Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎంపీడీవోలకు కలెక్టర్ గౌతమ్ ఆదేశం
నవతెలంగాణ - ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
మండలంలో అభివద్ధి పనులను పూర్తిచేసే బాధ్యత మండల ప్రజా పరిషత్ అభివృద్ధి అధికారులదేనని జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్ అన్నారు. గురువారం సాయంత్రం ఎం.పి.డి.ఓలు, ఎం.పి.ఓలు, ఏ.పి.ఓలు, మండల వ్యవసాయ శాఖాధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో పనుల పురోగతిని కలెక్టర్ సమీక్షించారు. నర్సరీల నిర్వహణ, ప్రయివేటు స్థలాలలోని నర్సరీలను ప్రభుత్వ స్థలాలలోకి మార్చడం, బహత్ పల్లె ప్రకృతి వనాలు, రైతు కల్లాల ఏర్పాటు, ఉపాధి హామీ పనులు, ఎవెన్యూ ప్లాంటేషన్, అనధికారిక లేఅవుట్లు తదితర అంశాలపై కలెక్టర్ మండలాల వారీగా సమీక్షించి ఎం.పి.డి.ఓలకు పలు ఆదేశాలు చేసారు. ప్రభుత్వ స్థలాలలోకి వెంటనే నర్సరీలను తరలించాలన్నారు. రహదారుల వెంట ఖాళీ ఉన్న ప్రదేశాలలో మొక్కలు నాటాలని, ఇప్పటికే నాటిన మొక్కల సంరక్షణ చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. ఎవెన్యూ ప్లాంటేషన్ కు సంబంధించి గ్రామాల పరిధిలో మొక్కలు నాటడం లేదని, అదేవిధంగా పిచ్చి మొక్కల తొలగించడం లేదన్నారు. ఎం.పి.డి.ఓలు దీనిపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. బహత్ పల్లె ప్రకృతి వనాల ఏర్పాటు పనులను మరింత వేగవంతం చేయాలన్నారు. ఉపాధి హామీపై ప్రతి మండలంలో ప్రతిరోజు కనీసం మూడు వేల మంది కూలీలు పనిచేసే విధంగా అభివృద్ధి పనులను చేపట్టాలన్నారు. గ్రామ సర్పంచ్ లతో సమావేశమై గ్రామాలలో చేపట్టే అభివద్ధి పనులను ఉపాధి హామి పథకం కింద చేపట్టేలా సత్వర చర్యలు తీసుకోవాలని ఎం.పి.డి.ఓలను కలెక్టర్ ఆదేశించారు. రైతులందరూ కల్లాలను నిర్మించుకునేలా చూడాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. రైతు కల్లాలు నిర్మించుకున్న రైతులకు వెంటనే బిల్లుల చెల్లింపులు చేస్తామన్నారు. కల్లాల వల్ల కలిగే ప్రయోజనాలను వ్యవసాయ విస్తరణాధికారులు రైతులకు తెలియజేయాలని కలెక్టర్ ఆదేశించారు. గ్రామ పంచాయతీ స్థాయిలో ఉన్న అనధికారిక లేఅవుట్లపై తగు చర్యలు తీసుకో వాలన్నారు. గ్రీన్ బెల్ట్‌ను అభివృద్ధి చేయాలని ఎం.పి.డి.ఓలను కలెక్టర్ ఆదేశించారు. జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి విద్యాచందన, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి అప్పారావు, జిల్లా వ్యవసాయ శాఖాధికారి విజయనిర్మల, డివిజనల్ పంచాయతీ అధికారులు పుల్లారావు, ప్రభాకరరావు, ఏ.పి.డి.లు, ఎం.పి.డి.ఓలు, ఏ.ఇ.ఓలు తదితరులు వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.