Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కూసుమంచి
మండలంలో ఆర్.ఐ వసీం పెరికసింగారానికి సంబంధించిన భూఆక్రమణ విషయంలో రూ.30,000 విలువ చేసే గొర్రెపోతులు ఇస్తే పని చేస్తానని చెప్పడం అప్పుచేసి గొర్రెపోతులు ఇచ్చానని, అయినా సంవత్సరం తిప్పి మళ్లీ ఇప్పుడు నీ ఫైలు మూలమడత వరకు వచ్చి ఆగింది. మళ్లీ ఒకనెట్టుడు నెట్టాలంటూ అర్దంకాని బాషలో మాట్లాడుతూ ఇబ్బంది పెడుతున్నాడని పెరికసింగారానికి చెందిన రైతు పెదవీటి రామిరెడ్డి గురువారం తహశీల్దార్ శిరీషకి వినతిపత్రం అందజేశారు.
దీంతో పాటు పాసుపుస్తకాలు పేరుతో, పాతపహానీలని, సర్వే రిపోర్టు అనే పేరుతో తమ వద్ద డబ్బులు గుంజీ మొండిచేయి చూపిస్తున్నా అధికారులపై చర్యలు తీసుకొని న్యాయం చేయాలని లింగరాంతండాకు చెందిన వడ్తియా చంద్రు, వడ్తియా మంగులు కూడా వినతిపత్రం సమర్పించారు.
ఇవేగాక గట్టుసింగారంలో మట్టితోలకం విషయంలో ఆర్ఐ వసీం అవినీతికి పాల్పడ్డారని మండలంలో గిరిజనులు, దళితులు, పేదలు తమ పనుల నిమిత్తం వచ్చిన వారితో బహిరంగంగానే డబ్బులు ఇస్తేనే పని అంటూ మాట్లాడుతూ ప్రజలను ఇబ్బందులు పెడుతున్నాడని, దీనిని అరికట్టేందుకు అతనిపై చర్యలు తీసుకోవాలని సీపీఐ(ఎం) మండల కార్యదర్శి బారి.మల్సూర్ వినతిపత్రం సమర్పించారు.
దీనిపై తహశీల్దార్ శిరీష దాదాపు రెండు గంటలు ఓపికగా విని వెంటనే విచారణ జరిపి తగుచర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. తమ డిపార్ట్ మెంటు లో ఇకపై ఎవ్వరికి ఒక్క రూపాయి కూడా ఇవ్వవద్దని, నేనే స్వయంగా అన్ళి ఫైళ్లు పరిశీలించి తాత్సారం లేకుండా పనిచేస్తానని ఎవరైనా డబ్బులు అడిగితే వెంటనే ఫిర్యాదు చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం కార్యదర్శి హళావత్ బాసునాయక్, దేవళ్ళ తిరపయ్య, బికనా, సీపీఐ(ఎం) మండల కమిటీ సభ్యులు ఉల్లోజు కర్ణబాబు, శీలం జానయ్య తదితరులు పాల్గొన్నారు.