్, పార్టీ నగర అధ్యక్షులు పగడాల నాగరాజు మాట్లాడుతూ ఖమ్మం నియోజకవర్గంను అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తున్న మంత్రి అజరు కుమార్‌పై అవాకులు, చెవాకులు పేలితే సహించేది లేదన్నారు. ఇప్పటికైనా రాజకీయాలు వీడి అభివృద్ధిలో కలిసి రావాలని హితవు పలికారు. సమావేశంలో పార్టీ మైనార్టీ విభాగం జిల్లా అధ్యక్షులు తాజుద్దీన్‌తో పాటు పలువురు నాయకులు, అనుబంధ విభాగాల బాద్యులు పాల్గొన్నారు.