Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ ఏ ఒక్కరి నుండి దరఖాస్తు తీసుకోలేదన్న ఫిర్యాదు రావద్దు
అ జిల్లా కలెక్టర్ అనుదీప్
నవతెలంగాణ-కొత్తగూడెం
పోడు దరఖాస్తుల స్వీకరణ ఈ నెల 18వ తేదీ వరకు చేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు. పోడు దరఖాస్తులు స్వీకరణ, ధరణి, నిషేదిత భూముల సంరక్షణ తదితర అంశాలపై క్యాంపు కార్యాలయం నుండి రెవిన్యూ అధికారులతో టెలి కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అడవుల లోపల నివసించే ప్రజలకు పోడు భూముల సమస్య పరిష్కారానికి దరఖాస్తు చేసుకోవాలన్న అంశంపై అవగాహన ఉండదని, సమాచారం కూడా వారికి సరిగా తెలియకపోవచ్చునని కాబట్టి అటువంటి వారికి తెలియచేసి వారి నుండి దరఖాస్తులు స్వీకరించాలని చెప్పారు. ఏ ఒక్కరి నుండి దరఖాస్తు తీసుకోలేదన్న ఫిర్యాదు మనకు రావొద్దని ఆయన సూచించారు. ఈ నెల 17వ తేదీ వరకు పోడు భూమి సమస్య ఉన్న అన్ని ఆవాసాల ప్రజల నుండి అటవీ హక్కుల కమిటి క్లెయిమ్స్ స్వీకరణ జరుగుతుందని, ఏదేని కారణాల వల్ల క్లెయిమ్స్ ఇవ్వని వారికి ఒక రోజు అనగా 18వ తేదీన అవకాశం కల్పించినట్లు చెప్పారు. 18వ తేదీతో క్లెయిమ్స్ స్వీకరణ పూర్తయివుతుందని కావున ప్రజలు సకాలంలో క్లెయిమ్స్ ఇవ్వాలని, ఇట్టి అవకాశాన్ని పోడు దారులు సద్వినియోగం చేసుకుని క్లెేములను అందచేయాలన్నారు. సోమవారం నుండి అన్ని టీములు ఉదయం 8 గంటలకే గ్రామాలకు వెళ్లాలని, రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున ప్రజలకు అందుబాటులో ఉండాలని చెప్పారు. క్లెయిమ్స్ మాత్రమే తీసుకోవాలని, విచారణ ప్రక్రియ చేపట్టొద్దని ఆయన పేర్కొన్నారు. ధరణిలో వచ్చిన ప్రతి దరఖాస్తును పరిష్కరించు విధంగా చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లును, డిఆర్డీ అశోక్ చక్రవర్తికి సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కర్నాటి వెంకటేశ్వర్లు, డిఆర్డీ అశోకచక్రవర్తి, ఆర్డీఓ స్వర్ణలత, అన్ని మండలాల తహసిల్దారులు, యంపిడిఓలు, యంపిఓలు తదితరులు పాల్గొన్నారు.
18వ తేదీ వరకు మద్యం దుకాణాల ధరఖాస్తుల స్వీకరణ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 18వ తేదీ వరకు మద్యం దుకాణాలు ఏర్పాటుకు ధరఖాస్తులు స్వీకరణకు అవకాశం ఉన్నదని జిల్లా కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ తెలిపారు. ఆదివారం క్యాంపు కార్యాలయం నుండి 2021-23 సంవత్సరాలకు మద్యం దుకాణాలు ఏర్పాటుకు లైసెన్సులు జారీ, 20వ తేదీన ఖమ్మవారి కళ్యాణమండపంలో డ్రా నిర్వహణకు ఏర్పాట్లు తదితర అంశాలపై ఎక్సైజ్ అధికారులతో టెలి కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 88 మద్యం దుకాణాలకు లైసెన్సులు జారీ చేయాల్సి ఉన్నదని చెప్పారు. 88 మద్యం దుకాణాలకు గాను 44 ఎస్టీలకు, 7 ఎస్సీలకు, గౌడకు 6 మద్యం దుకాణాలు రిజర్వు చేయడం జరిగిందని మిగిలిన 31 మద్యం దుకాణాలను జనరల్ కేటగిరీలకు కేటాయించినట్లు చెప్పారు. ఈ నెల 18వ తేదీ కార్యాలయపు పని వేళల వరకు మద్యం దుకాణాలు కేటాయింపునకు కొత్తగూడెంలోని ఎక్సైజ్ ఈఎస్ కార్యాలయంలో దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందన్నారు. ఈ నెల 20వ తేదీన కమ్మవారి కళ్యాణ మండపంలో నిర్వహించే లాటరీ కార్యక్రమాన్ని వీడియో కవరేజి చేయుటకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఎంట్రీ పాసు ఉన్న వ్యక్తులను మాత్రమే హాలులోకి అనుమతించాలన్నారు. శనివారం వరకు 191 దరఖాస్తులు వచ్చాయని చెప్పారు. ఈ టెలి కాన్ఫరెన్సులో అదనపు కలెక్టర్ కర్నాటి వెంకటేశ్వర్లు, ఎక్సైజ్ ఈఎస్ నరసింహారెడ్డి, డిఆర్డీఓ అశోకచక్రవర్తి, ఎక్సైజ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.