Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొత్తగూడెం
రైతు, ప్రజా, కార్మికోద్యమాలకు ఏ ప్రభుత్వమైనా తలవంచక తప్పదని వామపక్ష, విపక్ష పార్టీల జిల్లా నేతలు పునరుద్ఘాటించారు. సాగు చట్టాలను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రకటించడంపై సీపీఐ, సీపీఐ(ఎం), కాంగ్రెస్, న్యూడెమోక్రసీ పార్టీలు, తెదేపా, టీజేఎస్, అనుబంధ రైతు సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం సీపీఐ జిల్లా కార్యాలయం శేషగిరిభవన్లో విజయోత్సవ సభ నిర్వహించారు. తొలత సీపీఐ కార్యాలయం ఎదుట బానసంచా కాల్చి స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం ఉద్యమంలో అమరులైన రైతు అమరవీరులకు నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటైన సభలో సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, సీపీఐ(ఎం) రాష్ట్ర నాయకులు కాసాని ఐలయ్య, కాంగ్రెస్ జిల్లా నాయకులు నాగసీతారాములు, లక్కినేని సురేందర్, న్యూడెమోక్రసి జిల్లా కార్యదర్శి ఆవునూరి మధు, న్యూడెమోక్రసి జిల్లా నాయకులు వూక్లా మాట్లాడారు. కార్పొరేట్ శక్తులు, దళారీలకు అనుకూలంగా, అన్నం పెట్టే రైతన్నను దివాలా తీయించే విధంగా రూపొందించిన సాగు చట్టాలను రద్దు చేస్తూ ప్రధాని మోడీ ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. ఇప్పటికైనా రైతు కష్టాలు, నష్టాలపై కేంద్రం స్పందించడం హర్షణీయమన్నారు. సాగుచట్టాలను పూర్తిగా రద్దు చేయాల్సిందేనని, మార్పులు, చేర్పులను అంగీకరించబోమని, భవిష్యత్తులో ఏ ప్రభుత్వం వాటి జోలికి వెల్లవద్దని హెచ్చరించారు. ఇకనైనా బుద్ధి తెచ్చుకొని కేంద్రంలోని మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలోని కేసీఆర్ ప్రభుత్వం రైతు, కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలకు స్వస్తి చెప్పాలన్నారు. కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేసే చర్యలు మానుకోవాలని హెచ్చరించారు. దేశానికి అన్నంపెట్టే రైతన్నకు బాసటగా సుధీర్గపోరాటంలో భాగస్వామ్యమైన విపక్ష పార్టీలకు, రైతు, ప్రజా సంఘాలకు వారు అభినందనలు తెలిపారు. ఇదే స్పూర్తితో ప్రజా వ్యతిరేక విధానాలకు తిప్పికొట్టే పోరాటాల్లో భాగస్వామ్యం కావాలని పిలుపు నిచ్చారు. సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె.సాబీర్ పాషా, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య అధ్యక్షతన తరిగిన సభలో సీపీఐ జిల్లా నాయకులు గుత్తుల సత్యనారాయణ, దమ్మాలపాటి శేషయ్య, కందుల భాస్కర్, గెద్దాడు నగేష్, కె.రత్నకుమారి, మేదిని లక్ష్మి, విజయలక్షి, సీపీఐ(ఎం) నాయకులు అన్నవరపు సత్యనారాయణ, జాటోతు కృష్ణ, నబీ, రేపాకుల శ్రీను, కొండపల్లి శ్రీధర్, లిక్కి బాలరాజు, భూక్యా రమేష్, జునుమాల నగేష్, న్యూడెమోక్రసి జిల్లా నాయకులు పి.సతీష్, కందగట్ల సురేందర్, తదితరులు పాల్గొన్నారు.
భద్రాచలం : సంవత్సర కాలంగా కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు రైతు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న పోరాట ఫలితమే మోడీ ప్రకటించిన రైతు చట్టాల రద్దు అని సీపీఐ(ఎం) రాష్ట్ర నాయకులు ఏజే.రమేష్ అన్నారు. ఏడాది కాలంగా రైతులు వామపక్ష నాయకులు చేసిన కృషికి ఫలితంగా నేడు రైతు చట్టాలు రద్దు చేయబడ్డాయని పేర్కొన్నారు. శుక్రవారం వామపక్ష నాయకులు కార్యకర్తలు భద్రాచలంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. చర్ల రోడ్డు కొత్త మార్కెట్ నుంచి విజయోత్సవ ర్యాలీ ప్రారంభించిన వామపక్ష నాయకులు అంబేద్కర్ సెంటర్ మీదుగా బ్రిడ్జి సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రైతు చట్టాల రద్దు ప్రకటనలకు మాత్రమే పరిమితం కాకుండా పార్లమెంటులో ఆమోదించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇప్పటివరకు రైతుల పోరాటంలో సుమారు 700 మంది రైతులు ప్రాణాలు అర్పించారని ఆయన అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం ఒక రోజు దీక్ష చేసి మా దీక్ష వల్లే మోదీ రైతు చట్టాలు రద్దు చేశారని గొప్పలు చెప్పుకుంటున్నారని, ఈ రైతు వ్యతిరేక చట్టాలు కేసీఆర్ ప్రభుత్వం వల్ల రద్దు చేయలేదని రైతులు, వామపక్ష నాయకులు చేసిన కృషికి రద్దు చేయబడ్డాయని ఆయన అన్నారు. అదేవిధంగా రైతు చట్టాలపై కేసీఆర్ అవకాశ వాద వైఖరి వీదనాడాలన్న సీపీఐ పట్టణ సమితి కార్యదర్శి సునీల్ అన్నారు. అలాగే రైతాంగానికి అపూర్వమైన మద్దతు పలికిన భారత ప్రజలకు, తెగువతో పోరాడిన రైతాంగానికి విప్లవ జేజేలని ఎన్డీ జిల్లా నాయకు రాలు కెచ్చెల కల్పన అన్నారు. సీపీఐ(ఎం) పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి అధ్యక్షతన అంబేడ్కర్ సెంటర్లో అమరవీరుల స్టుపాల వద్ద జరిగిన సభ, ప్రదర్శనలో సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు కే.బ్రహ్మచారి, యం.బి.నర్సారెడ్డి, సీపీఐ నాయకులు సాయి కుమార్, విశ్వనాథ్, శ్రీరాములు, సీపీఐ(ఎం) పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు సంతోష్, సున్నం గంగ, లీలావతి, పట్టణ కమిటీ సభ్యులు లక్ష్మి,నాగరాజు, భూపెందర్, లక్ష్మణ్, కోరాడ శ్రీనివాస్, చేగొండ శ్రీనివాస్, జ్యోతి, యం.వి.యస్ నారాయణ తదితరులు పాల్గొన్నారు.