Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నల్ల చట్టాలకు వ్యతిరేకంగా
పోరాడిన రైతులకు శుభాకాంక్షలు
రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజరు
నవతెలంగాణ - ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేసే వరకు ఏడాది కాలం పోరాడి విజయం సాధించిన రైతులకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజరు కుమార్ శుభాకాంక్షలు తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా కేంద్రం నల్ల చట్టాలను వెనక్కి తీసుకోవడం రైతుల విజయంగా అభివర్ణించారు. ముఖ్యమంత్రి కేసిఆర్ రైతులకు బాసటగా ఉద్యమం చేస్తానని గర్జించడంతోనే కేంద్రం దిగి వచ్చిందన్నారు. ఇటీవల ఖమ్మం కలెక్టరేట్ వద్ద నిర్వహించిన రైతు దీక్షలో ప్రజా వ్యతిరేక ప్రభుత్వాల మెడలు వంచడంలో కేసిఆర్ కు వెన్నతో పెట్టిన విద్య అని చెప్పానని, అది నేడు అక్షరాల నిజమైందన్నారు. రైతులతో పెట్టుకున్న ఏ ప్రభుత్వం మనగలగ లేదన్నారు. ఏడాది కాలంగా పంజాబ్, గుజరాత్, హర్యానా లాంటి రాష్ట్రాల రైతులు ఢిల్లీలో ఉద్యమాలు చేసినా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. ఆ చట్టాల వల్ల సన్న, చిన్నకారు రైతులకు అన్యాయం జరుగుతుందన్నారు. కార్పొరేట్ సంస్థలకు మేలు చేసే చట్టాలను ఉపసంహరించమని అడిగితే రైతులపైనే దాడి చేసి అణచివేతకు గురి చేశారన్నారు. అనాలోచితంగా తీసుకొచ్చిన చట్టాలను టీఆర్ఎస్ పార్టీ చేసిన మహాధర్నాను దష్టిలో పెట్టుకుని, అవసరమైతే దేశంలో రైతుల పక్షాన పోరాటానికి నాయకత్వం వహిస్తానని ముఖ్యమంత్రి కేసిఆర్ ప్రకటించడంతో ఆ చట్టాలను రద్దు చేశారని పేర్కొన్నారు. రైతు సమస్యలు, రైతు ప్రయోజనాల పట్ల చిత్తశుద్ధి, ఆలోచన లేకపోవడం నాటి నిర్ణయానికి నిదర్శనమన్నారు. నాడు 69 ఏళ్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షను అన్ని ప్రభుత్వాలు నీరుగారిస్తే...కేసిఆర్ కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేర్చారన్నారు. నేడు అదే తరహాలో బిజెపి మెడలు వంచి నల్ల చట్టాలను వెనక్కి తీసుకొనేలా చేశారని తెలిపారు. దేశ రైతాంగానికి మోడీ క్షమాపణ చెప్పడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు వ్యవసాయరంగాన్ని నిర్లక్ష్యం చేశాయని అందుకే రైతుల కోసం అధికారంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం రోడ్డెక్కి ధర్నాలు చేసే దుస్థితి వచ్చిందన్నారు. తెలంగాణ వరిని కేంద్రం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ చట్టాలు వెనక్కి తీసుకోవడం కేసీఆర్ విజయం, మహాధర్నా విజయమని పేర్కొన్నారు.