Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
ప్రజా ఉద్యమాలతో పాటు సేవా కార్యక్రమాల్లోనూ మార్క్సిస్టులుగా ముందున్నామని సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు పేర్కొన్నారు. ఈ నెల 28, 29 తేదీలలో ఖమ్మంలోని భక్త రామదాసు కళాక్షేత్రంలో నిర్వహించే పార్టీ ఖమ్మం జిల్లా 21వ మహాసభల విజయవంతానికి స్థానిక మంచికంటి మీటింగ్ హాల్ లో శనివారం రాత్రి ఏర్పాటు చేసిన ఆహ్వానసంఘ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కరోనా సమయంలో పార్టీ చేపట్టిన ఐసోలేషన్ సెంటర్ ఎంతో మంది పేదలకు ఉపశమనం ఇచ్చిందన్నారు. బీవీకే ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ సేవ కేంద్రం నిర్వహణలో తోడ్పడిన డాక్టర్లు, పార్టీ కార్యకర్తలు, వివిధ సంఘాల బాధ్యులకు కతజ్ఞతలు తెలిపారు. స్థానిక సమస్యల నుంచి జాతీయ సమస్యల వరకు ప్రజల పక్షాన నిత్యం పోరాటం జరుపుతున్నామని చెప్పారు. అనేక నిర్బంధాలను అధిగమిస్తూ ముందుకు సాగుతున్నామన్నారు. రైతు వ్యతిరేక నల్లచట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పోడు, ధాన్యం తదితర సమస్యలపై సీపీఐ (ఎం) ఎడతెగని పోరాటం చేస్తోందన్నారు. పార్టీ నిర్వహిస్తున్న ప్రజా ఉద్యమాలకు అండగా నిలుస్తున్న ప్రతి ఒక్కరికీ కతజ్ఞతలు తెలిపారు. మూడేళ్లకోసారి నిర్వహించే పార్టీ జిల్లా మహాసభలకు అదే స్ఫూర్తితో అండగా ఉండాలని కోరారు. పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు యర్రా శ్రీకాంత్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు ఆహ్వాన కమిటీని ప్రకటించారు. దీనికి సభకు హాజరైన పార్టీ సభ్యులు కరతాళ ధ్వనులతో సమ్మతి తెలిపారు. ఆహ్వాన సంఘం గౌరవ అధ్యక్షులుగా రవి మారుత్, అధ్యక్షులుగా డాక్టర్ యలమంచిలి రవీంద్రనాథ్, ప్రధాన కార్యదర్శిగా యర్రా శ్రీకాంత్, కోశాధికారిగా వై .విక్రం, ఉపాధ్యక్షులుగా వీరారెడ్డి, కొల్లి సత్యనారాయణ, డాక్టర్ చార్లెస్, డాక్టర్ శేషుకుమార్, కార్యదర్శు లుగా డాక్టర్ భారవి, డాక్టర్ బి వి రాఘవులు, బండారు రవికుమార్ , వై. శ్రీనివాసరావు, బండి రమేష్, మువ్వా శ్రీనివాసరావు, కార్పొరేటర్ యల్లంపల్లి వెంకట్రావు, యర్రా శ్రీను, మాచర్ల భారతి, రమణారెడ్డి, మరి కొందరు ఎన్నికయ్యారు. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు పొన్నం వెంకటేశ్వరరావు, ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ రాష్ట్ర నాయకులు ఐవీ రమణ, తదితరులు పాల్గొన్నారు.