Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
పిల్లలు లేని దంపతులు చట్టబద్ధంగా దత్తత తీసుకునే విధివిధానాలపై జిల్లాలో విస్తృత ప్రచారం నిర్వహించాలని కలెక్టర్ వి.పి.గౌతమ్ సూచించారు. కలెక్టర్ చాంబరులో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో గురువారం నిర్వహించిన సమావేశంలో దత్తత ప్రక్రియ- అవగాహన ప్రచార కార్యక్రమాలపై అధికారులకు దిశా నిర్దేశం చేశారు. దత్తత ప్రచార పోస్టర్లు జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రితో పాటు అన్ని ప్రయివేటు ప్రసూతి ఆసుపత్రులు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ప్రదర్శించాలన్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, స్త్రీ, శిశు సంక్షేమ శాఖాధికారులు సమన్వయంతో పనిచేసి ఐదు సంవత్సరాలకు పైబడిన పిల్లలు లేని దంపతులను గుర్తించి, దత్తత పట్ల అవగాహన కల్పించాలన్నారు. సమాజంలో ఆర్థిక, సామాజిక పరిస్థితుల కారణంగా దత్తతకు ముందుకు రాని వారుంటారన్నారు. అటువంటి వారికి సమగ్ర అవగాహన కల్పించాలన్నారు. ప్రయివేటు ఆసుపత్రుల ప్రసూతి వైద్య నిపుణులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి దత్తత ప్రక్రియను వివరించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిని కలెక్టర్ ఆదేశించారు. పేదరికంతో పిల్లలను పోషించలేని తల్లి దండ్రులు, అవాంఛిత గర్భందాల్చడం ద్వారా పుట్టిన పిల్లలను పెంచేందుకు ఇష్టం లేకపోతే మహిళా శిశు సంక్షేమ శాఖ దృష్టికి తేవాలన్నారు. పిల్లలను చట్టబద్ధంగా అప్పగించాలన్నారు. అలా అప్పగించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. ఆ పిల్లలను దత్తత ఇస్తామన్నారు. ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా.మాలతి, జిల్లా సంక్షేమ శాఖాధికారి సంధ్యారాణి, జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.వెంకటేశ్వర్లు, బాలల హక్కుల సంరక్షణ జిల్లా అధికారి విష్ణు వందన, జిల్లా సర్వేలెన్స్ అధికారి డా.రాజేష్, డా.సైదులు తదితరులు పాల్గొన్నారు.