Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వైరా
వైరాలోని మధిర రోడ్డులో ఉన్న సైదులు దర్గా దర్శనం దోపిడీకి నిదర్శనంగా ఉన్నదని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భక్తుల నుండి అడ్డగోలుగా దోచుకుంటున్నారని, వారిచ్చే రసీదుపై తీసుకున్న నగదు అంకెను వేయకుండా, బయట ప్రపంచానికి ఈ దోపిడీ పద్ధతి తెలియకుండా చాలా తెలివిగా వ్యవహరిస్తున్నారని భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భక్తులకు దర్గా ప్రదేశంలో కనీస సౌకర్యాలు కూడా కల్పించకుండా అందిన కాడికి దోచుకోవడమే లక్ష్యంగా పాలక వర్గం పనిచేస్తున్నట్లు ఆరోపణలు వినవస్తున్నవి. ఈ దర్గా గత 40 ఏళ్ల నుండి కొంతమంది వ్యక్తుల చేతిలో ఉండి భక్తుల కొంగుబంగారం గా కాక పాలక వర్గ కుటుంబాల బంగారు బాతుగా మారిపోయింది. అయినా దర్గాపై విశ్వాసం కలిగి ఉన్న ఖమ్మం జిల్లా భక్తులతో పాటు జిల్లాకు సరిహద్దులో ఉన్న ఆంధ్ర ప్రాంత భక్తులు కూడా పెద్ద సంఖ్యలో వస్తుంటారు. కుల మతాలకతీతంగా ప్రతి శుక్రవారం పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు. దర్గాపై భక్తులకు ఉన్న నమ్మకం పాలకవర్గ సభ్యులకు వరంగా మారింది. దర్గాలో భక్తులు మొక్కులు తీర్చుకునేందుకు కోళ్లను, మేకపోతులను బలిస్తుంటారు. మేకపోతును బలి ఇవ్వటానికి రూ 970లు, హలాల్ చేయటానికి రూ 700/- లు తీసుకుంటున్నారు. వారిచ్చే రసీదుపై 970 గాని, 700 రూ //లు కాని అంకె వేసి ఇవ్వరు. ఇలా వసూలు చేయటం వలన పాలక వర్గం నియమించిన సిబ్బంది కూడా కొంత సొంత బొక్కసానికి పంపుతున్నట్లు భక్తులు ఆరోపిస్తున్నారు. నూతనంగా మోటారు బైక్లు, కార్లు, ఆటోలు కొన్నవారు పూజలకొస్తే వారు అడిగినంత ఇచ్చుకోవాల్సి ఉంటుంది. ఖాళీ రసీదులు ఇవ్వటం, తెల్ల కాగితంపై రాసి ఇవ్వటం భక్తుల ఆరోపణలను బలపరుస్తున్నవి. శుక్రవారం కొణిజర్ల మండలంకు చెందిన ఒక ముస్లిం కుటుంబం మొక్కులు తీర్చుకోవటానికి రాగా మేకపోతును బలిచ్చినందుకు 970, హలాల్ చేయటానికి 700 రూపాయలు తీసుకుని ఖాళీ రసీదు ఇచ్చారు. ఆ కుటుంబంలో ఒకరు ఖాళీ రసీదు విషయమై ప్రశ్నించగా రసీదు వెనక భాగంలో 970 అని పొడి సంఖ్య వేసి ఇచ్చారు. ఇలా దర్గా వసూళ్లు సాగుతున్నవి. భక్తుల వాహనాలకు పార్కింగు ప్రదేశం లేదు. వైరా మధిర ఆర్అండ్బీ రోడ్డుపై అడ్డదిడ్డంగా వాహనాలను నిలపటంతో ప్రమాదాలకు కారణం అవుతున్నవి. లక్షల్లో ఆదాయం వస్తున్నా కనీస సౌకర్యాలు కల్పించటంలో మాత్రం పాలకవర్గం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారని భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. సరైన మరుగుదొడ్లు లేవు. మహిళా భక్తులు పోర్లు ప్రదర్శనలు చేసి స్నానాలు చేయటానికి స్నానాల గదులు లేక మహిళా భక్తులు నానా అవస్థలు పడుతున్నారు. వర్షపు చినుకు పడితే ప్రాంగణంలో అడుగు పెట్టడం బహుకష్టం. ఒకే రేకుల షెడ్డు వంట చేయుటకు వేశారు. అది ఒకరిద్దరికి మాత్రమే సరిపోతుంది. ఇక ఎంత మంది వచ్చినా చెట్లకింద, టెంట్ల కింద ఉండి పోవాల్సిందే. ఆ సమయంలో వర్షం వస్తె వారి భోజనాలు, ఫంక్షన్ రచ్చ రచ్చగా మారిపోయి నిరాశతో వెనుదిరిగటం జరుగుతుంది. వైరా బస్టాండు నుండి మధిర రోడ్డు కిరువైపుల నుండి వచ్చే వర్షం నీరు దర్గా దగ్గరే కేంద్రీకృతమై రోజుల తరబడి నిల్వ ఉండి పచ్చగా నాచు పుట్టి దుర్గందంగా మారుతుంది. ఇంత అధ్వానంగా ఉన్న దర్గాకు వచ్చే భక్తులు వారి ఆరోగ్యాలను ఫణంగా పెట్టీ మొక్కులు తీర్చుకుంటారు. ఈ దర్గాపై వక్ఫ్ బోర్డు, గాని కనీసం మునిసిపల్ అధికారులు కాని దృష్టి పెట్టక పోవటం వలన పాలక వర్గానికి ఏ బాదరా బందీ లేకుండా సొమ్ము వచ్చి పడుతుంది.