Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ కలెక్టర్ అనుదీప్
నవతెలంగాణ-కొత్తగూడెం
ఎటువంటి సమస్య రాకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియ జరగాలని కలెక్టర్ అనుదీప్ అధికారులను ఆదేశించారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియపై గురువారం పౌర సరఫరాల సంస్థ, డీఆర్డిఓ, సహాకార, వ్యవసాయ, మార్కెటింగ్, జిసిసి, కొనుగోలు కేంద్రాల ఇన్చార్జీలతో టెలి కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కొనుగోలు ప్రక్రియ సజావుగా సక్రమంగా రైతులకు ఇబ్బంది కలుగకుండా జరగాలని చెప్పారు. రైతన్నలు ధాన్యాన్ని బాగా ఆరబెట్టి కొనుగోలు కేంద్రాలకు తేవాలని తెలిపారు. వాతారణంలో ప్రతికూల పరిస్థితులున్నాయని, వర్షాలు వచ్చే అవకాశం ఉన్నదని ధాన్యం తడవకుండా జాగ్రత్త చేయాలని చెప్పారు. కొనుగోలు ప్రక్రియలో జాప్యం చేయొద్దని, రైతులు విక్రయానికి వచ్చిన తరువాత వేచియుంచకుండా కొనుగోలు చేస్తామనే ధోరణి వద్దని సర్వం సన్నద్ధంగా ఉండాలని చెప్పారు. షెడ్యూలు ప్రకారం ధాన్యం విక్రయాలు నిర్వహణకు కొనుగోలు కేంద్రాలకు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు. అకాల వర్షాలు వచ్చే అవకాశం ఉన్నందున ధాన్యం నిల్వలు తడవకుండా టార్ఫాలిన్లు సిద్ధంగా ఉంచాలని, టార్పాలిన్లు లేకపోతే దాన్యం తడిసి తీవ్రమైన నష్టం వాటిల్లే అవకాశం ఉన్నట్లు చెప్పారు. కొనుగోలు జరిగిన తరువాత ధాన్యాన్ని రవాణా చేసేందుకు వాహనాలు అందుబాటులో ఉండే విధంగా చూడాలని చెప్పారు. రైతుల రిజిస్ట్రేషన్ అవసరమని ఆధార్ అనుసంధానం చేయాలని చెప్పారు. రెవిన్యూ గ్రామం వారిగా మొబైల్ ఆధార్ అనుసంధానం చేసిన జాబితాను సిద్ధం చేయాలని, ఇది చాలా ముఖ్యమైన ప్రక్రియని చెప్పారు. సహకారశాఖ ద్వారా 108, డీఆర్డిఓ 11, జీసీసీ ద్వారా 29 కేంద్రాలు, మార్కెటింగ్ శాఖ ద్వారా 6 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. చెక్లీస్ట్ ప్రకారం కొనుగోలు కేంద్రాలు సంసిద్ధంగా ఉండాలని, తనిఖీలు నిర్వహణలో ఏర్పాట్లుతో లోటుపాట్లు ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గన్నీ సంచుల కొరత లేకుండా ఎప్పటికప్పుడు కొనుగోలు కేంద్రాల ఇన్చార్జి నుండి ఇండెంట్ తీసుకొని తక్షణమే గన్ని సంచులు సరఫరా చేయాలని చెప్పారు.
ప్రభుత్వ మార్గదర్శకాలు మేరకు రైతులు తేమ శాతం 17 ఉన్న నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తేవాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ టెలికాన్ఫరెన్సులో అదనపు కలెక్టర్ కర్నాటి వెంకటేశ్వర్లు, డీఎస్ఓ చంద్రప్రకాశ్, పౌర సరఫరాల సంస్థ డీఎం టీఎస్వి.ప్రసాద్, సహాకార అధికారి వెంకటేశ్వర్లు, డీఆర్డిఓ మధుసూదన్ రాజు, వ్యవసాయ అధికారి కె.అభిమన్యుడు, జీసీసీ జీఎం వాణి, మార్కెటింగ్ పర్యవేక్షకులు నరేందర్, అన్ని మండలాల వ్యవసాయ అధికారులు, కొనుగోలు కేంద్రాల ఇన్చార్జీలు, తదితరులు పాల్గొన్నారు.