Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ఖమ్మం
ఖమ్మం జిల్లాలోని ఎస్సీ వసతిగృహం, గురుకుల సంక్షేమ హాస్టల్స్లో ప్రమాదాలకు నిలయంగా మారాయి. బుధవారం రాజేష్ అనే విద్యార్థి గురుకుల సంక్షేమ హాస్టల్స్ భవనంపై నుంచి దూకిన సంఘటన మరువకముందే తిరుమలాయపాలెం మండలం జల్లేపల్లిలో ఉన్న ఎస్సీ వసతిగృహంలో 9వ తరగతి చదువుతున్న గోగుల ఉదరు కిరణ్(13) బుధవారం రాత్రి మూత్రవిసర్జనకు వెళ్లాడు. ఆ చీకటిలో ఒక పాము విద్యార్థి కాలుకు కాటేసింది. కంగారు పడిన విద్యార్థి వసతిలో పనిచేస్తున్న -సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు వేగంగా స్పందించి ఖమ్మంలోని ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్సను అందించడంతో విద్యార్ధి ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. కలెక్టర్ గౌతమ్ ప్రత్యేక దృష్టి సారించి ప్రభుత్వాసుపత్రి వైద్యులతో మాట్లాడే మెరుగైన చికిత్స అందిం చడంతో పరిస్థితి చక్కబడింది.
ఈ రెండు ఘటనలను గోప్యంగానే ఉంచారు. ఇవి గురు వారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. ఇటీవల ఓ విద్యార్ధి సంఘం జిల్లాలో వసతిగృహాలను పరిశీలించగా, కొంతమంది వార్డెన్లు స్థానికంగా నివాసం ఉండకపోవడంతో పాటు విధుల పట్ల సమయపాలన పాటించడం లేదనే విషయం వెలుగులోకి వచ్చింది. తమ పిల్లలు బాగా చదువుకొని మంచి ఉద్యోగం సాధించాలనే ఆశతో వారి తల్లిదండ్రులు విద్యార్థులను వసతిగృహాలకు, గురుకులాలకు పంపిస్తున్నారు. అయితే జిల్లాలో కొంతమంది సిబ్బంది, సంక్షేమాధికారుల నిర్లక్ష్యం విద్యార్థుల పాలిట శాపంగా మారుతోంది. ఒక్కో సందర్భంలో విద్యార్థుల ప్రాణాలపైకి వస్తోంది. ఈ విషయంపై ఉన్నతాధికారులు స్పందించి హాస్టళ్లను తనిఖీ చేసి ప్రమాదాలు జరగకుండా చూడాలని తల్లిదండ్రులు వేడుకుంటున్నారు.